నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
పవన విద్యుత్ అమలులో అగ్ర రాష్ర్టాలుగా రాజస్తాన్, గుజరాత్, తమిళనాడు
పవన విద్యుత్ దినోత్సవం నిర్వహించుకున్న భారత్; పవన విద్యుత్ వినియోగంలో భవిష్యత్ భారత్ శక్తిని అన్వేషిస్తూ రోజంతా వేడుకలు
Posted On:
15 JUN 2023 8:15PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ నవ్య, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జూన్ 15వ తేదీన ప్రపంచ పవన విద్యుత్ దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలో నిర్వహించింది. ఈ సందర్భంగా రోజంతా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు సాధించిన విజయాన్ని వేడుగ్గా చేసుకునేందుకు, భారతదేశంలో పవన విద్యుత్ అమలు వేగాన్ని పెంచే మార్గాలు అన్వేషించడం లక్ష్యంగా పవన్-ఊర్జా : భారత భవిష్యత్ కు శక్తి అనే పేరిట ఈ కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలో పవన విద్యుత్ పురోగతి, ఆఫ్ షోర్ పవన అభివృద్ధి, దేశంలో పవన విద్యుత్ తయారీ వాతావరణం, పవన విద్యుత్ కు హరిత ఫైనాన్స్ పటిష్ఠత అనే అంశాలపై లోతుగా చర్చించారు.
2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సాధించాలన్న లక్ష్యానికి భారత ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నదని నవ్య, పునరుత్పాక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ భూపీందర్ సింగ్ బల్లా అన్నారు. పవన విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా గాలి సామర్థ్యాన్ని వినియోగించడంలో అన్ని రాష్ర్టాలు అందించిన సేవలను ఆయన కొనియాడారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో సాధించిన విజయాలకు రాజస్తాన్, గుజరాత్, తమిళనాడు రాష్ర్టాలను కార్యదర్శి అభినందించారు. గరిష్ఠ స్థాయిలో పవన విద్యుత్ ఉత్పత్తిని సాధించినందుకు రాజస్తాన్ ను, ఓపెన్ యాక్సెస్ సహా గరిష్ఠ స్థాయిలో పవన విద్యుత్ జోడించినందుకు గుజరాత్ ను, విండ్ టర్బైన్లకు విద్యుత్ ను పునరుద్ధరించినందుకు తమిళనాడును ఆయన సత్కరించారు.
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ (నివే) భూమట్టానికి 150 మీటర్ల ఎత్తులో రూపొందించిన విండ్ అట్లాస్ ను ఈ సమావేశంలో ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో భూమట్టానికి 150 కిలోమీటర్ల ఎత్తులో పవనవిద్యుత్ సామర్థ్యం 1164 గిగావాట్లున్నట్టు అంచనా.
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల అధికారులు; విండ్ టర్బైన్ల తయారీదారులు, డెవలపర్లు; అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక సంస్థలు; కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలు, మేథావులు, ఈ రంగంతో సంబంధం ఉన్న ఇతర భాగస్వాములు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ, శక్తి సస్టెయినబుల్ ఎనర్జీ ఫౌండేషన్, భారత విండ్ టర్బైన్ తయారీదారుల సంఘం, ఇండియన్ విండ్ పవర్ అసోసియేషన్, విండ్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సమన్వయంతో ఈ వేడుకలు నిర్వహించారు.
గత కొన్ని సంవత్సరాల కాలంలో పవన విద్యుత్ విభాగంలో భారతదేశం ఎన్నో అడుగులు ముందుకేసింది. ప్రపంచంలో పవన విద్యుత్ సామర్థ్యంలో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. 2030 నాటికి మొత్తం విద్యుదుత్పత్తి స్థాపక సామర్థ్యంలో 50 % శిలాజేతర ఇంధనాల ద్వారా సాధించాలన్న, 2070 నాటికి నెట్ జీరో సాధించాలన్న భారతదేశ కృషి ఫలించడంలో పవన విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశానికి అటు సముద్ర ఉపరితలం మీద, ఇటు భూ ఉపరితలం పైన గరిష్ఠంగా పవన విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి కారణంగా ప్రస్తుతం భారత్ 15 గిగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించింది. ఆత్మ నిర్భర్ లో కీలకంగా నిలిచింది.
****
(Release ID: 1933009)
Visitor Counter : 305