ఆయుష్

సీసీఆర్‌ఏఎస్‌ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం 'ఆయుష్ దీక్ష'కు రేపు శంకుస్థాపన

Posted On: 19 JAN 2024 4:33PM by PIB Hyderabad

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్'కు చెందిన ‘ఆయుష్ దీక్ష - భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం’ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఈ నెల 20న, ఒడిశా భువనేశ్వర్‌లోని భరత్‌పూర్‌లోని 'సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌'లో (సీఏఆర్‌ఐ) జరుగుతుంది.

కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, భువనేశ్వర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి అపరాజిత సారంగి, న్యూదిల్లీ సీసీఆర్‌ఏఎస్‌ డైరెక్టర్ జనరల్ ప్రొ. వైద్య రబీనారాయణ ఆచార్య, భువనేశ్వర్ సీఏఆర్‌ఐ డైరెక్టర్ డా. ఎం.ఎం.రావు, ఇతర ప్రముఖులు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతారు.

రూ.30 కోట్ల అంచనా వ్యయంతో ఆయుష్ దీక్ష ప్రాజెక్టును అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తారు. ఒక్కోటి 30-40 మందికి శిక్షణ ఇవ్వగల రెండు ఆడిటోరియంలు, శిక్షణార్థులకు వసతి, వీఐపీ సూట్‌లు, ప్రకృతి గ్రంథాలయం, సమావేశాల గది, తగినంత పార్కింగ్ స్థలం, ఆధునిక వంటగది, భోజనశాల, ఇతర అవసరమైన సౌకర్యాలతో దీనిని నిర్మిస్తారు.

ఆయుష్‌ రంగంలో శిక్షణను, ప్రత్యేకంగా ఆయుర్వేద విభాగంలో వాటాదార్లందరికీ జాతీయ స్థాయి బోధన, శిక్షణను ఇక్కడ అందిస్తారు. సామర్థ్య అభివృద్ధికి, ఆయుర్వేదంలో మానవ వనరులను బలోపేతం చేయడానికి, పరిశోధన & అభివృద్ధిని సులభతరం చేయడానికి, అధిక నాణ్యత ప్రమాణాలను కొనసాగించడానికి, స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు సొంతంగా ఆదాయాన్ని సంపాదించేందుకు ఇతర జాతీయ సంస్థల సహకారంతో ఇక్కడ బోధన, శిక్షణ ఇస్తారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన స్వయంప్రతిపత్త సంస్థ భువనేశ్వర్‌లోని సీఏఆర్‌ఐ. కొత్త కేంద్రంలో సంవత్సరం పొడవునా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఆయుష్ రంగంలో నాణ్యమైన మానవ వనరులను సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ ఇది. 

 

***



(Release ID: 1998048) Visitor Counter : 78


Read this release in: English , Urdu , Hindi