రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

వీపీఎన్‌కు ఐఎన్‌ఎస్‌ కిర్పాన్‌ అప్పగింత కార్యక్రమం - 22 జులై 2023

Posted On: 22 JUL 2023 10:53PM by PIB Hyderabad

“ఐఎన్‌ఎస్‌ కిర్పాన్‌ అప్పగింత వేడుక, భారత్‌-వియత్నాం మధ్య గాఢమైన స్నేహం & వ్యూహాత్మక భాగస్వామ్యానికి గుర్తు. భారత్‌, తన ఏ మిత్ర దేశానికైనా, పూర్తిస్థాయి యుద్ధనౌకను అందించడం ఇదే తొలిసారి. అదే ఈ సందర్భానికి మరింత విశిష్టత చేకూర్చింది" - భారత నౌకాదళాధిపతి, అడ్మిరల్‌ ఆర్ హరి కుమార్

భారతదేశానికి 32 సంవత్సరాల పాటు సేవలు అందించిన నౌకాదళ నౌక కిర్పాన్‌ను, ఈ రోజు వియత్నాంలోని కామ్ రాన్‌లో జరిగిన కార్యక్రమంలో, వియత్నాం పీపుల్స్ నేవీకి (వీపీఎన్‌) భారత్‌ అప్పగించింది. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్ హరి కుమార్, వియత్నాం పీపుల్స్ నేవీ డిప్యూటీ కమాండర్-ఇన్-చీఫ్ & చీఫ్ ఆఫ్ స్టాఫ్, రియర్ అడ్మిరల్‌ ఫామ్ మాన్ హంగ్ ఈ వేడుకకు అధ్యక్షత వహించారు.

ఐఎన్‌ఎస్‌ కిర్పాన్ సేవలు 1991లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి భారత తూర్పు నౌకాదళంలో అంతర్భాగంగా పని చేసింది. గత 32 సంవత్సరాలుగా అనేక కార్యకలాపాల్లో పాల్గొంది. దాదాపు 12 మంది అధికారులు, 100 మంది సిబ్బంది ఈ నౌకలో విధులు నిర్వహిస్తుంటారు. ఐఎన్‌ఎస్‌ కిర్పాన్‌ పొడవు 90 మీటర్లు & వెడల్పు 10.45 మీటర్లు, బరువు 1450 టన్నులు. ఈ ఓడను పూర్తిస్థాయి ఆయుధాలతో కలిపి ఈరోజు వియత్నాం పీపుల్స్ నేవీకి అప్పగించారు.

 "భారత నౌకాదళానికి చెందిన అత్యుత్తమ, సుదీర్ఘకాలం సేవలందించిన యుద్ధనౌకల్లో ఒకటైన కిర్పాన్‌ను వియత్నాం పీపుల్స్ నేవీకి అప్పగించే కార్యక్రమంలో భాగం కావడం నాకు చాలా గౌరవప్రదమైన విషయం. భారత నౌకాదళం తరపున, ఇక్కడ ఉన్న విశిష్ట అతిథులందరికీ సాదర స్వాగతం పలకడం నా అదృష్టం. కిర్పాన్‌ను వియత్నాంకు బదిలీ చేసే కార్యక్రమం భారతదేశ జీ20 నేపథ్యాంశమైన 'వసుధైక కుటుంబం - ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు'ను ప్రతిబింబిస్తుంది" అని అడ్మిరల్‌ ఆర్ హరి కుమార్ చెప్పారు.

ఐఎన్‌ఎస్‌ కిర్పాన్‌ను వియత్నాం పీపుల్స్ నేవీకి బదిలీ చేయడం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో 'ప్రాధాన్యత భద్రత భాగస్వామి'గా భారత నౌకాదళం హోదాను సూచిస్తుంది. రెండు దేశాల నౌకాదళాల మధ్య ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచేలా ఇది ప్రోత్సహిస్తుంది.

 

*****(Release ID: 1941849) Visitor Counter : 83


Read this release in: English , Urdu , Hindi