శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
‘ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలు’ ఇతివృత్తంగా సిఎస్‌ఐఆర్-జాతీయ భౌతికశాస్త్ర ప్రయోగశాల ఆధ్వర్యాన ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2023’ నిర్వహణ
Posted On:
05 JUN 2023 8:09PM by PIB Hyderabad
భారత శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్‌ఐర్) పరిధిలోని జాతీయ భౌతికశాస్త్ర ప్రయోగశాల (ఎన్‌పిఎల్)లో తన ప్రతిష్టాత్మక ‘జిజ్ఞాస’ కార్యక్రమం కింద 2023 జూన్ 5వ తేదీన ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2023’ (డబ్ల్యుఇడి)లో భాగంగా వేడుకలు నిర్వహించింది.
భూగోళ సంరక్షణ, పునరుద్ధరణ కృషిలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజలను ఒక వేదికపైకి తెచ్చి, స్ఫూర్తి నింపడం లక్ష్యంగా ఏటా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ప్రస్తుత ఏడాది ‘డబ్ల్యుఇడి’ 50వ వార్షికోత్సవం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి నిర్వహించే కార్యక్రమాల్లో 150కిపైగా దేశాల ప్రజలు పాల్గొంటున్నారు. ఇది పర్యావరణ కార్యాచరణ, సుస్థిర ప్రపంచ సృష్టిలో ప్రభుత్వాలు, వ్యాపారాలు, వ్యక్తులకుగల శక్తిసామర్థ్యాలకు ప్రతీకగా ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది. ఆ మేరకు 1973లో ‘డబ్ల్యుఇడి’ని ప్రారంభించింది మొదలు ఐరాస పర్యావరణ కార్యక్రమ విభాగం (యుఎన్‌ఇపి) దీనికి నేతృత్వం వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది “ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలు” ఇతివృత్తంగా కార్యక్రమాలు చేపట్టింది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘సిఎస్‌ఐర్-ఎన్‌పిఎల్’ పరిధిలోని “ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ అండ్ బయోమెడికల్ మెట్రాలజీ” విభాగం వేడుకలు నిర్వహించింది. ఈ మేరకు తన ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జిజ్ఞాస’ కింద నిర్వహించిన కార్యక్రమాల్లో శాస్త్రవేత్తలు, సిబ్బంది, పరిశోధక-పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని పలు పాఠశాలల నుంచి 100 మంది విద్యార్థులు, 12 మంది ఉపాధ్యాయులు దీనికి హాజరయ్యారు. వీరంతా ‘ది డివైన్ మదర్ ఇంటర్నేషనల్ స్కూల్’ (యుపి), ‘అలెన్ హౌస్ పబ్లిక్ స్కూల్’ (ఘజియాబాద్), ‘ఆస్టర్ పబ్లిక్ స్కూల్’ (నోయిడా-విస్తరిత యుపి), ‘షహీద్ బిషన్ సింగ్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్’ (కీర్తి నగర్, ఢిల్లీ), బల్వంతరాయ్ మెహతా విద్యా భవన్ అంగురిదేవి షేర్ సింగ్ అకాడమీ (జికె-II, ఢిల్లీ), ‘ప్రిసీడియం స్కూల్’ (ఇందిరాపురం, యుపి) తదితర పాఠశాలలకు చెందినవారు.
‘జిజ్ఞాస’ అనేది ‘సిఎస్ఐర్’ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విద్యా కార్యక్రమం. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు శాస్త్రీయ పరిశోధనలవైపు ఆసక్తిని ప్రేరేపించడం ఈ పథకం లక్ష్యం. ఇందులో భాగంగా ‘సిఎస్ఐర్-ఎన్‌పిఎల్’లో విద్యార్థులు-శాస్త్రవేత్తల మధ్య సన్నిహిత సంబంధాలకు ఈ కార్యక్రమం అగ్ర ప్రాధాన్యమిస్తుంది. విద్యార్థులలో ఉత్సుకతతో కూడిన వాతావరణాన్ని సృష్టించి, పరిశోధనాసక్తిని రగిల్చే ఉత్ప్రేరకంగా ఇది ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం కింద ప్రయోగశాల సందర్శనలు, ప్రయోగాత్మక ప్రదర్శనలు, విజ్ఞానాత్మక ఉపన్యాసాలు, ఆచరణాత్మక ప్రదర్శనలు, వేసవి ప్రాజెక్టులు, సూక్ష్మ-పరిశోధన కార్యకలాపాలు, ఉపాధ్యాయ శిక్షణ తదితరాలన్నీ పరస్పర కార్యాచరణలో భాగం చేయబడ్డాయి.
ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలను డాక్టర్ జిజీ పులిక్కోటిల్ తన స్వాగత ప్రసంగంతో ప్రారంభించారు. అనంతరం ‘సిఎస్ఐర్-ఎన్‌పిఎల్’ తాత్కాలిక డైరెక్టర్ డాక్టర్ సంజయ్ ఆర్.ధాకటే, ‘ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ అండ్ బయోమెడికల్ మెట్రాలజీ’ విభాగాధిపతి డాక్టర్ టి.కె.మండల్ ప్రసంగించారు. పర్యావరణ కాలుష్యంలోని వివిధ కోణాలను భూమాత ఎదుర్కొంటున్న విపరిణామాలను డాక్టర్ మండల్ తన ప్రసంగంలో నొక్కిచెప్పారు. కాగా, యావత్ పర్యావరణ వ్యవస్థనూ కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ కాలుష్యం గురించి డాక్టర్ ధాకటే ప్రేక్షకులకు అవగాహన కల్పించారు. డాక్టర్ సుమిత్ కుమార్ మిశ్రా వందన సమర్పణతో ప్రారంభ కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత క్విజ్, ప్రయోగశాల సందర్శనలుసహా ఆయా అంశాల్లో నిపుణులైన నలుగురు ప్రముఖులు ఆసక్తికర ఉపన్యాసాలిచ్చారు.
