సహకార మంత్రిత్వ శాఖ
'నేషనల్ మల్టీ స్టేట్ ఎక్స్‌పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ' వల్ల ప్రయోజనాలు
Posted On:
09 AUG 2023 5:35PM by PIB Hyderabad
'మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఎంఎస్‌సీఎస్) చట్టం'-2002 ప్రకారం, భారత ప్రభుత్వం 'నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్'ను (ఎన్‌సీఈఎల్) ఏర్పాటు చేసింది. చిన్న స్థాయి, పెద్ద స్థాయి అనే తేడా లేకుండా, ఎగుమతులు చేసే ఆసక్తి ఉన్న ప్రతి సహకార సంఘానికి ఈ సొసైటీలో సభ్యత్వం పొందడానికి అర్హత లభిస్తుంది. విదేశీ మార్కెట్లను కూడా వినియోగించుకునేలా, భారతీయ సహకార రంగంలోని మిగుళ్లను ఎగుమతి చేయడంపై ఈ సొసైటీ దృష్టి పెడుతుంది. తద్వారా, ప్రపంచవ్యాప్తంగా భారతీయ సహకార ఉత్పత్తులు, సేవలకు డిమాండ్ పెరుగుతుంది, వాటికి సాధ్యమైనంత ఉత్తమ ధరలు లభిస్తాయి. సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్, లేబులింగ్, ప్యాకేజింగ్, ధృవీకరణ, పరిశోధన & అభివృద్ధి వంటి కార్యకలాపాల ద్వారా ఇది ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. సహకార సంఘాలు ఉత్పత్తి చేసే అన్ని రకాల వస్తువులు, సేవల వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. సహకార సంఘాలకు రుణాలు, సాంకేతికత, శిక్షణ, సామర్థ్యం పెంపు, మార్కెట్ నిఘా వ్యవస్థను అభివృద్ధి చేయడం & నిర్వహించడం సహా ఎగుమతులను పెంచే వివిధ కార్యకలాపాలను చేపట్టడంలో కూడా సహాయం చేస్తుంది. 'హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్' ద్వారా, భారత ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాలకు చెందిన వివిధ ఎగుమతి సంబంధిత పథకాలు, విధానాల ప్రయోజనాలను పొందడంలో ఈ సొసైటీ సహకార సంస్థలకు సాయం చేస్తుంది. సహకార రంగంలోని మిగులు వస్తువులు & సేవల ఎగుమతులను పెంచడంలో సహాయం చేయడం ద్వారా "భారత్‌లో తయారీ"ని ప్రోత్సహిస్తుంది, "ఆత్మనిర్భర్ భారత్"కు సాయం చేస్తుంది. సహకార సంఘాల సమ్మిళిత వృద్ధి నమూనా ద్వారా "సహకార్-సే-సమృద్ధి" లక్ష్యాన్ని సాధించడంలోనూ తోడ్పడుతుంది. వస్తువులు, సేవల ఎగుమతి ద్వారా మెరుగైన ధరలు పొందడంతో పాటు & ఉత్పత్తి చేసిన మిగుళ్ల నుంచి వచ్చే డివిడెండ్ల ద్వారా కూడా ఈ సొసైటీలోని సభ్య సంఘాలు ప్రయోజనం పొందుతాయి.
కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో, 'మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం'-2002 ప్రకారం, 'నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్' (ఎన్‌సీఓఎల్), 'భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్'ను (బీబీఎస్‌ఎస్‌ఎల్) కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ సంఘాల లక్ష్యం. సహకార సంఘాల నెట్‌వర్క్ ద్వారా దేశంలో నాణ్యమైన, ధృవీకరణ పొందిన విత్తనాల వినియోగాన్ని పెంచుతాయి.
సహకార సంఘాల ద్వారా నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిని పెంచేందుకు 'భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్' సాయం చేస్తుంది. తద్వారా, దిగుమతి చేసుకునే విత్తనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది, వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం అందిస్తుంది. ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అన్ని సహకార సంఘాలు దీనిలో సభ్యత్వం తీసుకోవచ్చు. మూడు దశల్లో విత్తనాల ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ, సేకరణ, శుద్ధి, నిల్వ, బ్రాండింగ్, లేబులింగ్, ప్యాకేజింగ్‌పై సొసైటీ దృష్టి పెడుతుంది. ఇందుకోసం వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ పథకాలు, విధానాలను ఉపయోగించుకుంటుంది. "సహకార్-సే-సమృద్ధి" లక్ష్యాన్ని సాధించడంలోనూ ఇది సాయపడుతుంది. ఇక్కడ కూడా మెరుగైన ధరలు పొందడం ద్వారా & మిగుళ్ల నుంచి వచ్చే డివిడెండ్ల ద్వారా సభ్య సంస్థలు ప్రయోజనం పొందుతాయి.
కేంద్ర సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ విషయాన్ని తెలిపారు.
*****
(Release ID: 1947275)
Visitor Counter : 186