గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

జన్ జాతియ గౌరవ్ దివస్ గా దేశ వ్యాప్తంగా గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు


ఫ్లాగ్ షిప్ పథకాల ప్రయోజనాలు నిర్దేశిత లబ్దిదారులకు నిర్ణీత కాలవ్యవధిలో చేరేలా చూసేందుకు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రకు జెండా ఊపిన ప్రధాని

భగవాన్ బిర్సా ముండాకు పార్లమెంట్ హౌస్ లో నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్
అత్యంత నిస్సహాయ గిరిజన సమూహాల అభ్యున్నతి కోసం పిఎం- జన్ మన్ మిషన్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

అభివృద్ధి చెందిన భారత్ కోసం ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నందున మహిళా శక్తి, గిరిజన సంక్షేమం, అభివృద్ధి స్తంభాలకు ప్రాధాన్యం

Posted On: 17 NOV 2023 4:22PM by PIB Hyderabad

భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా 2023 నవంబర్ 15 న జన్ జాతియ గౌరవ్ దివస్ వేడుకలను దేశ మంతటా ఘనంగా నిర్వహించారు. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల  త్యాగాల గురించి రాబోయే తరాలు తెలుసుకోవడానికి వారి స్మృతికి కూడా ఈ రోజు ను అంకితం చేశారు.

జన్ జాతియా గౌరవ్ దివస్ వేడుకలకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము , ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ,  ఉపరాష్ట్రపతి శ్రీ జగ్దీప్ ధన్కర్, స్పీకర్ శ్రీ ఓం బిర్లా నేతృత్వం వహించారు.  జార్ఖండ్ లోని ఖుంటిలో జరిగిన ప్రధాన మంత్రి కార్యక్రమంలో ఆరుగురు ముఖ్యమంత్రులు, 22 మంది గవర్నర్లు, ఏడుగురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వర్చువల్ గా పాల్గొన్నారు. గిరిజన పరిశోధన సంస్థలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలు, ఇతర భాగస్వామ్య సంస్థలు జన్ జాతీయ గౌరవ్ దివస్ ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించాయి.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ' వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర'ను కూడా ప్రారంభించారు. జార్ఖండ్ లోని ఖుంటిలో ' వికసిత భారత్ సంకల్ప్ యాత్ర' ప్రారంభ సంకేతంగా ఐ ఇ సి (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్)  వాహనాలను ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. తొలుత గిరిజన జనాభా గణనీయంగా ఉన్న 68 జిల్లాల గ్రామ పంచాయతీల నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు విస్తరిస్తుంది. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాల ఫలాలు నిర్ణీత కాలవ్యవధిలో లబ్దిదారులందరికీ చేరేలా చూడటం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ టెస్టింగ్, అవగాహన, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలోనమోదు, స్కాలర్ షిప్ పథకాలపై దృష్టి సారిస్తారు.  ఫారెస్ట్ రైట్ టైటిల్స్, వాన్ ధన్ వికాస్ కేంద్ర స్వయం సహాయక బృందాల ద్వారా గిరిజనుల జీవనోపాధికి భరోసా కల్పిస్తున్నారు. 200కు పైగా గ్రామ పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా, 2023 నవంబరు 15 న పార్లమెంటు హౌస్ లో ఆయన విగ్రహానికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉపరాష్ట్రపతి శ్రీ జగ్దీప్ ధన్కర్, స్పీకర్ ఓం బిర్లా, మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి, పలువురు ఎంపీలు భగవాన్ బిర్సాకు పుష్పాంజలి ఘటించారు.   గిరిజన నృత్యకారులు రంగురంగుల దుస్తులు ధరించి గిరిజన సంగీత వాయిద్యాలను వాయిస్తూ రాష్ట్రపతికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

‘జన్ జాతియ గౌరవ్ దివస్' సందర్భంగా ఖుంటిలో ప్రధాని నరేంద్ర మోదీ,  కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి  శ్రీ అర్జున్ ముందా, జార్ఖండ్ గవర్నర్ శ్రీ సి పి రాధా కృష్ణన్; జార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమత్ సోరెన్, విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి, అలాగే మాజీ  ముఖ్యమంత్రి శ్రీ బాబూలాల్ మరాండీ, ఖుంటికి చెందిన పలువురు శాసనసభ్యులు పాల్గొన్న మెగా కార్యక్రమంలో రాష్ట్రపతి ఆడియో విజువల్ శుభాకాంక్షల సందేశాన్ని  ప్రదర్శించారు. రాష్ట్రపతి సందేశాన్ని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 100కు పైగా ప్రదేశాల్లో కూడా ప్రదర్శించారు.

ఖుంటిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధాన మంత్రి పి ఎం జన్ మన్ (పి ఎం- జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్) ను, ఇంకా పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. ' వికసిత భారత్ సంకల్ప్ యాత్ర'ను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ భారీ వేడుకకుఖుంటి, చుట్టుపక్కల జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది హాజరయ్యారు.

ప్రధాన మంత్రి జార్ఖండ్ లోని రాంచీలోభగవాన్ బిర్సా ముండా ట్రైబల్ ఫ్రీడం ఫైటర్ మ్యూజియాన్ని సందర్శించి ఆ రోజు కార్యక్రమాలను ప్రారంభించారు. భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన మ్యూజియంలో ఏర్పాటు చేసిన మరో 10 మంది గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలకు కూడా నివాళులర్పించారు. ఈ మ్యూజియం గతంలో బిర్సా ముండాను ఖైదు చేసిన జైలు (కరకక్ష్) గా ఉండేది. మ్యూజియంలో కరకక్ష్, చల్చిత్ర కక్ష్, మ్యూజియం లోపల ఉన్న ఉలిహతు గ్రామ ప్రతిరూపాన్ని ప్రధాని సందర్శించారు.

ఆ తర్వాత రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భగవాన్ బిర్సా ముండా జన్మస్థలం జార్ఖండ్ లోని ఉలిహతు గ్రామాన్ని ప్రధాని సందర్శించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగవాన్ బిర్సా అనుచరులు,  భగవాన్ బిర్సా, బిర్సాయత్ కమ్యూనిటీ సభ్యులతో ముచ్చటించారు. ఉలిహతు గ్రామాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా శ్రీ మోదీ చరిత్ర సృష్టించారు.  శ్రీ bఅర్జున్ ముండా, శ్రీ హేమంత్ సోరెన్, శ్రీ సి.పి.రాధా కృష్ణన్ రాంచీ మ్యూజియం , ఉలిహతును సందర్శించిన ప్రధాని వెంట ఉన్నారు.

18 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ప్రాంతాలలో నివసిస్తున్న 75 నిరుపేద  గిరిజన వర్గాల సమగ్ర అభివృద్ధిని ప్రధాన మంత్రి జన్ మన్ (పిఎం- జన జాతి  ఆదివాసీ న్యాయ మహా అభియాన్) లక్ష్యంగా పెట్టుకుంది, వారు విద్య, ఆరోగ్యం , జీవనోపాధి విషయం లో సామాజిక ఆర్థిక సూచికలలో బాగా వెనుకబడి ఉన్నారు, అందువల్ల వారిని ముఖ్యంగా బలహీనమైన గిరిజన సమూహాలు (పివిటిజిలు) అని పిలుస్తారు. ఈ వర్గాల జనాభా సుమారు 28 లక్షలు.   200 జిల్లాల్లో ఉన్న 800 కి పైగా బ్లాకులలో సుమారు 22000 ఆవాసాలలో వీరు నివసిస్తున్నారు.   స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా మారుమూల ప్రాంతాల్లో, తక్కువ జనాభా ఉన్న ఈ వర్గాల గ్రామాలు, ఆవాసాల కీలకమైన మౌలిక సదుపాయాల అవసరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ అభివృద్ధి పథకాలు తగినంతగా తీర్చలేకపోయాయి.

పిఎం-జన్ మన్ పురోగతి మరియు ఫలితాలను తెలుసుకోవడానికి, పర్యవేక్షించడానికి ఉపయోగించే పిఎమ్ గతి శక్తి ప్లాట్ ఫాం పై పోర్టల్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.

https://www.youtube.com/watch?v=MfgQyBtTYLc

 

మన గిరిజన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వాతంత్ర్యోద్యమంలో వారి పాత్రను ప్రధాన మంత్రి ప్రస్తావించారు.  గత 75 ఏళ్లలో వెలుగు లోకి రాని ఎందరో గిరిజన వీరులు ఉన్నారని, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా వారు చేసిన త్యాగాలు ఏమిటో గుర్తు చేసుకున్నామని ప్రధాన మంత్రి చెప్పారు.

