రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
సూక్ష్మ పోషకాల ఎరువులు
Posted On:
04 AUG 2023 3:29PM by PIB Hyderabad
ఫోలియర్ స్ప్రేగా ఉపయోగించే ఇఫ్కో సూక్ష్మ పోషక యూరియా (ద్రవం) ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి, ఎంపిక చేసిన 20 ప్రాంతాల్లోని ఎంపిక చేసిన పంటల్లో అధ్యయనం నిర్వహించినట్లు 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్' (ఇక్రా) సమాచారం ఇచ్చింది. సాంప్రదాయ యూరియాకు బదులుగా సూక్ష్మ పోషక యూరియాను స్ప్రేగా ఉపయోగించవచ్చని ఆ అధ్యయనంలో తేలింది. సూక్ష్మ పోషక యూరియాను స్ప్రే చేసే లక్షణంతో పాటు, సాంప్రదాయ యూరియా వాడకం కంటే 3-8% ఎక్కువ దిగుబడి ప్రయోజనం ఉంటుంది. ఈ నేపథ్యంలో, కేంద్ర వ్యవసాయం & రైతుల సంక్షేమ విభాగం (డీఏ&ఎఫ్‌డబ్ల్యూ), సూక్ష్మ పోషక యూరియాను సూక్ష్మ పోషక నైట్రోజన్ ఎరువులుగా ఎరువుల నియంత్రణ ఉత్తర్వు-1985లో తాత్కాలికంగా ప్రకటించింది.
ఇఫ్కో, సీఐఎల్ సూక్ష్మ పోషక డీఏపీని అభివృద్ధి చేశాయని, ఎంపిక చేసిన ఇక్రా సంస్థలు/ఎస్‌ఏయూల్లోని ఎంపిక చేసిన పంటలపై ప్రాథమిక క్షేత్ర పరీక్షలు నిర్వహించాయని ఇక్రా తెలిపింది. సూక్ష్మ పోషక డీఏపీని విత్తన శుద్ధిగా, స్ప్రేగా ఉపయోగించడం వల్ల, సాంప్రదాయిక గుళికల డీఏపీని ఆదా చేసే అవకాశం ఉందని నివేదిక సూచించింది. ఈ ప్రకారం, సూక్ష్మ పోషక డీఏపీని ఎరువుల నియంత్రణ ఉత్తర్వు- 1985 కింద భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (సీఐఎల్), ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోపరేటివ్ లిమిటెడ్‌కు (ఇఫ్కో) సూక్ష్మ పోషక డీఏపీ ఉత్పత్తికి అనుమతి లభించింది.
సూక్ష్మ పోషక యూరియా ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటులో భారత ప్రభుత్వ ప్రత్యక్ష పాత్ర లేదు. అయితే, 17 కోట్ల బాటిళ్ల సామర్థ్యంతో కలోల్, ఫుల్పూర్, అయోన్లాలో మూడు సూక్ష్మ పోషక యూరియా ప్లాంట్‌లను ఇఫ్కో ఏర్పాటు చేసింది.
ఇఫ్కో, తన కలోల్ ప్లాంట్‌లో ఈ ఏడాది మార్చి 8వ తేదీ నుంచి డీఏపీ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. కాండ్లా, పారాదీప్ వద్ద మరో రెండు ప్లాంట్లను ప్రారంభించనుంది. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సంవత్సరానికి 4 కోట్ల బాటిళ్ల (ఒక్కో బాటిల్ 1 లీటర్) ఉత్పత్తి సామర్థ్యంతో అత్యాధునిక సూక్ష్మ పోషక డీఏపీ ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసింది.
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ విషయాన్ని తెలిపారు.
*****
(Release ID: 1945954)
Visitor Counter : 129