ఈ మేరకు తొలుత డాక్టర్ సచ్చిదానంద్ సింగ్ ప్రసంగిస్తూ- “టెక్టానిక్ ఫలకాల కదలికలు, భూ కక్ష్యలో వైవిధ్యం, అగ్నిపర్వత గర్భంలో అలజడులు వంటి అనేక సహజ కారకాలతోపాటు మానవ ప్రేరేపిత కారణాలు- భారీగా అగ్ని వినియోగం, మితిమీరిన సహజ వనరుల వాడకం ఫలితంగా ‘వాతావరణ మార్పు’ అన్నది భూగోళంపై మానవ జీవనంలో ఒక భాగమైంది” అని వివరించారు. అలాగే “ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం తర్వాత మానవ-భౌగోళిక కార్యకలాపాల విస్తృతితో హరితవాయు (జిహెచ్‌జి) ఉద్గారాల గాఢత, వాతావరణ పొరల్లో ఇటీవల ఈ వాయు సాంద్రత వేగంగా పెరగడం అత్యంత ఆందోళనకర అంశం” అని డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా 1850 తర్వాత కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి 45 శాతానికిపైగా పెరిగిందని ఆయన తెలిపారు. పర్యవసానంగా సంభవించిన పరిణామాలు ఆందోళన కలిగిస్తుండటంతోపాటు భూతాపంలో పెరుగుదల ఊహించే పరిస్థితిని దాటి వాస్తవంగా మారిపోయిందన్నారు. ప్రస్తుత తరానికి ఈ మార్పు ప్రత్యక్ష అనుభవంగా ఉందన్న సత్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఈ పరిస్థితుల నడుమ “మరింత క్షీణత నుంచి భూగోళాన్ని రక్షించే దిశగా పర్యావరణంలో ‘జిహెచ్‌జి’తోపాటు కాలుష్య పొరల ప్రస్తుత వేగాన్ని నియంత్రించడం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఏదో ఒకటి చేయడం అందరి కర్తవ్యం” అని ఉద్బోధిస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు.
డాక్టర్ మోనికా జె.కుల్‌శ్రేష్ట- “పర్యావరణ ప్రభావాలు” అంశంపై ప్రసంగిస్తూ- పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతున్న మానవ కార్యకలాపాల గురించి సంక్షిప్తంగా వివరించారు. అదేవిధంగా పర్యావరణంలో సానుకూల మార్పు దిశగా ప్రతి వ్యక్తి ఏ విధంగా కృషి చేయవచ్చునో ఆమె విద్యార్థులకు బోధించారు. అలాగే వాతావరణ రసాయన శాస్త్ర పరిశోధనల ప్రాముఖ్యాన్ని, ప్రపంచ నేపథ్యంతో పోల్చినపుడు భారతదేశ పరిస్థితులతో దానికిగల ప్రత్యక్ష ఔచిత్యాన్ని ఆమె విశదీకరించారు.
మూడో వక్త డాక్టర్ శంకర్ ప్రసంగిస్తూ- మీటర్ కొలతపై అంతర్జాతీయ ఒడంబడిక నుంచి ‘తూకాలు-కొలతల అంతర్జాతీయ సంస్థ (బిఐపిఎం) ఏర్పాటు దాకా తూకాలు-కొలతలపై జాతీయ సంస్థల నేపథ్యాలను వివరించారు. అదేవిధంగా అంతర్జాతీయ ప్రమాణాల వ్యాప్తిలో ‘ఎన్‌పిఎల్’కుగల పాత్ర గురించి తెలియజేశారు. వాయునాణ్యత కొలబద్దలు, వాటికిగల పారామితులను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ ఇతివృత్తం “ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలన”కు అనుగుణంగా తాము నిర్వహించిన పరిశోధన ఫలితాలను కూడా ఉటంకిస్తూ ఈ సందర్భంగాద గాలిలో ప్లాస్టిక్ కాలుష్య జాడలను కనుగొన్నట్లు తెలిపారు. మనం స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే నాటికి మనకు ప్లాస్టిక్ రహిత పర్యావరణం ఉండాలా-వద్దా అన్నది మనం నేడే నిర్ణయించుకోవాలని హెచ్చరించారు. ఈ బెడద నిర్మూలన కోసం సామాజిక-శాస్త్రీయ పరిష్కారాన్వేషణ ఎంతయినా అవసరమని, ఇది మనందరి సమష్టి కర్తవ్యంగా ఇవాళే ప్రతినబూనుదామని ఆయన పిలుపునిచ్చారు.
చివరగా ప్రసంగించిన డాక్టర్ రూపేష్ ఎం.దాస్- అంటార్కిటికా ప్రాముఖ్యం, అక్కడ పర్యావరణానికి సంబంధించి భారత శాస్త్రీయ పరిశోధన కార్యకలాపాల ప్రత్యేకత గురించి వివరించారు. మంచుతో కప్పబడిన ఈ ఖండంపై వాతావరణ మార్పు ప్రభావం, ఇతర ప్రాంతాలపై దాని పర్యవసానాల గురించి ఆయన విశదీకరించారు. అనంతరం క్విజ్ విజేతలను సత్కరించడంతో కార్యక్రమం సమాప్తమైంది.
*****
(Release ID: 1930145)
Visitor Counter : 210