రక్షణ మంత్రిత్వ శాఖ
ఒడిశా తీరం నుంచి కొత్త తరం ఆకాష్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీవో
Posted On:
12 JAN 2024 1:19PM by PIB Hyderabad
'డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్' (డీఆర్‌డీవో), ఈ రోజు ఉదయం 10.30 గంటలకు, ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి 'న్యూ జనరేషన్ ఆకాష్' (ఆకాష్-ఎన్‌జీ) క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఆకాశంలో అతి తక్కువ ఎత్తులో అత్యంత వేగవంతంగా దూసుకెళ్తున్న లక్ష్యంపై క్షిపణిని ప్రయోగించారు. ఆకాశ్ క్షిపణి ఆ లక్ష్యాన్ని విజయవంతంగా ధ్వంసం చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, లాంచర్, మల్టీ-ఫంక్షన్ రాడార్ & కమాండ్, కంట్రోల్ & కమ్యూనికేషన్ వ్యవస్థలతో ఆకాష్ క్షిపణి పని చేస్తుంది.

చాందీపూర్ ఐటీఆర్ ఏర్పాటు చేసిన రాడార్లు, టెలిమెట్రీ, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థల్లో నమోదైన సమాచారం ద్వారా క్షిపణి పనితీరును పర్యవేక్షించారు. డీఆర్‌డీవో, భారత వైమానిక దళం, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సీనియర్ అధికార్లు క్షిపణి ప్రయోగాన్ని వీక్షించారు. ఆకాశ మార్గం నుంచి అత్యంత వేగంగా దూసుకొచ్చే ముప్పులను అడ్డుకోగల అత్యాధునిక క్షిపణి వ్యవస్థ ఆకాష్-ఎన్‌జీ. ప్రస్తుత పరీక్ష విజయవంతం కావడంతో, వినియోగదారు ప్రయోగాల కోసం దీనిని కేటాయించే అవకాశాలు మెరుగయ్యాయి.
రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవో, ఐఏఎఫ్, పీఎస్‌యూలు, పరిశ్రమల విభాగాలను అభినందించారు. క్షిపణి వ్యవస్థను విజయవంతంగా అభివృద్ధి చేయడం వల్ల దేశ వైమానిక రక్షణ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు.
ఆకాష్-ఎన్‌జీ పరీక్షను విజయవంతంగా చేపట్టడంతో రక్షణ శాఖ కార్యదర్శి, డీఆర్‌డీవో ఛైర్మన్ డా.సమీర్ కామత్ కూడా శాస్త్రవేత్తలను అభినందించారు.
***
(Release ID: 1995731)