కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

మధ్యస్థ, దీర్ఘకాలిక ఉపాధి కల్పన కోసం వివిధ కార్యక్రమాలు అమలు

Posted On: 21 DEC 2023 4:09PM by PIB Hyderabad

ఉపాధి,నిరుద్యోగం కి సంబంధించిన సమాచారాన్ని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ద్వారా స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ (MoSPI) 2017-18 నుంచి సేకరిస్తోంది.  తాజాగా అందుబాటులో ఉన్న వార్షిక PLFS నివేదికల ప్రకారం 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల సాధారణ  వర్కర్ జనాభా నిష్పత్తి (WPR) 2021-22,  2022-23 సంవత్సరాలలో  వరుసగా 52.9%,గా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని గణంకాలు సూచిస్తున్నాయి. 

సంఘటిత రంగంలో మధ్యస్థ, పెద్ద సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( ఈపీఎఫ్ఓ) సేకరిస్తుంది. 2017 సెప్టెంబర్ నుంచి ఈపీఎఫ్ఓ   నెలవారీ పేరోల్ డేటాను ప్రచురిస్తోంది. సంఘటిత రంగంలో  ఉపాధి స్థాయి నివేదిక తెలియజేస్తుంది. 2021-22 లో 1.22 కోట్లుగా ఉన్న ఈపీఎఫ్ నికర చందాదారుల సంఖ్య 2022-23 నాటికి 1.38 కోట్లకు పెరిగింది.

ఉపాధి కల్పన, ఉపాధి అవకాశాలు  మెరుగుపరచడానికి  ప్రభుత్వం  ప్రాధాన్యత ఇస్తోంది.  ఉపాధి కల్పన, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి  భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.

మౌలిక సదుపాయాలు, ఉత్పాదక సామర్థ్య పెంపుదల కోసం  పెట్టుబడులు వృద్ధి, ఉపాధిపై గణనీయమైన ప్రభావం చూపిస్తాయి. 2023-24 బడ్జెట్‌లో వరుసగా మూడో సంవత్సరం మూలధన పెట్టుబడి వ్యయాన్ని 33 శాతం పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం పెట్టుబడి మూలధనాన్ని 10 లక్షల కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది.  ఇది జీడీపీ లో 3.3 శాతంగా ఉంటుంది.  వృద్ధి సామర్థ్యాన్నిపెంపొందించి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం  పెట్టుబడి మూలధనాన్ని ఎక్కువ చేసింది. 

వ్యాపారానికి ఉద్దీపన అందించడానికి, కోవిడ్-19  ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్ర  ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద ప్రభుత్వం ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయలకు మించి  ఆర్థిక సహకారం  అందిస్తోంది. ఈ ప్యాకేజీ కింద దేశం  స్వావలంబన సాధించడానికి, , ఉపాధి అవకాశాలను సృష్టించడానికి వివిధ దీర్ఘకాలిక పథకాలు/కార్యక్రమాలు/విధానాలు అమలు జరుగుతున్నాయి. 

కోవిడ్-19 మహమ్మారి సమయంలో నూతన  ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ఉపాధి నష్టాన్ని పునరుద్ధరించడానికి యజమానులను ప్రోత్సహించడానికి ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ABRY) 2020 అక్టోబర్ 1 నుంచి అమలు జరుగుతోంది. ,  31.03.2022 వరకు లబ్ధిదారుల నమోదు జరిగింది. 

కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రతికూలంగా ప్రభావితమైన వీధి వ్యాపారులు తమ వ్యాపారాలను పునః ప్రారంభించేందుకు అవసరమైన మూలధనాన్ని రుణం రూపంలో సులభంగా పొందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం  2020 జూన్ 01 నుంచి  ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి (PM SVANIdhi పథకం)ని అమలు చేస్తోంది.

