పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామ పంచాయతీల్లో ప్రాదేశిక ప్రణాళికల రూపకల్పనను ప్రోత్సహించేందుకు జీఐఎస్‌ అప్లికేషన్‌ “గ్రామ మంచిత్ర”ను ప్రారంభించిన పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ

Posted On: 05 DEC 2023 2:35PM by PIB Hyderabad

గ్రామ పంచాయతీల్లో ప్రాదేశిక ప్రణాళిక రూపకల్పనను ప్రోత్సహించడానికి, 'గ్రామ్ మంచిత్ర' (https://grammanchitra.gov.in) పేరిట భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్‌) అప్లికేషన్‌ను కేంద్ర పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. జియో-స్పేషియల్‌ సాంకేతికతను ఉపయోగించి గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రాదేశిక ప్రణాళికను నిర్వహించడానికి ఈ అప్లికేషన్‌ గ్రామ పంచాయతీలకు వీలు కల్పిస్తుంది. వివిధ రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మరింత స్పష్టత, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) నిర్ణయాల్లో మద్దతు అందించడానికి ఏకీకృత జియో-స్పేషియల్ వేదికను ఇది అందిస్తుంది.

ఆస్తుల సంబంధిత పనుల్లో జియో-ట్యాగ్‌తో కూడిన ఫోటోలు తీయడానికి మొబైల్ ఆధారిత పరిష్కారం ఎంయాక్షన్‌సాఫ్ట్‌ను కూడా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దీని ద్వారా ఆస్తుల జియో ట్యాగింగ్‌ మూడు దశల్లో జరుగుతుంది. అవి (i) పని ప్రారంభానికి ముందు (ii) పని జరుగుతున్న సమయంలో (iii) పని పూర్తయినప్పుడు. సహజ వనరుల నిర్వహణ, జల వనరుల సంరక్షణ, కరవు నివారణ, పారిశుద్ధ్యం, వ్యవసాయం, చెక్ డ్యాములు, నీటిపారుదల మార్గాలు మొదలైన వాటికి సంబంధించిన అన్ని పనులు, ఆస్తుల సమాచారాన్ని ఇది నిల్వ చేస్తుంది. ఎంయాక్షన్‌సాఫ్ట్‌ను యాప్‌ ద్వా జియో-ట్యాగ్ చేసిన ఆస్తుల వివరాలు గ్రామ మంచిత్రలో అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల, గ్రామ పంచాయతీల్లో చేయాల్సిన వివిధ అభివృద్ధి పనుల్లో మరింత స్పష్టత వస్తుంది.

ఆర్థిక సంఘం నిధుల ద్వారా సృష్టించిన ఆస్తులను జియో ట్యాగ్‌ చేస్తారు. పంచాయతీ స్థాయిలో జియో ట్యాగ్ చేసిన ఆస్తుల జీఐఎస్‌ సమాచారాన్ని గ్రామ మంచిత్ర యాప్‌లో చూడవచ్చు. గ్రామ పంచాయతీ అధికారులు వాస్తవిక, సాధించాల్సిన అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో జీఐఎస్‌ సాంకేతికతను ఉపయోగించుకునే ప్రణాళిక సాధనాలను గ్రామ మంచిత్ర అందిస్తుంది. ఈ సాధనాలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అవసరమైన సంభావ్య ప్రాంతాలను గుర్తించడం, ఆస్తులపై నిఘా, ప్రాజెక్టు ఖర్చులను అంచనా వేయడం, ప్రాజెక్టుల ప్రభావాన్ని అంచనా వేయడం వంటి అభివృద్ధి ప్రణాళికల తయారీలో నిర్ణయాలు తీసుకునేందుకు మద్దతు అందిస్తాయి.

కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.

 

***


(Release ID: 1982703) Visitor Counter : 168


Read this release in: English , Urdu , Hindi