మహిళా శక్తి, రైతులు, యువత, భారత కొత్త మధ్యతరగతి, పేదలు అనే వికసిత భారత నాలుగు 'అమృత్ స్తంభాలు' పై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను శ్రీ మోదీ నొక్కి చెప్పారు. ప్రధాన మంత్రి జన్ మన్ గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఆదివాసీ తెగలు, ఆదిమ తెగల జీవితాలను అనుసంధానం చేయడానికి ప్రభుత్వ నిబద్ధతను వివరించారు. గిరిజన సమాజ అభివృద్ధికి కట్టుబడినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాన మంత్రి, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. బేటీ బచావో బేటీ పడావో, పీఎం ఆవాస్ యోజన, స్వయం సహాయక సంఘాలకు మద్దతు ఇచ్చే కార్యక్రమాలు వంటి మహిళా సాధికారత పథకాలను ఆయన వివరించారు. ప్రధాన మంత్రి విశ్వ కర్మ యోజన గురించి ప్రస్తావిస్తూ, ప్రతి ఒక్కరి సామర్ధ్యాలను వెలికి తీసే సంకల్పంతో ఆధునిక శిక్షణ, ఉపకరణాల కోసం 13 వేల కోట్ల రూపాయలను విశ్వకర్మ యోజనకు కేటాయించినట్లు చెప్పారు.

Pl click here for full press release

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగవాన్ బిర్సా ముండా జన్మస్థలమైన ఉల్లిహతు గ్రామానికి వచ్చి నివాళులు అర్పించిన దేశ  తొలి ప్రధాని నరేంద్ర మోదీ కావడం చారిత్రాత్మక ఘట్టమని అర్జున్ ముండా అన్నారు. నవంబర్ 15వ తేదీని జన్ జాతియా గౌరవ్ దివస్ గా జరుపుకోవడం చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్ 15న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభం కావడం చాలా ముఖ్యమైన సందర్భమని, ఇది గ్రామం నుంచి పల్లెకు, పట్టణాలకు, వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు చేరువై అవగాహన కల్పిస్తుందని అర్జున్ ముండా అన్నారు. ఎల్పీజీ సిలిండర్ అందుబాటు, పేదలకు ఇళ్లు, ఆహార భద్రత, సరైన పోషకాహారం, విశ్వసనీయమైన ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, అత్యవసర ఆర్థిక సేవలు, విద్యుత్ కనెక్షన్లు వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించడంపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుందని చెప్పారు.

75 ప్రత్యేక నిరుపేద గిరిజన వర్గాల (పీవీటీజీ) కోసం రూ.24,000 కోట్లతో పి ఎమ్ - జన్ మన్ పథకాన్ని ప్రధాని ప్రారంభించారని, ఇది అపూర్వమని ఈ సందర్భంగా అర్జున్ ముండా అన్నారు. జార్ఖండ్ ప్రజలకు రూ.7200 కోట్ల విలువైన ప్రాజెక్టులను అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

పిఎం- జన్ మన్

2023-24 బడ్జెట్లో, ముఖ్యంగా బలహీనమైన గిరిజన సమూహాల (పివిటిజి) సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి, ప్రధాన మంత్రి పివిటిజి అభివృద్ధి మిషన్ ను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది పివిటిజి గృహాలు , ఆవాసాలకు సురక్షితమైన గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు , పారిశుధ్యం, మెరుగైన విద్య, ఆరోగ్యం , పోషకాహారం, రహదారి , టెలికాం కనెక్టివిటీ , స్థిరమైన జీవనోపాధి అవకాశాలు వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పిస్తుంది. ఆ తర్వాత గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బిసాగ్-ఎన్ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ లో నిర్వహించిన సర్వే ద్వారా; ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి అంతరాల డేటాబేస్ ను సిద్ధం చేసింది. ఎంఓటీఏ సహా 9 మంత్రిత్వ శాఖల ద్వారా 11 కీలక జోక్యాలను ఈ మిషన్ కలిగి ఉంటుంది. మంత్రిత్వ శాఖలు/ డిపార్ట్ మెంట్ ల సంబంధిత పథకాలు/కార్యక్రమాలు మిషన్ లక్ష్యానికి అనుగుణంగా ఉంటాయి.  ఈ మిషన్ మొత్తం అంచనా వ్యయం 3 సంవత్సరాలకు సుమారు 24000 రూపాయలు.

