మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వచ్చే మూడేళ్లలోగా, ప్రతి పాఠ్యాంశం స్టడీ మెటీరియల్‌ను భారతీయ భాషల్లో డిజిటల్‌గా అందించాలని అన్ని పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలకు భారత ప్రభుత్వం ఆదేశం

Posted On: 19 JAN 2024 6:23PM by PIB Hyderabad

విద్యార్థులు వారి మాతృభాషలోనే చదువుకునే అవకాశాన్ని కల్పించేందుకు భారత ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పాఠశాల & ఉన్నత విద్య కింద అన్ని కోర్సులకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఉన్న భారతీయ భాషల్లో డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. వచ్చే మూడేళ్లలో, అన్ని కోర్సులకు భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్‌ను అందుబాటులో ఉంచాలని యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌ఐఓఎస్‌, ఇగ్నో వంటి అన్ని పాఠశాల & ఉన్నత విద్య నియంత్రణ సంస్థలు, ఐటీసీలు, సీయూలు, నిట్‌లు, ఐఎన్‌ఐ వంటి సంస్థల అధిపతులను ఆదేశిస్తూ కేంద్ర విద్యాశాఖ ఈ రోజు ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్ర పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లోనూ ఈ ఆదేశాన్ని అమలు చేయాలని యూజీసీ, ఏఐసీటీఈ, పాఠశాల విద్య విభాగాలకు సూచించింది.

విద్యాభ్యాసంలోని ప్రతి స్థాయిలో బహుభాషలను ప్రోత్సహించేందుకు, జాతీయ విద్య విధానం (ఎన్‌ఈపీ) సిఫార్సుల ఆధారంగా భారత ప్రభుత్వం ఈ ఆదేశం జారీ చేసింది. తద్వారా, విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకునే అవకాశాన్ని, మెరుగైన ఫలితాలను పొందుతారు. సొంత భాషలో చదవడం వల్ల, భాషా అవరోధం లేకుండా వినూత్నంగా ఆలోచించే సహజ గుణం విద్యార్థులకు అలవడుతుంది.

భారతదేశంలోని బహు భాషలు దేశ ఆస్తి & బలం. దేశ సామాజిక-సాంస్కృతిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి సమర్థవంతంగా దీనిని ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఎన్‌ఈపీ-2020 చెబుతోంది. పాఠ్యాంశాలను స్థానిక భాషల్లో సృష్టిస్తే,  బహుభాషా ఆస్తి బలోపేతం అవుతుంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ప్రారంభించిన ‘వికసిత్‌ భారత్’కు మెరుగైన సహకారం అందిస్తుంది.

ఇంజినీరింగ్, వైద్య విద్య, న్యాయ విద్య, యూజీ, పీజీ, నైపుణ్యాభివృద్ధి పుస్తకాలను ఏఐ ఆధారిత యాప్ 'అనువాదిని' ద్వారా భారత ప్రభుత్వం గత రెండేళ్లుగా అనువదిస్తోంది. ఈ పుస్తకాలు ఈకుంభ్‌ పోర్టల్‌లో అందుబాటులో
ఉన్నాయి. పాఠశాల విద్య విషయానికి వస్తే, 'దీక్ష'లో 30కి పైగా భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంది. జేఈఈ, నీట్‌, సీయూఈటీ వంటి పోటీ పరీక్షలు 13 భారతీయ భాషల్లో జరుగుతున్నాయి.

 

****


(Release ID: 1998049) Visitor Counter : 170