విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఎగ్జిమ్‌ బ్యాంక్‌ నుంచి 100 మిలియన్‌ డాలర్ల విదేశీ కరెన్సీ టర్మ్ లోన్‌ తీసుకుంటున్న ఆర్‌ఈసీ

Posted On: 06 SEP 2023 4:03PM by PIB Hyderabad

మహారత్న హోదాతో, విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్‌ఈసీ లిమిటెడ్, ఎగుమతి-దిగుమతి బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్‌ బ్యాంక్) నుంచి 100 మిలియన్‌ డాలర్ల విదేశీ కరెన్సీ టర్మ్ లోన్‌ తీసుకుంటోంది, అందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసింది. తాను తీసుకునే అప్పును తిరిగి రుణాలుగా ఇస్తుంది. దేశంలోని విద్యుత్, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ రంగాల్లోని సంస్థలకు మూలధన పరికరాలను దిగుమతి చేసుకునే అవసరాల కోసం ఆ నిధులను అప్పుగా ఇస్తుంది. 2023-24 సంవత్సరానికి, 1.20 లక్షల కోట్ల రూపాయలను సమీకరించాలన్న ఆర్‌ఈసీ 'మార్కెట్ బారోయింగ్ ప్రోగ్రామ్‌' కింద ఈ రుణం తీసుకుంటోంది.

ఎగ్జిమ్‌ బ్యాంక్ ఆర్‌ఈసీకి ఇచ్చిన మొదటి టర్మ్ లోన్ ఇది. ఈ రుణం కాల పరిమితి 5 సంవత్సరాలు. అమెరికన్‌ డాలర్ల రూపంలో తీసుకునే రుణాల కొలమాన రేటు అయిన సార్ఫ్‌కు (సెక్యూర్డ్ ఓవర్‌నైట్ ఫైనాన్సింగ్ రేట్) అనుగుణంగా రుణ రేటు ఉంటుంది.

“దేశంలోని విద్యుత్, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ రంగాల రుణ అవసరాలు తీర్చేందుకు 100 మిలియన్‌ డాలర్ల రుణం తీసుకునే కార్యక్రమంలో ఎగ్జిమ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది” అని ఆర్‌ఈసీ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వివేక్ కుమార్ దేవాంగన్ చెప్పారు.

ఆర్‌ఈసీ లిమిటెడ్ అనేది బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ. భారతదేశంలో విద్యుత్‌ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం రుణాలు ఇవ్వడం దీని లక్ష్యం. 1969లో ప్రారంభమైన ఆర్‌ఈసీ లిమిటెడ్, ఇప్పటికి యాభై సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసింది. రాష్ట్ర విద్యుత్ బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర & రాష్ట్ర విద్యుత్ వినియోగ సంస్థలు, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, గ్రామీణ విద్యుత్ సహకార సంఘాలు, ప్రైవేట్ రంగ వినియోగ సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తుంది. విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ, పునరుత్పాదక విద్యుత్‌ సహా విద్యుత్ రంగ విలువ గొలుసులోని ప్రతి అంచెలోని ప్రాజెక్టులకు ఈ సంస్థ రుణం అందిస్తుంది. భారతదేశంలోని ప్రతి నాలుగు బల్బుల్లో ఒక బల్బు ఆర్‌ఈసీ నిధులతో వెలుగుతోంది. ఆర్‌ఈసీ ఇటీవల మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ రంగాలకు అప్పులు మంజూరు చేస్తూ రుణ వైవిధ్యం కనబరుస్తోంది.

 

***



(Release ID: 1955231) Visitor Counter : 97


Read this release in: English , Urdu , Hindi , Tamil