వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
తోలు రంగం అభివృద్ధికి నాణ్యతా ప్రమాణాలు పాటించడం అవసరం .. శ్రీ పీయూష్ గోయల్
భారతదేశ బ్రాండ్ అభివృద్ధి భారతీయ ఉత్పత్తుల విలువ పెంచడానికి నాణ్యత నిర్దేశిత ఉత్తర్వులు (క్యూసిఓ).. శ్రీ పీయూష్ గోయల్
24 ఉత్పత్తుల కోసం 1 జూలై 2023 పూర్తి స్థాయిలో నాణ్యత నిర్దేశిత ఉత్తర్వులు అమలు..శ్రీ గోయల్
నాణ్యత నిర్దేశిత ఉత్తర్వులు (క్యూసిఓ) అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన పాదరక్షల పరిశ్రమ
సర్టిఫైడ్ స్టార్టప్‌లు, చిన్న యూనిట్లు ఉత్పత్తి చేస్తున్న పాదరక్షల ఉత్పత్తులకు కోసం క్యూసిఓ క్రింద టెస్టింగ్ ఛార్జీలను 80% వరకు తగ్గించనున్న బిఐఎస్
Posted On:
14 JUN 2023 7:55PM by PIB Hyderabad
తోలు పరిశ్రమకు సంబంధించి రూపొందించిన నాణ్యత నిర్దేశిత ఉత్తర్వులు ( క్యూసిఓ ).పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత పాదరక్షల పరిశ్రమ ప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు. పరిశ్రమ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన శ్రీ గోయల్ భారతదేశ బ్రాండ్‌ను స్థాపించి, భారతీయ ఉత్పత్తుల విలువను పెంచడానికి కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న తోలు పరిశ్రమ రంగాల ప్రతినిధులు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌లను ( క్యూసిఓ) స్వాగతించారు, క్యూసిఐ అమలుకు కృషి చేస్తామని చెప్పారు.
2023 జూలై 1 నుంచి పాదరక్షల ఉత్పత్తులకు క్యూసిఓ అమలు చేస్తామని పరిశ్రమ ప్రతినిధులకు శ్రీ గోయల్ తెలిపారు. క్యూసిఓ అమలుకు సంబంధించి వివిధ అంశాలపై ఆయన చర్చలు జరిపారు 24 ఉత్పత్తులకు 2023 జూలై 1 నుంచి పూర్తి స్థాయిలో క్యూసీఓలు అమలులోకి వస్తాయని మంత్రి వివరించారు.
అయితే, ఇటీవల సవరించిన 5 ప్రమాణాల అమలుకు సంబంధించి సవరించిన ప్రమాణాలను అమలు చేయడానికి ఆరు నెలల వ్యవధి ఇస్తారు. ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఉత్పత్తిదారులు 2024 జనవరి 1 నుంచి సవరించిన ప్రమాణాలు అమలు చేయాల్సి ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు 2024 జనవరి 1 నుంచి, సూక్ష్మ తరహా పరిశ్రమలకు 2024 జూలై ఐ నుంచి ప్రమాణాలు వర్తిస్తాయి.
ప్రస్తుతం ఈ ప్రమాణాల పరిధిలోకి రాని ఉత్పత్తులకు ప్రమాణాలను రూపొందించడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తో కలిసి పని చేయాలని శ్రీ పీయూష్ గోయల్ భారతీయ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ప్రమాణాల నోటిఫికేషన్ వెలువడిన 6 నెలల తర్వాత వీటిని కూడా క్యూసిఓ పరిధిలోకి తీసుకు రావడానికి వీలవుతుంది.
సర్టిఫైడ్ స్టార్టప్‌లు, చిన్న యూనిట్లు ఉత్పత్తి చేస్తున్న పాదరక్షల ఉత్పత్తులకు కోసం క్యూసిఓ క్రింద టెస్టింగ్ ఛార్జీలను 80% వరకు బిఐఎస్ తగ్గిస్తుందని మంత్రి ప్రకటించారు.
పరిశ్రమ వర్గాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరపడానికి బిఐఎస్ వచ్చే సోమవారం అంటే జూన్ 19, 2023 నుంచి, ప్రతి పని దినంలో ఒక గంట కేటాయిస్తుందని శ్రీ గోయల్ ప్రకటించారు. దీనిని అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి బిఐఎస్ డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రమోద్ కుమార్ తివారీ కి సూచించారు. దీనికి సంబంధించి విస్తృత ప్రచారం ఇవ్వాలని ప్రశ్నలు లేదా ఫిర్యాదులను సక్రమంగా నమోదు చేసి తక్షణమే స్పందించేలా చూడాలని కోరారు.
నాణ్యతా ప్రమాణాల ఉత్తర్వులను సమర్థవంతంగా అమలు చేసి, ప్రమాణాలు సూచించిన విధంగా నాణ్యత గల పాదరక్షలను తయారు చేసి వినియోగదారులకు సరఫరా చేయాలని మంత్రి భారతీయ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. దేశ ఆర్థిక వృద్ధిని నడపడంలో నాణ్యత , వినియోగదారులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. దేశంలో నాణ్యమైన పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి , వినియోగదారుల అవసరాలను తీర్చడానికి సంబంధిత వర్గాలు కలిసి పని చేయాలని ఆయన కోరారు.
డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, ఐఎస్ డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రమోద్ కుమార్ తివారీ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అదనపు కార్యదర్శి శ్రీ రాజీవ్ సింగ్ ఠాకూర్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1932676)
Visitor Counter : 147