కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఇండియా పోస్ట్, కెనడా పోస్ట్ మధ్య ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీసు
Posted On:
30 JUN 2023 7:50PM by PIB Hyderabad
ఈ-కామర్స్ ఎగుమతుల్లో మరింత సౌలభ్యం కోసం, భారత్-కెనడా మధ్య ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీసు (ఐటీపీఎస్) ప్రారంభం అవుతోంది. ఇందుకోసం, కెనడా పోస్ట్‌తో ఇండియా పోస్ట్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. 2023 జూన్ 28 నాటి గెజిట్‌లో తపాలా విభాగం ప్రకటన ప్రకారం, ఈ సేవ జులై 01, 2023 నుంచి అమలులోకి వస్తుంది.
ఉత్పత్తుల పంపిణీ, బట్వాడా కోసం తీసుకొచ్చిన పోటీ ఆధారిత సేవ ఐటీపీఎస్. ఎంఎస్‌ఎంఈలు, చిన్న వ్యాపార సంస్థల వంటివి స్థానిక తపాలా కార్యాలయాల ద్వారా తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రోత్సహించడానికి దీనిని రూపొందించారు. ఇండియా పోస్ట్ ఇప్పటికే 38 భాగస్వామ్య దేశాలకు ఈ సేవను అందిస్తోంది, కెనడా 39వ దేశం. బ్రిటన్, ఫ్రాన్స్, యూఏఈ, ఈజిప్టు, ఒమన్ సహా 22 దేశాలతో 2023 జూన్ 01 నుంచి ఇండియా పోస్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. వీటితో కలిపి, భాగస్వామ్య దేశాల సంఖ్య 16 నుంచి 38కి పెరిగింది. బట్వాడా వ్యయాలతో పాటు ఐటీపీఎస్ సేవలు లభించే దేశాల వివరాలను https:/ /www.indiapost.gov.in/MBE/Pages/Content/International-Tracked-Packet-.aspx. లింక్ ద్వారా చూడవచ్చు.
అంతర్జాతీయ ఈఎంఎస్ (స్పీడ్ పోస్ట్), ఇతర మార్కెట్ ఉత్పత్తులతో పోలిస్తే ఐటీపీఎస్ ధరలు తక్కువగా ఉంటాయి. మొదటి 50 గ్రాముల బరువుకు రూ.400 రుసుము, ఆపై ప్రతి అదనపు 50 గ్రాములకు రూ.35 చొప్పున చెల్లించాలి. ఎగుమతిదార్ల వద్దకే వచ్చి ఉత్పత్తులను సేకరించే వెసులుబాటుతో, 2 కిలోల వరకు తక్కువ ధరకే బట్వాడా సౌకర్యాన్ని ఇది అందిస్తుంది. ఒప్పంద భాగస్వాములకు పరిమాణ ఆధారిత తగ్గింపును అందిస్తుంది.
******
(Release ID: 1936571)
Visitor Counter : 193