జౌళి మంత్రిత్వ శాఖ
'పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ & అపెరల్' (పీఎం మిత్ర) పార్కుల ఏర్పాటు కోసం 13 రాష్ట్రాల నుంచి 18 ప్రతిపాదనలు
Posted On:
20 DEC 2023 5:17PM by PIB Hyderabad
దేశంలోని గ్రీన్ ఫీల్డ్/బ్రౌన్ ఫీల్డ్ ప్రాంతాల్లో ఏడు 'పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ & అపెరల్' (పీఎం మిత్ర) పార్కుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.4,445 కోట్ల వ్యయంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో, తక్షణం వినియోగించుకునేలా వీటిని నిర్మిస్తుంది. భారత వస్త్ర పరిశ్రమను బలోపేతం చేయడం, మొత్తం విలువ గొలుసును ఒకే ప్రదేశంలో ఉంచడం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధిని సృష్టించడం, ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచడం ఈ పథకం లక్ష్యం. స్పిన్నింగ్, నేయడం, ప్రాసెసింగ్, జౌళి, దుస్తుల తయారీ, ముద్రణ యంత్రాల సంస్థలు వంటి వస్త్ర పరిశ్రమ మొత్తం విలువ గొలుసు కోసం సమగ్రమైన, ఆధునిక పారిశ్రామిక మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ మెగా పార్కుల్లోకి దాదాపు రూ.70,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.
ఈ మెగా పార్కుల ఏర్పాటు కోసం రాజస్థాన్ నుంచి 1 ప్రతిపాదన సహా 13 రాష్ట్రాల నుంచి మొత్తం 18 ప్రతిపాదనలు అందాయి. తమిళనాడు (విరుధ్‌నగర్), తెలంగాణ (వరంగల్), గుజరాత్ (నవసారి), కర్ణాటక (కలబురగి), మధ్యప్రదేశ్ (ధార్), ఉత్తరప్రదేశ్ (లఖ్‌నవూ), మహారాష్ట్రలో (అమరావతి) పీఎం మిత్ర పార్కుల ఏర్పాటు కోసం ఏడు ప్రాంతాలను ప్రభుత్వం ఖరారు చేసింది.
ఇప్పటివరకు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఎస్‌పీవీ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్‌పీవీ ఏర్పాటు ప్రక్రియ చివరి దశలో ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీమతి దర్శన జర్దోష్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచాన్ని అందించారు.
***
(Release ID: 1989017)
Visitor Counter : 127