సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

ఎంఎస్‌ చట్టం 2013 అమలు తీరుపై సమీక్షించేందుకు సెంట్రల్ మానిటరింగ్ కమిటీ 8వ సమావేశం నిర్వహించిన కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ

Posted On: 05 JUL 2023 5:44PM by PIB Hyderabad

కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత శాఖ మంత్రి డా.వీరేంద్ర కుమార్ అధ్యక్షతన, న్యూదిల్లీలోని డా.అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో సెంట్రల్ మానిటరింగ్ కమిటీ 8వ సమావేశం జరిగింది. "మరుగుదొడ్ల పూడికతీత పనుల్లో మానవ ఉపాధి నిషేధం, వారి పునరావాస చట్టం, 2013" (ఎంఎస్‌ చట్టం, 2013) అమలు తీరును ఆయన సమీక్షించారు. ఈ బిల్లును 2013 సెప్టెంబర్‌లో పార్లమెంటు ఆమోదించింది, 2014 డిసెంబర్‌లో చట్టంగా మారి అమల్లోకి వచ్చింది. మురుగు & మరుగుదొడ్ల పూడికతీత పనులను మనుషులతో చేయించడాన్ని పూర్తిగా నిర్మూలించడం, గుర్తించిన కార్మికులకు సమగ్ర పునరావాసం కల్పించడం ఈ చట్టం లక్ష్యం. మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రాందాస్ అథవాలే, నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్‌ అధ్యక్షుడు, డీవోఎస్‌జేఈ కార్యదర్శి, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు/కార్యదర్శులు, కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు/కమిషన్ల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మురుగు & మరుగుదొడ్ల పూడికతీత, వాటికి సంబంధించిన పనులను ఇప్పటికీ చేస్తున్న కార్మికుల సమాచారాన్ని సేకరించడానికి కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ 24.12.2020న ప్రారంభించిన మొబైల్ యాప్ “స్వచ్ఛత అభియాన్”పై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరుగుదొడ్ల పూడికతీత, వాటికి సంబంధించిన పనులను మానవీయంగా ఇప్పటికీ చేస్తున్న కార్మికుల గురించి ఎవరికి సమాచారం తెలిసినా ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. గత మూడేళ్లుగా ఈ యాప్‌లో అప్‌లోడ్ చేసిన ప్రతి అంశాన్ని వ్యక్తిగతంగా శోధించామని, మనుషులతో అలాంటి పనులు చేయిస్తున్నట్లు ఆధారాలు దొరకలేదని కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది.

స్వచ్ఛ భారత్ అభియాన్ కింద చాలా వరకు మరుగుదొడ్లను శానిటరీ లెట్రిన్‌లుగా మార్చడంతో మనుషులతో పూడికతీత సమస్య తొలగిపోయిందని కమిటీ పేర్కొంది. ప్రస్తుతం, మనుషులతో అలాంటి పనులు చేయిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు.

మనుషులతో మరుగుదొడ్ల పూడికతీత లేని ప్రాంతంగా తమ జిల్లాను ప్రకటించాలని అన్ని రాష్ట్రాలు/జిల్లాలకు కమిటీ సూచించింది. ఇప్పటి వరకు, దేశంలో ఉన్న 766 జిల్లాల్లో 520 జిల్లాల నుంచి అటువంటి నిర్ధరణ అందింది. మిగిలిన జిల్లాలు దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది.

మరుగుదొడ్ల పూడికతీత కార్మికులకు సంబంధించి, కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ 2013, 2018 సంవత్సరాల్లో రెండు సర్వేలు ప్రారంభించిందని కమిటీకి తెలియజేశారు. ఈ సర్వేల ద్వారా 58,098 మంది కార్మికులను గుర్తించి, వాళ్లందరికీ ఏకకాల నగదు సాయం కింద రూ. 40,000 అందించారు. వారిలో 22,294 మందికి/ఆధారపడిన వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించారు. స్వయం ఉపాధి ప్రాజెక్టుల కోసం బ్యాంకు రుణాలు పొందిన 2,313 మంది కార్మికులు/ఆధారపడిన వాళ్లకు మూలధన రాయితీ విడుదల చేశారు. మురుగు కాల్వలు, సెప్టిక్ ట్యాంకుల శుభ్రత సమయంలో మరణాలను తగ్గించడానికి మరో 641 మంది కార్మికులు/వారిపై ఆధారపడిన వారికి పారిశుద్ధ్య సంబంధిత ప్రాజెక్టుల కోసం మూలధన రాయితీలు మంజూరు చేశారు.

