పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మీథేన్ ఉద్గారాలను తగ్గించే చర్యలు

Posted On: 24 JUL 2023 4:58PM by PIB Hyderabad

వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ (UNFCCC),  క్యోటో ప్రోటోకాల్ (KP), మరియు పారిస్ ఒప్పందం (PA) లపై సంతకాలు చేసిన దేశాలలో భారత్ కూడా ఒక పక్షం. యూ ఎన్ ఎఫ్ సి సి సి కి ఒక పక్షంగా, భారతదేశం క్రమానుగతంగా దాని నేషనల్ కమ్యూనికేషన్స్ (NCలు) మరియు ద్వైవార్షిక సమాచార నివేదికలను (BURs) యూ ఎన్ ఎఫ్ సి సి సి కి సమర్పిస్తుంది, ఇందులో మీథేన్ ఉద్గారాలపై సమాచారం తో కూడిన  జాతీయ గ్రీన్  హౌస్  గాస్ (GHG) జాబితా ఉంటుంది. భారతదేశం యొక్క మూడవ ద్వైవార్షిక సమాచార, నివేదిక ప్రకారం, 2016లో భారతదేశం యొక్క మీథేన్ ఉద్గారాలు (LULUCF మినహా) 409 మిలియన్ టన్ సీ ఓ ఈ, ఇందులో 73.96% వ్యవసాయ రంగం నుండి, 14.46% వ్యర్థ రంగం నుండి, 10.62% విద్యుత్ పరిశ్రమ మరియు  0.9% ఉత్పత్తి రంగం నుండి విడుదల అవుతున్నాయి.

 

పారిస్ ఒప్పందం ప్రకారం భారతదేశం తన జాతీయంగా నిర్ణయించిన సహకారాన్ని (NDC) సమర్పించింది, ఇది ఏ రంగానికి నిర్దిష్ట ఉపశమన బాధ్యత లేదా చర్యకు కట్టుబడి ఉండదు.   మొత్తం  జీ డీ పీ లో ఉద్గార తీవ్రతను తగ్గించడం మరియు కాలక్రమేణా దాని ఆర్థిక వ్యవస్థ యొక్క శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరియు అదే సమయంలో మన సమాజంలోని ఆర్థిక వ్యవస్థ లో నష్ట పోయే రంగాలను రక్షించడం లక్ష్యం. అయినప్పటికీ, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి తన చర్యలను రూపొందించడంలో మరియు అమలు చేయడంలో భారతదేశం తన నిబద్ధతలో స్థిరంగా ఉంది. మీథేన్ ఉద్గారాలను తగ్గించడానికి కొనసాగుతున్న చర్యలు క్రింది విధంగా ఉన్నాయి:

 

వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడిన జాతీయ సుస్థిర వ్యవసాయం (NMSA)లో వరి సాగులో మీథేన్ తగ్గింపు పద్ధతులతో సహా వాతావరణాన్ని తట్టుకునే పద్ధతులను పాటించాలి. ఈ పద్ధతులు మీథేన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించడానికి దోహదం చేస్తాయి.

నేషనల్ ఇన్నోవేషన్స్ ఇన్ క్లైమేట్ రెసిలెంట్ అగ్రికల్చర్ (NICRA) ప్రాజెక్ట్ కింద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) వరి నుండి మీథేన్‌ను తగ్గించే సంభావ్యతతో అనేక సాంకేతికతలను అభివృద్ధి చేసింది. (ఎ) వరి ఇంటెన్సిఫికేషన్ సిస్టమ్ - సాంప్రదాయ వరి సాగు  కంటే 22-35% తక్కువ నీటితో వరి దిగుబడిని 36-49% నుండి పెంచే సామర్థ్యాన్ని సాంకేతికత కలిగి ఉంది; (బి) డైరెక్ట్ సీడెడ్ రైస్ - ఈ విధానంలో నర్సరీలను పెంచడం, పుడ్లింగ్ మరియు మార్పిడి చేయడం వంటివి ఉండవు కాబట్టి మీథేన్ ఉద్గారాలను తగ్గిస్తుంది.  సాంప్రదాయ వరి సాగు వలె కాకుండా, ఈ వ్యవస్థలో నీరు నిలబడి వుండదు.  (సి) పంటల వైవిద్యీకరణ కార్యక్రమం - వరి సాగు నుంచి పప్పుధాన్యాలు, నూనెగింజలు, మొక్కజొన్న, పత్తి మరియు అగ్రో ఫారెస్ట్రీ వంటి ప్రత్యామ్నాయ పంటలకు మళ్లించడం వల్ల మీథేన్ ఉద్గారాలు నివారించబడతాయి.

వాతావరణాన్ని తట్టుకునే పద్ధతులపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ విభాగం (DAHD) జాతీయ లైవ్‌స్టాక్ మిషన్‌ను అమలు చేస్తోంది, ఇందులో పశు జాతుల అభివృద్ధి మరియు సమతుల్య ఆహారం ఉన్నాయి. నాణ్యమైన సమతుల్య రేషన్‌తో పశువులకు ఆహారం ఇవ్వడం పశువుల నుండి మీథేన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

 

పశువుల నుండి మీథేన్ ఉద్గారాలను తగ్గించే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ కింద పచ్చి మేత ఉత్పత్తి, సైలేజ్ తయారీ, పచ్చిక కోత మరియు మొత్తం మిశ్రమ రేషన్‌ను ప్రోత్సహిస్తుంది.

'ది గోబర్ధన్' పథకం మరియు కొత్త జాతీయ బయోగ్యాస్ మరియు సేంద్రీయ ఎరువు కార్యక్రమం వంటి కార్యక్రమాల ద్వారా గ్రామాలలో స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తితో పాటు పశువుల వ్యర్థాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. గోబర్ధన్ పథకం అంతర్లీనంగా బయోడిగ్రేడబుల్ వ్యర్థాల పునరుద్ధరణ, వ్యర్థాలను వనరులుగా మార్చడం మరియు మీథేన్ ఉద్గారాలను తగ్గించడం వంటి వాటికి మద్దతు ఇస్తుంది.

ఈ సమాచారాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***



(Release ID: 1942294) Visitor Counter : 156


Read this release in: English , Urdu