రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారత్, సింగపూర్‌ రక్షణ శాఖ కార్యదర్శుల అధ్యక్షతన న్యూదిల్లీలో 15వ 'భారత్‌-సింగపూర్ రక్షణ విధాన చర్చలు'


సాయుధ దళాల కార్యకలాపాలు, ద్వైపాక్షిక విన్యాసాలు & సైబర్‌ భద్రత వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సహకారం మెరుగుపరచుకోవడానికి అంగీకారం

Posted On: 01 NOV 2023 4:48PM by PIB Hyderabad

15వ 'భారత్-సింగపూర్ రక్షణ విధాన చర్చలు' ఈ రోజు న్యూఢిల్లీలో జరిగాయి. భారత రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమణె, సింగపూర్ శాశ్వత కార్యదర్శి (రక్షణ) చాన్ హెంగ్ కీ ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో, రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న రక్షణ సహకారాన్ని ఈ భేటీలో సమీక్షించారు. సాయుధ దళాల మధ్య ప్రత్యక్ష కార్యకలాపాలు, ద్వైపాక్షిక విన్యాసాల్లో సహకారం మెరుగుపరచుకోవడానికి అంగీకారం కుదిరింది. అభివృద్ధి చెందుతున్న సైబర్‌ భద్రత వంటి రంగాల్లో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే చర్యల గురించి కూడా ఇరుపక్షాలు చర్చించాయి.

ఇప్పటికే ఉన్న సహకారాన్ని, ముఖ్యంగా, సముద్ర భద్రత, బహుపాక్షిక సహకార రంగంలో సహకారాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని రెండు వర్గాలు గుర్తించాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన తొలి 'ఆసియాన్-ఇండియా మారిటైమ్ ఎక్సర్‌సైజ్‌'ను సమన్వయం చేయడంలో, సహ-ఆతిథ్యం ఇవ్వడంలో సింగపూర్ చూపిన చొరవను భారత రక్షణ కార్యదర్శి ప్రశంసించారు. పరస్పర విశ్వాసం, అవగాహన, ఉమ్మడి ప్రాధాన్యతలపై ‘వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ సంపూర్ణంగా అమలు చేసేందుకు రెండు దేశాలు నిబద్ధత ప్రదర్శించాయి.

కొవిడ్‌-19 మహమ్మారి తర్వాత భారత్‌, సింగపూర్ మధ్య రక్షణ శాఖ కార్యదర్శుల స్థాయిలో జరిగిన మొదటి భౌతిక సమావేశం ఇది.

ఈ సమావేశానికి ముందు, భారతదేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌తోనూ  సింగపూర్‌ శాశ్వత కార్యదర్శి (రక్షణ) సమావేశమయ్యారు. సింగపూర్ ప్రతినిధి బృందం న్యూదిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయతో సహా వివిధ సాంస్కృతిక ప్రదేశాలను కూడా సందర్శించింది.

***



(Release ID: 1973971) Visitor Counter : 37


Read this release in: English , Urdu , Hindi