రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రక్షణ రంగంలో స్వావలంబనకు అతి పెద్ద ప్రోత్సాహం: భారత నౌకాదళం కోసం ఐదు 'ఫ్లీట్ సపోర్ట్ షిప్‌'ల కోసం హెచ్‌ఎస్‌ఎల్‌తో రూ.19,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న రక్షణ మంత్రిత్వ శాఖ

Posted On: 25 AUG 2023 3:53PM by PIB Hyderabad

భారత రక్షణ మంత్రిత్వ శాఖ, ఈ రోజు, భారతీయ నౌకాదళం కోసం ఐదు 'ఫ్లీట్ సపోర్ట్ షిప్‌'లను (ఎఫ్‌ఎస్‌ఎస్‌) కొనుగోలు చేసేందుకు విశాఖపట్నంలోని 'హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్'తో (హెచ్‌ఎస్‌ఎల్‌) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.19,000 కోట్లు. ఈ నౌకలను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, నిర్మిస్తారు కాబట్టి, రక్షణ రంగ తయారీలో స్వావలంబన లక్ష్యాన్ని సాధించడంలో ఇది అతి పెద్ద ప్రోత్సాహంగా నిలుస్తుంది. ఈ నెల 16న జరిగిన సమావేశంలో, నౌకల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

సముద్రంలో ఉన్న నౌకలకు ఇంధనం, నీరు, మందుగుండు సామగ్రి, సరుకులను అందించడానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ను ఉపయోగిస్తారు. భారత నౌకాదళ నౌకలు తిరిగి నౌకాశ్రయానికి రాకుండా సుదీర్ఘకాలం సముద్రంలోనే పని చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ నౌకలు నౌకాదళం వ్యూహాత్మక పరిధిని మెరుగుపరుస్తాయి, జల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి. ప్రజలను తరలించడానికి, 'మానవ సాయం & విపత్తు నిర్వహణ' (హార్డ్‌) కార్యకలాపాలకు కూడా నౌకలను మోహరించవచ్చు.

భారతీయ షిప్‌యార్డ్ నిర్మించే ఈ 44,000 టన్నుల 'ఫ్లీట్ సపోర్ట్ షిప్‌'లు భారతదేశంలో నిర్మించే మొట్టమొదటి నౌకలుగా నిలుస్తాయి. ఈ ప్రాజెక్టు వల్ల ఎనిమిదేళ్లలో దాదాపు 168.8 లక్షల పని దినాల ఉపాధిని సృష్టిస్తుంది. ఈ నౌకల నిర్మాణం భారతీయ నౌకా నిర్మాణ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది, ఎంఎస్‌ఎంఈలు సహా అనుబంధ పరిశ్రమల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. నౌకల నిర్మాణంలో ఉపయోగించే ఎక్కువ పరికరాలు, వ్యవస్థలను స్వదేశీ సంస్థల నుంచి తీసుకుంటారు. కాబట్టి, ఈ నౌకలు 'భారత్‌లో తయారీ' ప్రచారానికి అనుగుణంగా, 'ఆత్మనిర్భర్ భారత్'ను సగర్వంగా చాటుతాయి.

 

****



(Release ID: 1952242) Visitor Counter : 159