వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మిషన్ లైఫ్ పై భారీ కార్యక్రమం
Posted On:
05 JUN 2023 6:31PM by PIB Hyderabad
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా వ్యవసాయ, రైతాంగ సంక్షేమ మంత్రిత్వ శాఖ మిషన్ లైఫ్ పై న్యూఢిల్లీలోని ఎన్ఎఎస్‌సి పూసా, డాక్టర్ సి. సుబ్రమణియం ఆడిటోరియంలో మెగా ఈవెంట్ ను నిర్వహించింది.
ఇతర ప్రముఖులతో కలిసి వ్యవసాయ, రైతాంగ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాస్ చౌధరి కార్యక్రమం జరుగుతున్న ఆవరణలో మొక్కలు నాటడంతో కార్యక్రమం ప్రారంభమైంది. వ్యవసాయ, రైతాంగ సంక్షేమవిభాగం , ఐసిఎఆర్ సిబ్బంది, ఎఫ్‌పిఓలు, ఆగ్రి స్టార్టప్‌లు, విద్యార్ధులు, శాస్త్రవేత్తలు, అధికారులు, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులతో కలిసి వ్యవసాయ, రైతాంగ సంక్షేమ విభాగం కార్యదర్శి శ్రీ మనోజ్ అహూజా, వ్యవసాయ, రైతాంగ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం, మిషన్ లైఫ్‌కు సంకేతంగా ఆచరణీయ, నిలకడైన వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహనను సృష్టించేందుకు, సహజ, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రదర్శించే ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది.
వ్యవసాయ, రైతాంగ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాస్‌నాత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, పర్యావరణకు అనుకూలమైన జీవనశైలి ప్రాముఖ్యతను పట్టి చూపుతూ, భవిష్యత్ తరాలకు వనరులను అందించేందుకు గల ముఖ్య ప్రత్యామ్నాయాలలో రసాయన రహిత వ్యవసాయం అని నొక్కి చెప్పారు. పర్యావరణ మార్పు దుష్ప్రభావాలను పరిష్కరించేందుకు వ్యవసాయంలో మిషన్ లైఫ్‌ను అనుసరించవలసిన అవసరాన్ని ఉద్ఘాటించారు. రాజస్థాన్ నుంచి ఒక ఉదాహరణను ప్రస్తావిస్తూ, గత సంవత్సరాల కంటే తరచుగా రాష్ట్రంలో రుతుపవనాల ముందు వానలు రావడాన్ని ఉదహరించారు. అకాల, భారీ వానలు రైతాంగానికి ఇబ్బంది కలిగిస్తున్నాయన్నారు. వాతావరణ మార్పుల వల్ల రైతులు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఐసిఎఆర్ 2016 తర్వాత 1750 వాతావరణ ప్రతికూలతలను తట్టుకొనే రకాలను అభివృద్ధి చేసిందని, హానికి అవకాశమున్న ప్రాంతాలలో కూడా సాధారణ దిగుబడిని ఇవ్వగల సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయని అన్నారు. వర్తుల ఆర్ధిక వ్యవస్థకు ఉత్తమమైన ఉదాహరణగా వ్యవసాయ వ్యర్ధాలను పునర్వినియోగంలోకి తేవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. వనరులను కాపాడేందుకు రోజువారీ జీవితంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్ఘాటించారు. అనంతరం, కార్యక్రమానికి హాజరైన వారందరి చేతా మిషన్ లైఫ్ ప్రతిజ్ఞను చేయించారు.
