వ్యవసాయ మంత్రిత్వ శాఖ
జాతీయ ఆహార భద్రత కార్యక్రమం కింద వ్యవసాయోత్పత్తి పెంపు
Posted On:
08 AUG 2023 6:42PM by PIB Hyderabad
జాతీయ ఆహార భద్రత కార్యక్రమం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) కింద దేశంలో వ్యవసాయోత్పత్తి పెంచే దిశగా రైతులకు ప్రభుత్వం అన్నివిధాలా చేయూతనిస్తోంది. ఈ మేరకు వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, ముతక తృణధాన్యాలు (మొక్కజొన్న, బార్లీ వగైరా), పోషక-చిరుధాన్యాల (శ్రీ అన్న) ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా సాయం చేస్తోంది. ఇందులో భాగంగా మెరుగైన వ్యవసాయ పద్ధతులు/పంటల విధానంపై సాముదాయక ప్రదర్శనలు, అధిక దిగుబడినిచ్చే రకాలు/సంకర విత్తనోత్పత్తి-పంపిణీ, మెరుగైన వ్యవసాయ/ఇతర వనరుల పరిరక్షణకు యంత్రాలు/ఉపకరణాలు, సమర్థ జల వినియోగం-ఉపకరణాలు, సస్యరక్షణ పరికరాలు, పోషకాల నిర్వహణ/భూ సారం మెరుగుదల, పంటకోత అనంతర-శుద్ధి పరికరాలు, పంటల విధానం ఆధారిత శిక్షణ తదితరాలకు కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతోంది. దీంతోపాటు కొత్త రకం పప్పు ధాన్యాల విత్తన మినీకిట్ల పంపిణీ, నాణ్యమైన విత్తనోత్పత్తి, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎఆర్) పరిధిలోని సంస్థలు, రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు/వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలలో (కెవికె) విత్తన కేంద్రాల ఏర్పాటు, ‘కెవికె’ల ద్వారా సాంకేతిక ప్రదర్శనలు వంటివి కూడా ‘ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం’ పరిధిలో చేర్చబడ్డాయి.
జాతీయ ఆహార భద్రత కార్యక్రమం కింద నూనెగింజల సంబంధిత లక్ష్యం సాధన దిశగా విత్తన గింజల కొనుగోలు, ప్రాథమిక-ధ్రువీకృత విత్తనోత్పత్తి, ధ్రువీకృత విత్తన పంపిణీ, విత్తన మినీకిట్ల పంపిణీ, వివిధ స్థాయులలో (సమితి/కీలక/సాముదాయక ప్రధాన) ప్రదర్శనలు, క్షేత్రస్థాయి రైతు అవగాహన-శిక్షణ కార్యక్రమాలు, నీటి సరఫరా పరికరాల పంపిణీ, సస్యరక్షణ ఉపకరణాలు, భూసార పరిరక్షకాలు, సూక్ష్మ-పోషకాలు, కలుపు-చీడల నిర్మూలన సాధనాలు, జీవ-ఎరువులు/తయారీ కారకాలు వగైరాల కోసం ప్రోత్సాహకాలు/రాయితీలు ఇవ్వబడుతున్నాయి.
దేశంలో వంటనూనెల లభ్యత పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2021 ఆగస్టులో ప్రత్యేకంగా ‘జాతీయ ఖాద్య తైల కార్యక్రమం-ఆయిల్‌పామ్’ (ఎన్‌ఎంఇఒ-ఒపి)ను ప్రారంభించింది. దీనికింద ప్రధానంగా దిగుమతుల భారం తగ్గించేందుకు ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తుంది. తదనుగుణంగా ఈ పంట సాగు విస్తీర్ణం పెంచడం ద్వారా ముడి పామాయిల్ ఉత్పత్తి-ఉత్పాదకత పెంపునకు తోడ్పడుతుంది.
దేశంలో సూక్ష్మసాగు పద్ధతులు… అంటే- డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థల ద్వారా వ్యవసాయంలో నీటి వినియోగ సామర్థ్యం పెంపు నిమిత్తం 2015-16లో ప్రభుత్వం ‘ప్రతి నీటిచుక్కకూ మరింత పంట’ (పిడిఎంసి) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం భారత వ్యవసాయ పరిశోధన మండలి చౌక, స్థానిక ప్రాధాన్యంగల శాస్త్రవిజ్ఞాన సాంకేతికతలను రూపొందించింది. వాననీటి సంరక్షణ, పునరుపయోగం, నీటిపారుదల-వ్యవసాయ పద్ధతుల్లో కచ్చితత్వం కోసం సాంకేతికతలు, ఆధునిక వ్యవసాయ పద్ధతుల అనుసరణ, నీటి వినియోగం అధికంగాగల వరి, చెరకు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, మొక్కజొన్న, అటవీ-వ్యవసాయం వంటివాటికి బదులు పంట వైవిధ్యం పాటించడం ఈ సాంకేతికతలలో భాగంగా ఉన్నాయి. వీటిపై రైతులకు అవగాహన-శిక్షణ కోసం ‘ఐసిఎఆర్’ క్షేత్రస్థాయి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.
ఆయకట్టు అభివృద్ధి-జల నిర్వహణ (సిఎడిడబ్ల్యుఎం) కార్యక్రమం పరిధిలో ‘ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన’ను కేంద్ర జలవనరులు-నదుల అభివృద్ధి-గంగా పునరుజ్జీవన మంత్రిత్వశాఖ అమలులోకి తెచ్చింది. దీనికింద చిట్టచివరి అంచెదాకా పొలాలకు సాగునీటి అనుసంధానం కోసం కాలువల తవ్వకం, వీలైనచోట భూగర్భ పైపులైన్లు వేయడం వంటి పనుల ద్వారా సమర్థ జల వినియోగానికి చర్యలు చేపట్టింది. దీనికి అనుగుణంగా 2022 అక్టోబరు 20న సమర్థ జల వినియోగ సంస్థ (బిడబ్ల్యుయుఇ)ని మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. వ్యవసాయ, పారిశ్రామిక-గృహ రంగాల్లో సమర్థ జల వినియోగాన్ని ఈ సంస్థ ప్రోత్సహించడంతోపాటు పర్యవేక్షిస్తుంది. దేశంలో నీటిపారుదల, తాగునీటి సరఫరా, విద్యుదుత్పాదన, పరిశ్రమలు తదితర రంగాల్లో జల వినియోగ సామర్థ్యం మెరుగుదలకు ఈ సంస్థ తోడ్పాటునిస్తుంది. మరోవైపు జాతీయ జల కార్యక్రమం (ఎన్‌డబ్ల్యుఎం) కింద 2019లో ‘కచ్చితమైన పంట’ కార్యక్రమం ప్రారంభించబడింది. దీనికింద నీటి ఎద్దడిగల ప్రాంతాల్లో తక్కువ జల వినియోగంతో లాభదాయక, ఆరోగ్యకర, పోషక విలువలుగల, వ్యవసాయ-వాతావరణ-జల పరిస్థితులకు తగిన పంటలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తారు. ఇక దేశంలో నికర ఆయకట్టు 2016-17లో 692.70 లక్షల హెక్టార్లు కాగా, 2020-21నాటికి 777.29 లక్షల హెక్టార్లకు పెరిగింది. కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నపై లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
*****
(Release ID: 1946977)
Visitor Counter : 147