మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో జులై 29న జాతీయ విద్యావిధానం 3వ వార్షికోత్సవం సందర్భంగా అఖిల భారతీయ శిక్షా సమాగంను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఎన్ఈపీకి అనుగుణంగా విద్యను మల్టీడిసిప్లినరీగా మార్చే ఫ్రాక్టల్ అకడమిక్స్‌తో ఐఐటీ హైదరాబాద్ కోర్సులను ప్రారంభించిందని తెలిపిన ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అన్ని ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ లకు అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్, మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్, జాతీయ విద్యా విధానం 2020 కి అనుగుణంగా అమలు చేస్తున్నట్లు తెలపిన ఉపకులపతి ప్రొఫెసర్ బి.జగదీశ్వర్ రావు
వృత్తి విద్యను సాధారణ విద్యతో అనుసంధానం చేయడం, ప్రాంతీయ భాషల్లో నైపుణ్యం సాధించడం తెలంగాణలో జరుగుతోందని తెలిపిన స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రీజినల్ డైరెక్టోరేట్ జాయింట్ డైరెక్టర్
Posted On:
24 JUL 2023 5:13PM by PIB Hyderabad
21వ శతాబ్దపు అవసరాలకు తగినట్లు విస్తృత ఆధారిత, సరళమైన, మల్టీ డిసిప్లినరీ విద్య ద్వారా భారతదేశాన్ని గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్ గా మార్చాలనే లక్ష్యంతో 2020 సంవత్సరంలో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) తీసుకు రావడం జరిగింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 29న న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లోని ఐటిపిఓలో జాతీయ విద్యా విధానం 2020, మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అఖిల భారతీయ శిక్షా సమాగాన్ని ప్రారంభిస్తారు. విద్యా మంత్రిత్వ శాఖ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
ఈ వారంలో ఎన్ఈపీ మూడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుంటున్న తరుణంలో ఉన్నత విద్యా సంస్థల అధిపతులు, నైపుణ్యాభివృద్ధి సంస్థల అధికారులు, ఎన్ఈపీ అమలు ప్రయాణంలో సాధించిన విజయాలు, ముఖ్యాంశాలను మీడియాతో పంచుకున్నారు.
ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ, ఫ్రాక్టల్ అకడమిక్స్ అంటే 0.5 నుంచి 3 వరకు క్రెడిట్స్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న విషయాల్లో లోతైన అవగాహనను కలిగి ఉంటారని ఆయన అన్నారు. అన్ని యుజి ప్రోగ్రామ్‌లలో పాఠ్యప్రణాళిక 10% లిబరల్ ఆర్ట్స్‌ను కలిగి ఉంటుంది. విద్యార్థులు సంస్థ వెలుపల నుండి కూడా క్రెడిట్‌లను పొందవచ్చు. ఆత్మనిర్భర్ భారత్ కు దారితీసే ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను ప్రోత్సహించేందుకు ఐఐటీ-హెచ్ బిల్డ్ (బోల్డ్ అండ్ యూనిక్ ఐడియాస్ లీడింగ్ డెవలప్ మెంట్) ప్రాజెక్టుల ద్వారా విద్యార్థుల ఆవిష్కరణలకు మద్దతు ఇస్తోందని, అలాంటి ఆవిష్కరణలను కొనసాగించడానికి విద్యార్థులకు 6 క్రెడిట్ లతో సెమిస్టర్ విరామం ఇస్తోందని ప్రొఫెసర్ మూర్తి తెలిపారు. పరిశ్రమల కోసం టెక్నాలజీ రీసెర్చ్ పార్క్ (టీఆర్పీ), స్టార్టప్ల కోసం టెక్నాలజీ ఇంక్యుబేషన్ పార్క్ (టీఐపీ) పరిశ్రమల మద్దతుతో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఐఐటీ హైదరాబాద్లో 1,50,000 చదరపు అడుగుల స్థలంతో ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ తెలిపారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఎన్ఈపీ అమలు గురించి ఉపకులపతి ప్రొఫెసర్ బి.