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ (పిఎమ్ఎవై-జి) , ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పిఎంజిఎస్ వై) ద్వారా నిర్దేశిత పివిటిజి గ్రామాలు / నివాసాలు , గృహాల ప్రధాన మౌలిక అవసరాలు అయిన పక్కా గృహాలు , రహదారి అనుసంధానం కల్పిస్తారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన జల్ జీవన్ మిషన్ (జేజేఎం) ద్వారా పీవీటీజీ జనావాసాల్లో సురక్షిత తాగునీటిని అందించనున్నారు.  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ఆరోగ్య మిషన్, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన సమగ్ర శిక్షా అభియాన్, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన పోషణ్ అభియాన్ ఈ ప్రాంతాలలో ఆయుష్మాన్ కార్డుల జారీ, సంస్థాగత ప్రసవాలు, రోగనిరోధక శక్తి అందించడం సహా విద్య, ఆరోగ్యం , పోషకాహార సౌకర్యాలను మెరుగుపరచడానికి అన్ని చర్యలు తీసుకుంటాయి. విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన పునరుత్పాదక అభివృద్ధి రంగ పథకం (ఆర్ డి ఎస్ఎస్) ద్వారా లేదా కొత్త , పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖకు చెందిన సౌర విద్యుత్ పథకం ద్వారా వీధులు , బహుళ ప్రయోజన కేంద్రాలలో సోలార్ లైటింగ్ ఏర్పాటు ద్వారా విద్యుదీకరణ చేస్తారు.  సుస్థిర జీవనోపాధి కోసం ప్రధాన మంత్రి జన్ జాతీయ  వికాస్ మిషన్ (పీఎంజేవీఎం), మల్టీపర్పస్ సెంటర్ కింద వాన్ ధన్ కేంద్రాలు (వీడీవీకేలు) ఏర్పాటు చేయనున్నారు. కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) కింద మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా అనుసంధానం కాని ఆవాసాలను టెలికాం కనెక్టివిటీ కోసం లక్ష్యంగా చేసుకుంటారు. పీఎంజేఏవై, సికిల్ సెల్ డిసీజ్ ఎలిమినేషన్, టీబీ ఎలిమినేషన్, 100 శాతం ఇమ్యునైజేషన్, పీఎం సురక్షిత్ మాతృత్వ యోజన, పీఎం మాతృ వందన యోజన, పీఎం పోషణ్, పీఎం జన్ ధన్ యోజన తదితర పథకాల ప్రయోజనాలను గరిష్ట స్థాయిలో అందించనున్నారు.

భగవాన్ బిర్సా ముండా గిరిజన స్వాతంత్ర యోధుని (ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్) మ్యూజియం