తర్వాత ప్రసంగిస్తూ, పారిశ్రామిక పూర్వ కాలం నుంచి పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలను, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై దాని ప్రత్యక్ష, అప్రత్యక్ష ప్రభావాలను గురించి వ్యవసాయ & రైతాంగ సంక్షేమ విభాం కార్యదర్శి శ్రీ మనోజ్ అహూజా సంక్షిప్తంగా వివరించారు. భూమిలోని వృక్షజాలం, జంతుజాలంపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని కలిగి ఉండే సహజమైన, సేంద్రీయ పద్ధతుల ద్వారా మట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటుగా మట్టిలో పోషకాల మెరుగైన లభ్యతను కల్పించవచ్చని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం నీటిపారుదల కోసం ఎక్కువ నీటిని వినియోగిస్తున్నందున పర్ డ్రాప్ మోర్ క్రాప్ (ఒక్క బొట్టు నీటితో మరింత పంట)ను స్వీకరించడం ద్వారా నీటి ఆదా చేయడం గురించి ఆయన ప్రస్తావించారు. సుస్థిర వ్యవసాయం పట్ల విధానాన్ని రూపొందించడంతో పాటు రోజువారీ వ్యవసాయ పద్దతుల్లో మిషన్ లైఫ్‌లోని మొత్తం 7 సూత్రాలను అనుసరించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తన ప్రారంభోపన్యాసంలో మిషన్ లైఫ్ ప్రాముఖ్యతను పట్టి చూపుతూ, సిఒపి-26 సందర్భంగా ప్రధానమంత్రి మిషన్ లైఫ్‌ను ప్రారంభించడం వెనుక నేపథ్యాన్ని వ్యవసాయ, రైతాంగ సంక్షేమ విభాగం అదనపు కార్యదర్శి శ్రీ ఫయజ్ అహ్మద్ కిద్వాయి వివరించారు. మిషన్ లైఫ్‌ను అవలంబించేందుకు గల 7 సూత్రాల వెనుక ఉన్న అంశాల వివరాలను ఆయన వెల్లడించారు. మిషన్ లైఫ్‌ను అవలంబించడంపై వివరణాత్మకమైన ప్రెజెంటేషన్‌ను సంయుక్త కార్యదర్శి శ్రీ శామ్యూల్ ప్రవీణ్ కుమార్ ఇచ్చారు. వ్యవసాయం ద్వారా పర్యావరణ సుస్థిరతను పెంపొందించడాన్ని ప్రోత్సహించడం అన్నది దేశ శ్రేయస్సుకు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఎన్ఆర్ఎం సంయుక్త కార్యదర్శి, మిషన్ లైఫ్ నోడల్ అధికారి శ్రీ ఫ్రాంక్లిన్ ఎ. ఖొబుంగ్ వందన సమర్పణతో ముగిసింది. సహజ సేద్యం చేస్తున్న ఇద్దరు విజయవంతమైన రైతులను ప్రశంసా పత్రంతో సత్కరించారు.
కార్యక్రమ ప్రారంభానంతరం, మిషన్ లైఫ్‌ను సహజ, సేంద్రీయ వ్యవసాయంతో అనుసంధానం చేయడంపై ఎన్ఆర్ఎం అదనపు కార్యదర్శి శ్రీ ఫయజ్ కిద్వాయి అధ్యక్షతన ప్యానెల్ జరిగింది. దీనిని ఐఎన్ఎం సంయుక్త కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా మోడరేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సహజ సేద్యంలో విజయ గాథలను ప్యానెలిస్ట్ శ్రీ టి. విజయ్ కుమార్ పంచుకున్నారు. మిషన్ లైఫ్ లక్ష్యాలను సాధించేందుకు సేంద్రీయ, సహజ మార్గాల ద్వారా పంటల వైవిధ్యం, పోషకాల నిర్వహణ అవసరాన్ని పద్మశ్రీ భరత్ భూషణ్ త్యాగి నొక్కి చెప్పారు. రైతాంగానికి అధిక రాబడి కోసం ఎఫ్‌పిఒలను బలోపేతం చేయాలని ఆయన పిలుపిచ్చారు. వ్యవసాయంలో వర్తుల ఆర్థిక వ్యవస్థను అవలంబించే మార్గాలు & సంభావ్యతలపై ఎం/ఎ స్ ఇన్వెస్ట్ ఇండియాకు చెందిన కశికా మల్హోత్రా వివరించారు. విజయవంతమైన ఇద్దరు రైతులు- హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన శ్రీ షలేందర్ శర్మ, గుజరాత్‌లోని భుజ్‌కు చెందిన శ్రీ లాల్ సహజ వ్యవసాయాన్ని అవలంబిస్తున్న క్రమంలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఐఎన్ఎం డివిజన్ డిప్యూటీ కార్యదర్శి రచనకు ప్యానెలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. నేటివరకూ మిషన్ లైఫ్ కింద మొత్తం 713 అవగాహన కార్యక్రమాలు, 709 యాక్షన్ ఈవెంట్లు నిర్వహించగా మొత్తం 52346 మంది పాల్గొన్నారు. ఇందులో మొత్తం 49028 మంది మిషన్‌లైఫ్ కింద ప్రతిజ్ఞ చేశారు.
***
(Release ID: 1930097)
Visitor Counter : 159