సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

యు పి ఎస్ సి, ఎస్ ఎస్ సి వంటి నియామక పరీక్షలు, నీట్, జె ఇ ఇ , సి యు ఇ టి వంటి ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, అవకతవకలు, వ్యవస్థీకృత అవకతవకలను అరికట్టేందుకు 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమ మార్గాల నివారణ) బిల్లు-2024' పేరుతో లోక్ సభ లో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం


ఆర్థిక ప్రయోజనాల కోసం అన్యాయమైన మార్గాలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలు, సంస్థలను నిరోధించడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది: అయితే బిల్లు లోని నిబంధనలు అభ్యర్థులకు రక్షణ కల్పిస్తాయి:డాక్టర్ జితేంద్ర సింగ్

ఆన్లైన్ , టెక్నాలజీ ఆధారిత పరీక్షల కోసం పక్కా ఐటీ భద్రతా వ్యవస్థను రూపొందించేందుకు ప్రోటోకాల్ ను అభివృద్ధి చేయడానికి పబ్లిక్ పరీక్షలపై ఉన్నత స్థాయి జాతీయ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తాం: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 05 FEB 2024 4:17PM by PIB Hyderabad

యు పి ఎస్ సి, ఎస్ ఎస్ సి వంటి నియామక పరీక్షలు, నీట్, జె ఇ ఇ , సి యు ఇ టి  వంటి ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, అవకతవకలు, వ్యవస్థీకృత అవకతవకలను అరికట్టేందుకు 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమ మార్గాల నివారణ) బిల్లు-2024' పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు లోక్ సభ లో బిల్లును ప్రవేశ పెట్టింది.

 

ఈ బిల్లును కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా),  పి ఎం ఒ,  పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సభలో ప్రవేశపెట్టారు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేస్, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని కంప్యూటర్ ఆధారిత పరీక్షలను కూడా 'ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్ బిల్లు 2024' కవర్ చేస్తుంది.

మోసాలను అరికట్టడానికి,  కనీసం మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, వ్యవస్థీకృత మోసాలకు పాల్పడేవారికి 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, కనీసం కోటి రూపాయల జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు.

ఆర్థిక ప్రయోజనాల కోసం అన్యాయమైన మార్గాలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలు, సంస్థలను నిరోధించడమే ఈ బిల్లు లక్ష్యం, కానీ ఇది దాని నిబంధనల నుండి అభ్యర్థులను రక్షిస్తుంది.

గత కొన్నేళ్లుగా ప్రశ్నాపత్రాల లీకేజీ, వ్యవస్థీకృత మోసాల వల్ల టెస్టుల, పరీక్షల రద్దు తో లక్షలాది మంది విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతిన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.. ఈ నేపథ్యంలో ఈ బిల్లు ఆవశ్యకత, ప్రాముఖ్యతను  గురించి వివరించారు.

"ఇటీవలి కాలంలో, సంఘ విద్రోహ, క్రిమినల్ శక్తులు అవలంబించిన అన్యాయమైన పద్ధతులు, మార్గాల ప్రతికూల ప్రభావం కారణంగా చాలా రాష్ట్రాలు తమ పబ్లిక్ పరీక్షల ను రద్దు చేయవలసి వచ్చింది లేదా ఫలితాలను ప్రకటించలేకపోయాయి. ఈ అన్యాయమైన పద్ధతులను సమర్థవంతంగా నివారించ లేకపోతే, నిరోధించకపోతే, ఈ దేశంలోని లక్షలాది మంది ఔత్సాహిక యువకుల భవిష్యత్తు , కెరీర్  ప్రమాదంలో పడతాయి. అనేక సందర్భాల్లో వ్యవస్థీకృత గ్రూపులు, మాఫియా శక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. సాల్వర్ ముఠాలను మోహరించి, తారుమారు చేసే పద్ధతులను అవలంబిస్తూ పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నారు.  ఇలాంటి దుష్ట శక్తులను అడ్డుకోవడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం‘ అని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ,  దాని ఏజెన్సీల ద్వారా పబ్లిక్ పరీక్షల నిర్వహణను ప్రతికూలంగా ప్రభావితం చేసే వ్యక్తులు, వ్యవస్థీకృత సమూహాలు లేదా మరే ఇతర ఏజెన్సీ / సంస్థ అవలంబించిన అన్యాయమైన మార్గాలు లేదా నేరాలను పరిష్కరించడానికి ప్రస్తుతం జాతీయ స్థాయిలో నిర్దిష్ట ప్రామాణిక చట్టం లేదని డిఓపిటి మంత్రి చెప్పారు.