ఆగస్టు 2016 లో ఎర్రకోట నుండి ప్రధాన మంత్రి పిలుపు మేరకు, రాంచీలో బిర్సా ముండా జైలుగా ఉన్న 150 ఏళ్లనాటి పురాతన వారసత్వ భవనాన్ని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రయత్నాలతో సంరక్షించి స్వాతంత్ర్య పోరాట మ్యూజియంగా పునరుద్ధరించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మ్యూజియంలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. అండమాన్ జైలు తరహాలో అబ్బుర పరిచేరూపవాణిప్రదర్శన, , జననం నుంచి మరణం వరకు భగవాన్ బిర్సా జీవితంలోని వివిధ దశలను చూపించే 3 గ్యాలరీల్లో (చల్చిత్ర కక్ష్) సుమారు 20 నిమిషాల ఆడియో విజువల్ మూవీ  ప్రదర్శన ఇందులో ఉన్నాయి. మ్యూజియం బయట పచ్చిక మైదానంలో ఉలిహతు గ్రామాన్ని పునర్నిర్మించారు.  ఈ మ్యూజియంలో భగవాన్ బిర్సా ముండా 25 అడుగుల విగ్రహం కూడా ఉంది. ఈ మ్యూజియంలో షాహిద్ బుధు భగత్, సిద్ధూ-కన్హు, నీలంబర్-పితాంబర్, దివా-కిసున్, తెలంగా ఖాడియా, గయా ముండా, జాత్రా భగత్, పోటో హెచ్, భగీరథ్ మాంఝీ, గంగా నారాయణ్ సింగ్ వంటి వివిధ ఉద్యమాలతో సంబంధం ఉన్న ఇతర స్వాతంత్ర్య సమరయోధుల  తొమ్మిది అడుగుల విగ్రహాలు కూడా ఉన్నాయి.  25 ఎకరాల్లో అభివృద్ధి చేసిన స్మృతి ఉద్యాన్ లో మ్యూజికల్ ఫౌంటెన్, ఫుడ్ కోర్టు, చిల్డ్రన్ పార్క్, ఇన్ఫినిటీ పూల్, గార్డెన్ తదితర వినోద సౌకర్యాలు ఉన్నాయి.  ఈ మ్యూజియాన్ని 2021 నవంబర్ 15న మొదటి జన్ జాతీయ గౌరవ్ దివస్ నాడు ప్రధాన మంత్రి ప్రారంభించారు.

జన జాతియా గౌరవ్ దివస్

2021 నుండి గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గౌరవించడానికి, స్మరించుకోవడానికి దేశవ్యాప్తంగా జంజాతియా గౌరవ్ దివస్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. సంతాల్స్, తామర్లు, కోల్స్, భిల్స్, ఖాసీలు, మిజోలు వంటి గిరిజన సంఘాల నాయకత్వంలో అనేక ఉద్యమాలు భారత స్వాతంత్ర్య పోరాటాన్ని బలోపేతం చేశాయి. గిరిజన సంఘాలు నిర్వహించిన విప్లవోద్యమాలు, పోరాటాలు వారి అపారమైన ధైర్యసాహసాలకు, మహోన్నత త్యాగానికి ప్రతీకగా నిలిచాయి. బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన గిరిజన ఉద్యమాలు జాతీయ స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడి దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులకు స్ఫూర్తినిచ్చాయి. అయితే ఈ గిరిజన వీరుల గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. దేశం కోసం వారు చేసిన త్యాగాల గురించి రాబోయే తరాలకు తెలియజేయడానికి, 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్యం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో నవంబర్ 15 ను జన జాతియ గౌరవ్ దివస్ గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ తేదీ దేశవ్యాప్తంగా గిరిజన సమాజాలు భగవాన్ గా ఆరాధించే శ్రీ బిర్సా ముండా జయంతి రోజు. బిర్సా ముండా బ్రిటిష్ వలస వ్యవస్థ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు.  'ఉల్గులన్' (విప్లవం) కు పిలుపునిస్తూ బ్రిటిష్ అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపించాడు. ఈ ప్రకటన గిరిజన సమాజాల ఘనమైన చరిత్ర,  సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తించింది. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం వైవిధ్యానికి, దేశ చరిత్రకు గిరిజన సమాజాల సహకారాలను చూపించడం ద్వారా ఐక్యత,  సగర్వ భావాన్ని పెంపొందించడానికి దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు,  కార్యకలాపాలను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇది మూడవ సంవత్సరం, భారతీయ గిరిజన ప్రజల ప్రత్యేక సంప్రదాయాలు,  ఆచారాల పట్ల అవగాహన , ప్రశంసలను పెంపొందించడానికి సాంస్కృతిక ప్రదర్శనలు, ఎగ్జిబిషన్ లు, చర్చలతో కూడిన వివిధ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించారు. గత ఏడాది భగవాన్ బిర్సా ముండా జన్మస్థలమైన జార్ఖండ్ లోని ఉలిహతు గ్రామాన్ని రాష్ట్రపతి సందర్శించారు, ఉపరాష్ట్రపతి ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో పుష్పాంజలి ఘటించారు.

****



(Release ID: 1977947) Visitor Counter : 101


Read this release in: English , Urdu , Hindi