వ్యవసాయ మంత్రిత్వ శాఖ

చిరుధాన్యాలకు ప్రచారం

Posted On: 21 JUL 2023 4:10PM by PIB Hyderabad

రెస్టారెంట్లు, హోటళ్లలో చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వివిధ చర్యలు తీసుకుంటోంది. చిరుధాన్యాల రుచుల కేంద్రాలను నెలకొల్పడం, చిరుధాన్యాలతో వండిన వంటల ఆరోగ్య ప్రయోజనాల గురించి భారతీయ & అంతర్జాతీయ స్థాయి చెఫ్‌లకు అవగాహన కల్పించడం, హోటల్ సంఘాలు & హోటల్ గ్రూపులతో సమావేశాలు నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టింది. చిరుధాన్యాల వినియోగం, ప్రయోజనాల గురించి అన్ని హోటల్ చైన్‌లు, రెస్టారెంట్లలో పని చేస్తున్న ప్రముఖ భారతీయ చెఫ్‌లకు కూడా అవగాహన కల్పించడం జరుగుతోంది. చిరుధాన్యాలకు ఉన్న ప్రత్యేక ప్రయోజనాల కారణంగా, దేశీయ, ప్రపంచ డిమాండ్‌ను సృష్టించడం, వాతావరణాన్ని తట్టుకునే పంటలను ప్రోత్సహించడం, ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులను పెంచడానికి కార్యక్రమాలు, కార్యశాలలు, సమావేశాలు, రోడ్ షోలు, కిసాన్ మేళాలు వాటివి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ, అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం (ఐవైఎం)-2023ని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో జరుపుతోంది.

ఐవైఎం 2023 లక్ష్యాలను సాధించడానికి, ప్రపంచవ్యాప్తంగా భారతీయ చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, రైతులు, అంకుర సంస్థలు, ఎగుమతిదార్లు, చిల్లర వ్యాపారాలు, హోటళ్లు, భారత రాయబార కార్యాలయాలు మొదలైన వాటితో వ్యవసాయ & రైతు సంక్షేమ విభాగం చురుగ్గా సమన్వయం చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వంలోని 24 మంత్రిత్వ శాఖలు/విభాగాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, విదేశాల్లోని భారతీయ సంస్థలు చిరుధాన్యాల విలువ గొలుసును మెరుగుపరచడం, ఐవైఎంపై అవగాహన కల్పించడం కోసం మిల్లెట్‌లపై రెండు వారాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

మహిళా రైతులు, గృహిణులు, విద్యార్థులు, యువ పారిశ్రామికవేత్తలకు విలువ ఆధారిత చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులు, రోజువారీ వంటలు మొదలైన వాటి తయారీపై హైదరాబాద్‌లోని ఇక్రా-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్‌) శిక్షణను అందిస్తోంది, వారి స్వయంఉపాధికి మద్దతుగా నిలుస్తోంది. ఈ సంస్థ, చిరుధాన్యాల ఆహారాల కోసం "రెడీ టు ఈట్", "రెడీ టు కుక్" సహా 67 విలువ ఆధారిత సాంకేతికతలను అభివృద్ధి చేసింది. "ఈట్‌రైట్" నినాదంతో చిరుధాన్యాల ఆహార పదార్థాల బ్రాండింగ్ చేస్తోంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, వ్యవసాయ-వ్యాపార ఇంక్యుబేటర్, సాంకేతికత వ్యాపార ఇంక్యుబేటర్లు మొదలైనవి నిర్వహిస్తోంది.

కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని వెల్లడించారు.

 

*****



(Release ID: 1941553) Visitor Counter : 153


Read this release in: English , Urdu , Tamil