‘అందువల్ల పరీక్షా వ్యవస్థల లోపల, వెలుపల ఈ లోపాలను ఉపయోగించుకునే అంశాలను గుర్తించి సమగ్ర కేంద్ర చట్టం ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవడం అత్యవసరం. ఇలాంటి క్రిమినల్ శక్తులు ఈ పరీక్షలకు హాజరయ్యే నిజమైన, నిజాయితీ గల యువకుల జీవితాలతో, ఆశలతో చెలగాటం ఆడకుండా నిరోధించాల్సిన అవసరం ఉంది‘ అని కేంద్రమంత్రి అన్నారు.

పబ్లిక్ ఎగ్జామినేషన్ వ్యవస్థలకు మరింత పారదర్శకత, నిష్పాక్షికత, విశ్వసనీయత తీసుకురావడం, యువత చిత్తశుద్ధి, నిజాయతీతో చేసిన కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుందని, వారి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని భరోసా ఇవ్వడమే తమ లక్ష్యమని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

వివిధ అన్యాయమైన మార్గాలకు పాల్పడే వ్యక్తులు, వ్యవస్థీకృత సమూహాలు లేదా సంస్థలను సమర్థవంతంగా, చట్టపరంగా నిరోధించడం, ఆర్థిక లేదా తప్పుడు ప్రయోజనాల కోసం పబ్లిక్ పరీక్షా వ్యవస్థలను ప్రతికూలంగా ప్రభావితం చేసేవారిని నిరోధించడం ఈ బిల్లు లక్ష్యమని  ఆయన అన్నారు.

అయితే, ఈ బిల్లు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను శిక్ష సంబంధమైన నిబంధనల నుండి రక్షిస్తుందని, పరీక్ష నిర్వహించే సంస్థ  ప్రస్తుత అక్రమ పద్ధతుల విధానం నిబంధనల నుంచి తప్పించుకుంటారని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.

అభ్యర్థులు బిల్లు పరిధిలో చర్యలకు బాధ్యులు కాబోరని, సంబంధిత పబ్లిక్ ఎగ్జామినేషన్ అథారిటీ ప పరిపాలనా నిబంధనల పరిధిలో కొనసాగుతారని తెలిపారు.

ఆన్ లైన్ లో అనేక పరీక్షలు నిర్వహించడం, పబ్లిక్ పరీక్షల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర పెరుగుతున్న దృష్ట్యా, డిజిటల్ ప్లాట్ ఫామ్ లను ఇన్సులేట్ చేయడానికి ప్రోటోకాల్ ను అభివృద్ధి చేయడం, పక్కా ఐటి భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి మార్గాలను రూపొందించడం, పరీక్షా కేంద్రాలపై సమగ్ర ఎలక్ట్రానిక్ నిఘాను నిర్ధారించడం , అటువంటి పరీక్షల నిర్వహణ కోసం ఐటి, భౌతిక మౌలిక సదుపాయాలు రెండింటికీ జాతీయ ప్రమాణాలు సేవా స్థాయిలను రూపొందించడం వంటి అంశాలను పరిశీలించడానికి పబ్లిక్ పరీక్షలపై ఉన్నత స్థాయి జాతీయ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 

 <><><>



(Release ID: 2002826) Visitor Counter : 65