వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ-అంకుర సంస్థలకు ప్రోత్సాహం

Posted On: 21 JUL 2023 4:06PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయం & రైతుల సంక్షేమ విభాగం (డీఏ&ఎఫ్‌డబ్ల్యూ), రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) కింద, 'ఆవిష్కరణలు & వ్యవసాయ-అంకుర సంస్థల అభివృద్ధి' కార్యక్రమాన్ని 2018-19 నుంచి అమలు చేస్తోంది. ఆర్థిక సాయం అందించడం ద్వారా నూతన ఆవిష్కరణలు, వ్యవసాయ వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, దేశంలో ఇంక్యుబేషన్ వ్యవస్థను పెంపొందించడం దీని లక్ష్యం. అంకుర సంస్థలకు ప్రోత్సాహం సహా ఈ కార్యక్రమం అమలు కోసం దేశవ్యాప్తంగా 5 నాలెడ్జ్ పార్టనర్లు (కేపీలు), 24 ఆర్‌కేవీవై వ్యవసాయ-వ్యాపార ఇంక్యుబేటర్లను (ఆర్‌-ఏబీఐలు) ఈ విభాగం ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఏర్పాటైన నాలెడ్జ్ పార్ట్‌నర్లు, ఆర్‌కేవీవై వ్యవసాయ-వ్యాపార ఇంక్యుబేటర్ల వద్ద అంకుర సంస్థలు శిక్షణ పొందాయి, ఎదిగాయి. ఉత్పత్తులు, సేవలు, వ్యాపార వేదికలు మొదలైనవాటిని మార్కెట్‌లోకి తీసుకెళ్లడానికి, వ్యాపార దక్షత సాధించడానికి, ఉత్పత్తులు & కార్యకలాపాలను పెంచుకోవడానికి ఈ అంకుర సంస్థలకు సాంకేతికత, ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది.

కేపీలు, ఆర్‌-ఏబీఐలు ఈ అంకుర సంస్థల ఉత్పత్తులు & సాంకేతిక ధృవీకరణ, గుర్తింపు కోసం దేశంలోని వివిధ సంస్థలతో అంకుర సంస్థలను అనుసంధానిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. వ్యవసాయ-అంకుర సంస్థల సమావేశాలు, ప్రదర్శనలు, వెబినార్లు, కార్యశాలలు సహా వివిధ జాతీయ స్థాయి కార్యక్రమాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. తద్వారా, వ్యవసాయ-అంకుర సంస్థలకు ప్రోత్సాహం కోసం వివిధ వర్గాలతో వాటిని అనుసంధానించే వేదికగా నిలుస్తోంది.

ఈ కార్యక్రమం కింద, ఆలోచన దశలో రూ.5 లక్షల వరకు, సంస్థ ఎదిగే దశలో రూ.25 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు 1176 వ్యవసాయ-అంకుర సంస్థలకు రూ.75.25 కోట్ల ఆర్థిక సాయం అందింది.

వ్యవసాయ-అంకుర సంస్థలు స్థాపించేలా యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి 2023-24 నుంచి ఐదేళ్ల వరకు రూ.500 కోట్లతో 'యాక్సిలరేటర్ ఫండ్' ఏర్పాటు ప్రతిపాదనను భారత ప్రభుత్వం ఆమోదించింది. దేశంలోని వ్యవసాయ వ్యవస్థను ఆధునీకరించే సాంకేతికతలను తీసుకువచ్చే అంకుర సంస్థలను పెంచేందుకు ఈ నిధి ఉపయోగపడుతుంది.

యాక్సిలరేటర్ ఫండ్ కార్యక్రమం కింద 2023-24లో వివిధ కార్యకలాపాలు చేపడతారు. సంస్థాగత యంత్రాంగం & కార్యాచరణ మార్గదర్శకాల రూపకల్పన, వ్యవసాయం & అనుబంధ రంగాల్లో సమస్యల గుర్తింపు, అధిక ప్రభావం & వినూత్న పరిష్కారాలు కలిగిన వ్యవసాయ-అంకుర సంస్థల ఎంపిక, ఎంచుకున్న వ్యవసాయ-అంకుర సంస్థలను ప్రోత్సహించడం & సామర్థ్యం పెంపు కోసం సాంకేతిక, ఆర్థిక సాయం అందించడం వంటివి ఆ కార్యకలాపాల్లో కొన్ని.

 కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని వెల్లడించారు.

 

****


(Release ID: 1941575) Visitor Counter : 169


Read this release in: English , Urdu , Tamil