జగదీశ్వర్ రావు మాట్లాడుతూ అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ పథకం ప్రారంభమైందన్నారు. అన్ని ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ లకు మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఫెసిలిటీని అమలు చేస్తున్నామని, మొత్తం 19 ప్రోగ్రామ్ లు ఉన్నాయని తెలిపారు. ఒకేసారి రెండు అకడమిక్ కోర్సులను అభ్యసించడానికి నిబంధనలు అవలంబించామని, సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లెర్నింగ్ ద్వారా 14 డిప్లొమా కోర్సులను అందిస్తున్నట్లు ప్రొఫెసర్ రావు తెలిపారు. ఎన్ఈపీలో వివరించిన మల్టీ డిసిప్లినరీ విధానానికి అనుగుణంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం జెండర్ స్టడీస్ ఇంట్రడక్షన్, విలువ ఆధారిత విద్య, ఎన్జీవోలు, నేషన్ బిల్డింగ్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టిందని పంచుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రాంతీయ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ శ్రీ విద్యానాధ్ మాట్లాడుతూ, వృత్తి విద్యను సాధారణ విద్యలో ఏకీకరణకు ఎన్ఈపీ ప్రాధాన్యమిస్తున్నందున విద్యార్థులకు అకడమిక్, ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించేందుకు సంస్థ కృషి చేస్తోందన్నారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పిఎంకెవివై 2022-23) కింద పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రఖ్యాత సంస్థలు మొదలైనవి ఉన్నాయని శ్రీ విద్యానంద్ తెలియజేశారు. పిఎంకెవివై కింద నాణ్యమైన శిక్షణను అందించడానికి వారి ప్రస్తుత మౌలిక సదుపాయాలు మరియు డొమైన్ అనుభవాన్ని ఉపయోగించుకుంటూ 'స్కిల్ హబ్స్'గా ఆన్ బోర్డ్ చేయబడుతున్నాయి. ప్రస్తుతం 1000 స్కిల్ హబ్ లు ఉన్నాయని, వాటిలో లక్ష మంది అభ్యర్థులు చేరారని తెలిపారు. ఐఐటీలు, ఐఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు వంటి దేశంలో పేరుగాంచిన సంస్థలతో సహా సుమారు 2000 పైచిలుకు సంస్థలకు లక్ష్యాలను కేటాయించడం జరిగింది. ఐఎస్ఎం ధన్‌బాద్, ఐఐటీ గౌహతి ఇప్పటికే అసిస్టెంట్ మైన్ సర్వేయర్, గ్రీన్ హౌస్ ఆపరేటర్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలర్, సోషల్ మీడియా అసోసియేట్ జాబ్ రోల్స్‌లో శిక్షణ ప్రారంభించాయి.
యువత భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలనైనా నిర్వర్తించేలా వారిని సన్నద్ధం చేసేందుకు ఎన్ఈపీ 2020 మార్గం సుగమం చేస్తుంది. రానున్న కాలంలో వచ్చే పలు నూతన ఉద్యోగాలకు వారిని సిద్ధం చేయడంలో ఇది దోహదపడుతుంది. విమర్శనాత్మక ఆలోచన, సమస్యా పరిష్కారం వంటివి వ్యక్తుల పునాదులను, ఉన్నత అభిజ్ఞా సామర్థ్యాలను అభివృద్ధి చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. అందువల్ల విద్యావేత్తలు, విధాన నిపుణులు, పారిశ్రామిక నిపుణుల నాయకత్వం మేధోమథనం, అమలు వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. దీనికనుగుణంగా, న్యూఢిల్లీలో ఈ నెల 29 నుంచి రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో పదహారు సెషన్లు ఉండనున్నాయి. నాణ్యమైన విద్య, పాలన, సమాన, సమ్మిళిత విద్య, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సమస్యలు (ఎస్ఈడీజీ), నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్), ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, విద్య, భవిష్యత్ నైపుణ్యాభివృద్ధికి మధ్య సమన్వయాన్ని సృష్టించడం, విద్య అంతర్జాతీయీకరణ తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.
*****
(Release ID: 1942139)