పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హరిత భారతం కార్యక్రమం

Posted On: 31 JUL 2023 5:43PM by PIB Hyderabad

భారత వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళిక కింద ప్రకటించిన 8 ప్రధాన కార్యక్రమాల్లో హరిత భారతం కోసం జాతీయ కార్యక్రమం (జిఐఎం) కూడా ఒకటి. దేశంలోని ప్రస్తుత అటవీ నాణ్యత మెరుగుతోపాటు 10 మిలియన్‌ హెక్టార్ల అటవీ/అటవీయేతర భూములలో అటవీ/వృక్ష విస్తీర్ణం పెంపు ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. దీనికి అనుగుణంగా రాష్ట్రాలు సమర్పించిన ప్రణాళికలు/నిధుల లభ్యత మేరకు ఇప్పటిదాకా 17 రాష్ట్రాలు- ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరం, ఒడిషా, పంజాబ్ , సిక్కిం, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ సహా కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ ‘జిఐఎం’ పరిధిలో చేర్చబడ్డాయి.

   ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రణాళికలు, ‘జిఐఎం’ మార్గదర్శకాలకు లోబడి రూపొందించిన కార్యకలాపాల వార్షిక ప్రణాళికపై అంచనాల అనంతరం నిధులు కేటాయించబడతాయి. అయితే, తెలంగాణ ఇప్పటిదాకా ‘జిఐఎం’ సంబంధిత కార్యకలాపాల వార్షిక ప్రణాళికను  సమర్పించని కారణంగా ఆ రాష్ట్రానికి నిధులు కేటాయించబడలేదు. కాగా, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నీతి ఆయోగ్‌ కింద ‘ప్రగతి పర్యవేక్షణ-మూల్యాంకన కార్యాలయం (డిఎంఇఒ) 2020-21లో హరిత భారతం కోసం జాతీయ కార్యక్రమ ఔచిత్యం, ప్రభావం, సమర్థత, సుస్థిరత వగైరాలపై  మూల్యాంకనం నిర్వహించింది. అలాగే అమలు అనంతర ప్రభావాలు, కార్యక్రమ  సమానత వంటి అంశాలను కూడా లోతుగా పరిశీలించి, దీని కొనసాగింపునకు సిఫార్సు చేసింది.

   ఈ మేరకు కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు  శాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీ కుమార్‌ చౌబే ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

*****


(Release ID: 1944619) Visitor Counter : 253


Read this release in: English , Urdu