దేశవ్యాప్తంగా గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో కళాకారులు, హస్తకళాకారులకు అవసరమైన ఆర్థిక సహకారం  అందించడానికి పీఎం విశ్వకర్మ పథకం 2023 సెప్టెంబర్ 17 నుంచి అమల్లోకి వచ్చింది.  చేతులు, పనిముట్లతో పని చేసే విశ్వకర్మల అభివృద్ధి,గురు -శిష్య పరంపర లేదా కుటుంబ ఆధారిత సాంప్రదాయ నైపుణ్యాల అభ్యాసాన్ని బలోపేతం చేయడం, పెంపొందించడం లక్ష్యంగా ఈ పథకంఅమలు జరుగుతోంది. కళాకారులు చేతివృత్తుల వారి ఉత్పత్తులు, సేవల నాణ్యతను మెరుగు పరచడం, వారు దేశీయ మరియు ప్రపంచ విలువ గొలుసులతో అనుసంధానించబడి ఉండేలా చూడటం లక్ష్యంగా పథకం అమలు జరుగుతోంది. 

స్వయం ఉపాధిని సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY)ని  ప్రారంభించింది. ప్రధాన మంత్రి ముద్రా యోజన   కింద  సూక్ష్మ/చిన్న వ్యాపార సంస్థలకు, వ్యక్తులకు వారి వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి  లేదా విస్తరించేందుకు వీలుగా  రూ. 10 లక్షల వరకు పూచీకత్తు రహిత రుణాలు అందిస్తారు. 

2021-22 నుంచి 5 సంవత్సరాల పాటు 1.97 లక్షల కోట్లతో ప్రభుత్వం అమలు చేయనున్న ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహ పథకం వల్ల 60 లక్షల ఉద్యోగాలు కలుగుతాయి. 

 ఆర్థిక వృద్ధి, స్థిరమైన అభివృద్ధి సాధన కోసం పీఎం గతిశక్తి పథకం అమలు జరుగుతోంది.  రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, మాస్ ట్రాన్స్‌పోర్ట్, వాటర్‌వేస్, లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే ఏడు ఇంజన్‌ల ద్వారా ఈ విధానం అమలు జరుగుతుంది. పరిశుద్ధ ఇంధన సరఫరా, ప్రజా సంక్షేమం లక్ష్యంగా అమలు జరుగుతున్న  పీఎం గతిశక్తి పథకం పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు అందించి  వ్యవస్థాపక అవకాశాలను మెరుగుపరుస్తుంది. 

2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద ప్రభుత్వం దేశంలోని స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో ఆవిష్కరణలు,, స్టార్టప్‌లు, పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి  ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది.

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం  సెప్టెంబర్ 25, 2014న ప్రారంభమయ్యింది.  పెట్టుబడిని సులభతరం చేయడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, తరగతి మౌలిక సదుపాయాలను ఉత్తమంగా నిర్మించడానికి, తయారీ, రూపకల్పన , ఆవిష్కరణలకు భారతదేశాన్ని కేంద్రంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా కార్యక్రమం అమలు జరుగుతోంది.. ప్రారంభించినప్పటి నుంచి మేక్ ఇన్ ఇండియా చొరవ గణనీయమైన విజయాలు సాధించింది.  ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియా 2.0 కింద 27 రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. కార్యక్రమాన్ని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. 

ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP), మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS), . ఉపాధి కల్పన కోసం పండిట్  దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY), గ్రామీణ స్వయం ఉపాధి మరియు శిక్షణా సంస్థలు (RSETIలు), దీన్ దయాల్ ఆంటోదయ యోజన-జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ (DAY-NULM) మొదలైన కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తోంది. 

 గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతతో సహా దేశంలో  యువతకు స్వల్పకాలిక శిక్షణ (STT) కోర్సుల ద్వారా  నైపుణ్యం ఆధారిత శిక్షణ కోసం, ముందస్తు అభ్యాసానికి గుర్తింపుగా స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ స్కిల్ ఇండియా మిషన్ కింద ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY)ని అమలు చేస్తోంది.

ఈ కార్యక్రమాలతో పాటు, స్టాండ్-అప్ ఇండియా, డిజిటల్ ఇండియా మొదలైన కార్యక్రమాలు  ఉపాధి అవకాశాలను సృష్టించే దిశగా ఉన్నాయి.

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్‌ ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు  లిఖితపూర్వకంగా ఇచ్చిన  సమాధానంలో ఈ సమాచారం అందించారు.

 

***



(Release ID: 1989440) Visitor Counter : 43


Read this release in: English , Urdu , Hindi