కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సైనిక తపాలా సేవల విభాగం ద్వారా భారత సైన్యంలో మొట్టమొదటి ఆధార్ కేంద్రం ఏర్పాటు - తపాలా శాఖ చొరవ

Posted On: 26 JUL 2023 6:32PM by PIB Hyderabad

భారత సైన్యం కోసం మొట్టమొదటి శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని (పీఏఈసీ) ఈ నెల 25న న్యూదిల్లీలోని 'సెంట్రల్ బేస్ పోస్టాఫీసు'లో (సీబీపీవో) ప్రారంభించారు. తపాలా విభాగం డైరెక్టర్‌ జనరల్‌ శ్రీ అలోక్ శర్మ, క్వార్టర్‌మాస్టర్ జనరల్‌ లెఫ్టినెంట్ జనరల్ రాజిందర్ దేవన్ కలిసి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. సైనిక తపాలా సేవల విభాగం అదనపు డీజీ, మేజర్ జనరల్ ఏఎం ఖాన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

దేశంలోని 48 ప్రాంతాల్లో ఉన్న ఫీల్డ్‌ తపాలా కార్యాలయాల (ఎఫ్‌పీవో) ద్వారా పీఏఈసీలు సేవలు అందిస్తాయి. త్రివిద దళాల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఆధార్ సంబంధిత సేవలను ఇవి అందిస్తాయి. అన్ని కమాండ్ ప్రధాన కార్యాలయాలు, కార్ప్స్ ప్రధాన కార్యాలయాలు, ఎంపిక చేసిన ఎఫ్‌పీవోల్లో పీఏఈసీ సేవలు లభిస్తాయి.

పీఏఈసీలకు శిక్షణ, పరికరాలు, సాంకేతికత మద్దతును తపాలా విభాగం, ఉడాయ్‌ అందిస్తాయి. ఈ 48 పీఏఈసీలు ఫీల్డ్, పీస్ స్థానాలు రెండింటిలోనూ పనిచేస్తాయి.

కొత్త సేవ ప్రారంభోత్సవం సందర్భంగా, ఆర్మీ పోస్టల్ సర్వీస్ కార్ప్స్‌కు పోస్టల్ సేవల డైరెక్టర్ జనరల్ & క్యూఎంజీ శుభాకాంక్షలు తెలిపారు. సమీప భవిష్యత్తులో మరిన్ని ఎఫ్‌పీవోల ఏర్పాటు ద్వారా ఈ సేవలను విస్తరించాలని, దానివల్ల సైనికులు తమ ప్రాంతాల్లోనే ప్రభుత్వ సేవలను పొందేందుకు వీలు కలుగుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.

క్యూఎంజీ, ఏపీఎస్‌ అదనపు డీజీ, ఏపీఎస్‌ అధికారులు పోస్టల్‌ విభాగానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

******



(Release ID: 1943095) Visitor Counter : 129


Read this release in: English , Urdu , Hindi