మురుగు కాల్వలు లేదా సెప్టిక్ ట్యాంకుల శుభ్రతకు సంబంధించిన అన్ని పనులను యంత్రాలతో చేయించేలా, తగిన జాగ్రత్తలు పాటించేలా చేయడంపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు కమిటీకి తెలియజేశారు.

మురుగు కాల్వలు లేదా సెప్టిక్ ట్యాంకులను యాంత్రికంగా శుభ్రపరచడం, ఎంఎస్‌ చట్టం, ఎంఎస్‌ నిబంధనల గురించి మున్సిపాలిటీల సిబ్బంది, కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించడానికి 'నేషనల్ సఫాయి కర్మచారీస్‌ ఫైనాన్స్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్' ఇప్పటి వరకు 1,177 కార్యశాలలు నిర్వహించింది.

ప్రమాదకరంగా శుభ్రం చేయడం, ఈ క్రమంలో సంభవించే కార్మికుల మరణాలను ఆపడానికి, వారి భద్రత & గౌరవాన్ని పెంచడానికి కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ, కేంద్ర గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కలిసి 'నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్' (నమస్తే) అనే పథకాన్ని రూపొందించాయి. 2025-26 వరకు, మూడేళ్లలో దేశంలోని 4800 పైగా పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్‌బీలు)లో నమస్తే పథకాన్ని అమలు చేయడానికి రూ.349.70 కోట్లు కేటాయించారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్రాలు/యూటీలు, యూఎల్‌బీలు తీసుకోవాల్సిన చర్యలు ఇవి:

  1. నమస్తే అమలు సక్రమంగా జరిగేలా యూఎల్‌బీలను ప్రోత్సహించడం
  2. ప్రతి జిల్లాలో 'రెస్పాన్సిబుల్ శానిటేషన్ అథారిటీ' (ఆర్‌ఎస్‌ఏ) ఏర్పాటు
  3. ప్రతి పెద్ద యూఎల్‌బీలో 'శానిటేషన్ రెస్పాన్స్ యూనిట్' (ఆర్‌ఎస్‌యూ) ఏర్పాటు
  4. ప్రతి ఎస్‌ఆర్‌యూలో హెల్ప్‌లైన్ నంబర్‌ ఏర్పాటు
  5. ఎంఐఎస్‌ పోర్టల్ ద్వారా మురుగు, సెప్టిక్ ట్యాంక్ కార్మికుల (ఎస్‌ఎస్‌డబ్ల్యూలు) వివరాలు నిర్వహణ
  6. పారిశుద్ధ్య సంబంధిత ప్రాజెక్టుల కోసం మురుగు/సెప్టిక్ ట్యాంక్ కార్మికుల ఎస్‌హెచ్‌జీ ఏర్పాటు
  7. పారిశుద్ధ్య సంబంధిత ప్రాజెక్టుల్లో పారిశుధ్య కార్మికులకు ఉపాధి హామీని అందించడం
  8. రాష్ట్ర స్థాయి/యూఎల్‌బీ స్థాయిలో అధికారులు/రాష్ట్ర మిషన్ డైరెక్టర్ల నియామకం
  9. మురుగు శుద్ధి నిపుణులు, ఎస్‌ఆర్‌యూ సిబ్బందికి శిక్షణ
  10. మురుగు శుద్ధి నిపుణులకు వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ)
  11. యూఎల్‌బీల్లో అవగాహన కల్పన
  12. నమస్తే కార్యక్రమాలను స్వచ్ఛ్ సేవక్షణ్ కింద మూల్యాంకనం చేయడం
  13. యూఎల్‌బీల పోర్టల్‌లో యంత్రాలు, ప్రత్యేకత గల కార్మికుల వివరాలను అప్‌లోడ్ చేయడం

నమస్తే పథకంలోని ప్రతి అంశాన్ని కమిటీ గుర్తించింది. మురుగునీరు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడానికి సాంకేతిక పరికరాలను ప్రతి స్థానిక యంత్రాంగం ఉపయోగించుకునేలా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది.

భద్రత పరమైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కార్మికుల మరణం సంభవిస్తే, బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లింపు వేగంగా జరుగుతుందని, ఆ తరహా నిర్లక్ష్యానికి కారణమైన సంస్థపై ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యేలా చూస్తామని వివరించారు. మరణ సంఘటనలు తగ్గుముఖం పట్టాయని కమిటీ గుర్తించింది, సున్నా మరణాల లక్ష్యాన్ని వీలైనంత త్వరగా సాధించాలని ఆదేశించింది.

********



(Release ID: 1937633) Visitor Counter : 166


Read this release in: English , Urdu , Hindi , Tamil