పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
గిరాకీ-సరఫరా సూత్రం ఆధారంగా విమాన ప్రయాణ ధరలు మారుతూ ఉంటాయి
విమాన ప్రయాణ ఛార్జీలను ప్రభుత్వం నిర్ణయించదు, నియంత్రించదు
డీజీసీఏ నిబంధనల ప్రకారం, విమానం రద్దు & ఆలస్యం కారణంగా ప్రభావితమైన ప్రయాణీకులకు ఆ విమానయాన సంస్థ సౌకర్యాలు కల్పించాలి
Posted On:
14 DEC 2023 1:37PM by PIB Hyderabad
భారతదేశంలోని విమాన ప్రయాణాలను కాలం ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా, మే-జూన్‌లో విమాన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. జులై నెల మధ్య వరకు అంతర్జాతీయ రాకపోకలు ఎక్కువగా కొనసాగుతాయి. వర్షాకాలం, ఇతర మతపరమైన కారణాల వల్ల జులై నుంచి సెప్టెంబర్ వరకు ప్రయాణాలు తగ్గుతాయి. అక్టోబర్‌లో, దసరాతో పండుగల సీజన్ ప్రారంభం అవుతుంది. విమాన ప్రయాణాలు మళ్లీ పెరుగుతాయి, జనవరి మధ్య నాటికి డిమాండ్ తగ్గుతుంది. ఏప్రిల్ చివరి వారం వరకు డిమాండ్‌లో తగ్గదల కొనసాగుతుంది. మళ్లీ, వేసవి సెలవుల కారణంగా డిమాండ్ పెరుగుతుంది.
గిరాకీ-సరఫరా సూత్రం ఆధారంగా విమాన ప్రయాణ ఛార్జీలు మారుతూ ఉంటాయి. ఒక విమానంలో ఇప్పటికే విక్రయించిన సీట్ల సంఖ్య, ప్రస్తుత ఇంధన ధర, ఆ మార్గంలో విమానం సామర్థ్యం, విమానయాన రంగంలో పోటీ, సీజన్, సెలవులు, పండుగలు, సుదీర్ఘ వారాంతాలు, సంఘటనలు (క్రీడలు, ఉత్సవాలు, పోటీలు) వంటి అనేక అంశాలపై కూడా ఛార్జీలు ఆధారపడి ఉంటాయి.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, విమాన ప్రయాణ ధరలను ప్రభుత్వం నిర్ణయించదు, నియంత్రించదు. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్-1937లోని 135 నిబంధనలోని (1) ఉప నిబంధన ప్రకారం, విమానయాన సేవల్లో నిమగ్నమైన ప్రతి విమాన సంస్థ, కార్యకలాపాల ఖర్చు, సేవలు, సాధారణంగా అమలులో ఉన్న ధరలు సహా అన్ని సంబంధిత అంశాలకు సంబంధించి ధరలను ఏర్పాటు చేయాలి. పైన చెప్పిన నిబంధనకు లోబడి, విమాన ప్రయాణ ధరలను ఆయా సంస్థలు సొంతంగా నిర్ణయించుకోవచ్చు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం, విమానం రద్దు & ఆలస్యం కారణంగా ప్రభావితమైన ప్రయాణీకులకు ఆ విమానయాన సంస్థ సౌకర్యాలు కల్పించాలి. "బోర్డింగ్ నిరాకరణ, విమానాల రద్దు, విమానాల ఆలస్యం కారణాల వల్ల ప్రయాణికులకు విమానయాన సంస్థలు అందించాల్సిన సౌకర్యాలు" అనే శీర్షికతో సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్ (సీఏఆర్) సెక్షన్ 3, సిరీస్ ఎం, పార్ట్ IV జారీ అయింది.
ఒకవేళ విమానం రద్దయితే, ప్రయాణీకుడికి ఆ విషయం గురించి ముందుగా తెలియజేయకపోతే, ఆ విమానయాన సంస్థ ప్రత్యామ్నాయ విమానాన్ని అందించాలి. లేదా, విమాన టిక్కెట్ పూర్తి ధరతో పాటు పరిహారం అందించాలి. దీనికి అదనంగా, ప్రత్యామ్నాయ విమానం కోసం ఎదురుచూసే సమయంలో విమానాశ్రయంలో ప్రయాణీకులకు భోజనం సహా తగిన సదుపాయాలు అందించాలి.
విమానం ఆలస్యమైతే, ఆ విమానం వచ్చే వరకు, విమానయాన సంస్థ తన ప్రయాణీకులకు భోజనం, ఫలహారాలు/హోటల్ వసతి/ప్రత్యామ్నాయ విమానం/పూర్తి వాపసు అందించాలి.
దేశీయ విమానయాన సంస్థలు నిర్దేశిత నిబంధనలు పాటిస్తున్నాయో, లేదో తనిఖీ చేయడానికి డీజీసీఏ దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో తనిఖీలు నిర్వహిస్తుంది. ఏదైనా విమానయాన సంస్థ సీఏఆర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తనిఖీ సమయంలో గుర్తిస్తే, ఆ విమానయాన సంస్థపై నగదు జరిమానా సహా అవసరమైన చర్యలను డీజీసీఏ తీసుకుంటుంది.
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ వి.కె. సింగ్ (విశ్రాంత) ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 1986358)
Visitor Counter : 86