విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బిహార్ లోని లఖిసరాయ్ లో పవర్ గ్రిడ్ సబ్ స్టేషన్ విస్తరణకు శంకుస్థాపన చేసిన కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి

Posted On: 18 AUG 2023 6:18PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి బిహార్  లోని లఖిసరాయ్  లో  పవర్  గ్రిడ్  కు చెందిన 400/132 కెవి లఖిసరాయ్  సబ్  స్టేషన్  విస్తరణ పనులకు 2023 ఆగస్టు 18వ తేదీన శంకుస్థాపన చేశారు. కేంద్ర విద్యుత్  మంత్రిత్వ నిర్వహణలో  ప్రభుత్వ రంగానికి చెందిన పవర్  గ్రిడ్  కార్పొరేషన్  ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పవర్ గ్రిడ్)  ఈ సబ్  స్టేషన్  నిర్మించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సబ్  స్టేషన్ ప్రాంగణంలోనే 500 ఎంవిఏ సామర్థ్యం గల 2 ట్రాన్స్ ఫార్మర్లు సహా 220 కెవి జిఐఎస్  ను నిర్మిస్తారు.

లఖిసరాయ్ ఎంఎల్ఏ శ్రీ విజయ్  కుమార్  సిన్హా, శాసన మండలి సభ్యుడు శ్రీ అజయ్  కుమార్  సింగ్, పవర్  గ్రిడ్  చైర్మన్/మేనేజింగ్  డైరెక్టర్ శ్రీ కె.శ్రీకాంత్, ప్రాజెక్ట్  డైరెక్టర్  శ్రీ అభయ్  చౌదరి; పవర్ గ్రిడ్, రాష్ర్ట ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి శ్రీ ఆర్. కె.సింగ్ ఈ సమావేశానికి హాజరైన వారినుద్దేశించి మాట్లాడుతూ పవర్  గ్రిడ్  కు చెందిన  లఖిసరాయ్  సబ్  స్టేషన్  విస్తరణతో ఈ ప్రాంతంలో విద్యుత్  లభ్యత గణనీయంగా మెరుగుపడుతుందని అన్నారు. ఇది యావత్  బిహార్  కు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి చెప్పారు.

భవిష్యత్  విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని దేశంలో ఇంధన సామర్థ్యాలు మెరుగుపరుస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యుత్  పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడానికి కేంద్రప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని, రాష్ర్టాలకు తగినన్ని నిధులు అందించిందని శ్రీ సింగ్  చెప్పారు.

విద్యుత్  ఉత్పత్తి, ట్రాన్స్  మిషన్  కు తగినన్ని వ్యవస్థలు అందుబాటులో ఉండగా లోడ్  కొరతకు ఆస్కారమే ఉండదని శ్రీ సింగ్  చెప్పారు. దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారనున్న నేపథ్యంలో పని  ప్రమాణాల ఉల్లంఘన జరిగినట్టయితే వినియోగదారులకు పరిహారం చెల్లించడానికి, డిస్ర్టిబ్యూషన్  లైసెన్స్  పొందిన వారు చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం చట్టం రూపొందించినట్టు మంత్రి చెప్పారు.  విద్యుత్  జెనరేటర్లు గత కాలపు గుర్తుగా నిలిచిపోతాయన్నారు.

లఖిసరాయ్ సబ్  స్టేషన్  విస్తరణతో లఖిసరాయ్, షేక్  పురా, ముంగర్, జమూయి జిల్లాల్లో విద్యుత్  లభ్యత మెరుగుపడడంతో  పాటు భవిష్యత్ ఇంధన డిమాండుకు  అవసరమైన విద్యుత్  సరఫరా అందుబాటులోకి వస్తుంది. లఖిసరాయ్  సబ్  స్టేషన్ లో 220 కెవి వోల్టేజికి అత్యాధునిక జిఐఎస్  టెక్నాలజీ ప్రవేశపెట్టడం జాతీయ గ్రిడ్  తో ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. నిరంతరాయంగా విద్యుత్  సరఫరా మెరుగుపడడం వల్ల ఈ ప్రాంతం పారిశ్రామికంగాను, వాణిజ్యపరంగాను అభివృద్ధి చెందుతుంది.

శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇక్కడ వీక్షించండి. 

 

***


(Release ID: 1950390)
Read this release in: English , Urdu , Hindi