రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

స్వోర్డ్ ఆర్మ్‌ ఫ్లీట్ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించిన రియర్ అడ్మిరల్ సి.ఆర్. ప్రవీణ్ నాయర్

Posted On: 14 NOV 2023 10:38AM by PIB Hyderabad

భారత నౌకాదళ ‘స్వోర్డ్ ఆర్మ్’ అయిన పశ్చిమ నౌకాదళంలో నాయకత్వ మార్పు జరిగింది. 10 నవంబర్ 2023న, రియర్ అడ్మిరల్ సి.ఆర్‌.ప్రవీణ్ నాయర్, రియర్ అడ్మిరల్ వినీత్ మెక్‌కార్టీ నుంచి పశ్చిమ నౌకాదళం కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో జరిగిన కవాతులో బాధ్యతల మార్పిడి జరిగింది.

రియర్ అడ్మిరల్ నాయర్, 01 జులై 1991న భారత నౌకాదళంలోకి అడుగు పెట్టారు. గోవాలోని నావల్ అకాడమీ, వెల్లింగ్‌టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ, అమెరికాలోని యూఎస్‌ నావల్ వార్ కాలేజీ పూర్వ విద్యార్థి ఆయన. నౌకాదళ ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌గా (విధానం & ప్రణాళికలు) నియమితులయ్యారు.

కమ్యూనికేషన్ & ఎలక్ట్రానిక్ యుద్ధరీతుల్లో నిపుణుడిగా భారతీయ నౌకాదళ నౌకలు కృష్ణ, కోరా, మైసూర్‌లో సేవలు అందించారు. పశ్చిమ నౌకాదళంలో ఫ్లీట్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ఆఫీసర్‌గా, ఫ్లీట్ కమ్యూనికేషన్ ఆఫీసర్‌గా, తూర్పు నౌకాదళంలో ఫ్లీట్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా కూడా పని చేశారు. గోవాలోని నావల్ వార్ కాలేజ్‌లో డైరెక్టింగ్ స్టాఫ్‌గా, కోచిలో సిగ్నల్ స్కూల్ ఇన్‌చార్జ్ అధికారిగా విధులు నిర్వర్తించిన రియర్ అడ్మిరల్ నాయర్‌కు నౌకాదళ శిక్షణలో విశేష అనుభవం ఉంది.

క్షిపణి వాహక నౌక ఐఎన్‌ఎస్‌ కిర్చ్, విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యకు కమాండర్‌గా రియర్ అడ్మిరల్ నాయర్ సేవలు అందించారు. క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్‌ చెన్నైని ప్రారంభించారు.

***



(Release ID: 1976891) Visitor Counter : 54