సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రత్యేక చర్యలు: శ్రీ జి. కిషన్ రెడ్డి


యువతకు అన్ని రంగాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేలా మొదటిసారిగా తెలంగాణలో కౌశల్ మహోత్సవ్: శ్రీ జి. కిషన్ రెడ్డి

ఈ కార్యక్రమానికి 24 రంగాలకు చెందిన 200 కు పైగా సంస్థలు హాజరవుతాయని అంచనా

నాడు పోస్టు చేయడమైనది: 26 MAY 2023 3:59PM by PIB Hyderabad

భారత యువతకు ఇంటిదగ్గరే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర పర్యాటక, సంస్కృతి, ఈశాన్యప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు సికింద్రాబాద్ లోని జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలో జరిగిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. యువతకు అన్ని రంగాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేలా మొదటిసారిగా తెలంగాణలో కౌశల్  మహోత్సవ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

 

జూన్ 3-4 తేదీలలో సికింద్రాబాద్ లో కౌశల మహోత్సవ్ మేళా జరుగుతుందని, ఇందులో వివిధ రంగాలకు చెందిన  200 కు పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. వాటులో ఫార్మా సూటికల్, బాంకింగ్, మాన్యుఫాక్చరింగ్, ఐటీ, ఆస్పత్రుల వారు ఉంటారు. ఈ మేళాలో దాదాపు 40 వేల ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. సెక్యూరిటీ విభాగంలో ఇప్పటికే ఒప్పందాలు జరిగాయని మంత్రి ఉదాహరించారు. ఈశాన్య ప్రాంత యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తారు.

ఈ ప్రత్యేక మేళాలో ఉపాధి లభించని యువతకు మరింత శిక్షణ ఇచ్చి తగిన ఉద్యోగావకాశాలు కల్పిస్తామని శ్రీ కిషన్ రెడ్డి చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను కౌశల మహోత్సవ్ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.

 

జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ దక్షిణ ప్రాంతీయాధిపతి శ్రీమతి పునీత పుష్యరాగం మాట్లాడుతూ, జాతీయ సంస్థ అయిన జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థలో కౌశల్ మహోత్సవ్ ఒక భాగమని చెప్పారు. నైపుణ్యమున్న వారికి స్వదేశంలోనూ, విదేశాలలోనూ ఉద్యోగావకాశాలు కల్పించటానికి ఇదొక వేదిక అన్నారు. ఇప్పుడు జరిపే మేళాలో 200 కు పైగా సంస్థలు, 15,000 మందికి పైగా ఉద్యోగార్థులు వస్తారని అంచనావేస్తున్నట్టు చెప్పారు.

 

నైపుణ్యాభివృద్ధి, వ్యాపారదక్షత మంత్రిత్వశాఖ ఈ నియామకాల ప్రక్రియ నిర్వహిస్తుండగా జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తూ ఉపాధి, అప్రెంటిస్ షిప్ అవకాశాలను స్థానిక తెలంగాణ యువత ముందు ఉంచుతూ వివిధ రంగాలలో సాధికారతకు కృషి చేస్తోంది. నిపుణ అనే ప్రభుత్వేతర సంస్థ, అనేల ప్రభుత్వ విభాగాలు కూడా ఉమ్మడిగా ఇందులో పాల్గొంటున్నాయి. నిపుణులైన ఉద్యోగార్థులను, స్వదేశీ, విదేశీ సంస్థలను ఒకే వేదిక మీదికి తీసుకు వచ్చి అక్కడికక్కడే ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావటం ఈ కార్యక్రమ లక్ష్యం. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

 

ఈ రెండు రోజుల ప్రతిపాదిత కౌశల్  మహోత్సవ్  లో యువతకు  కౌన్సిలింగ్, ఉచిత పరీక్షలు, మోటివేషన్ తరగతులు, ఉద్యోగావకాశాలకు సంబంధించిన సలహాలతో  అనేక కార్యక్రమాలు జరుగుతాయి.  ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 28 న జరిగే ముందస్తు పరీక్షలకు హాజరు కావలసి ఉంటుంది, వారు ఇంటర్వ్యూ ప్రక్రియ ముగించుకొని అక్కడికక్కడే ఉద్యోగ లేఖలు అందుకోవచ్చు.  కౌశల్ మహోత్సవ్ లో పాల్గొన దలచిన అభ్యర్థులు ఈ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలి:   https://kaushalmahotsav.nsdcdigital.org/    అందులో  ఆహార, వ్యవసాయ, ఆటోమోటివ్, సౌరశక్తి తదితర రంగాల వారీగా  ఉన్న ఉద్యోగావకాశాలను ఎంచుకోవాలి.

 

ఈ మెగా రిక్రూట్ మెంట్ లో 24 రంగాలకు చెందిన 450 విభాగాలలో  ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. మహీంద్రా అండ్ మహీంద్రా, పార్లే ఆగ్రో, ఐసీఐసీఐ, జాన్సన్ లిఫ్ట్స్, సోడెక్సో లాంటి సంస్థలు  పాల్గొంటున్నాయి.  పాల్గొనేవారి కోసం దాదాపు 40 వేల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఎంబీఏలు, ఐటిఐలు, డిప్లొమా హోల్డర్లు, గ్రాడ్యుయేట్లు, ఇంటర్, టెన్త్ పాసైన వారు కూడా హాజరవుతారు. అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాలవారై ఉండాలి. పీఎంకేకే, పిఎంకేవివై, అప్రెంటిస్, అనేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ పథకాల కింద శిక్షణ పొందినవారు హాజరుకావచ్చు.

 

నైపుణ్యాభివృద్ధి, వ్యాపార దక్షత మంత్రిత్వశాఖ వారి ప్రధాన కార్యక్రమమైన కౌశల్ మహోత్సవ్ పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలను ప్రోత్సహించే చొరవ. నైపుణ్య భారత్ లక్ష్యాలను వేగంగా, నాణ్యమైన ప్రమాణాలతో సాధించే ప్రక్రియ ఇది.  రాష్ట్రంలో తరచూ క్రమంగా జరిపే కార్యక్రమాలలో ఒకటి. ఉద్యోగాలు ఇచ్చేవాళ్లను, తీసుకునేవాళ్లను ఒకే వేదికమీదికి తీసుకురావటం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచటం దీని లక్ష్యం.

 

జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ గురించి:

దేశంలో నైపుణ్య పర్యావరణాన్ని నిర్మించే ప్రధాన సంస్థ జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ. భారత ప్రభుత్వపు నైపుణ్యాభివృద్ధి, వ్యాపార దక్షత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తుంది. ప్రైవేట్ రంగాన్ని కూడా  భాగస్వామిగా చేసి, వారి అవసరాలకు తగిన శిక్షణ ఇచ్చి అక్కడే ఉద్యోగవకాశాలు కూడా కల్పించాలనే ధ్యేయంతో ఎన్ ఎస్ డీ సీ ఏర్పాటైంది.  దీని ద్వారా వృత్తినైపుణ్య శిక్షణ ఇచ్చి దేశ యువతను సాధికారం చేస్తారు.  వ్యాపార సంస్థలకు, అంకుర సంస్థలకు కంపెనీలకు ఎన్ ఎస్ డి  సి అండగా ఉంటూ నిపుణులైన సిబ్బందిని అందిస్తుంది. ప్రైవేట్ సంస్థలకు నిధులు సమకూర్చి వారే శిక్షణ ఇచ్చి ఉద్యోగాలివ్వటాన్ని కూడా ప్రోత్సాహిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 1927528) సందర్శకుల సూచీ సంఖ్య : : 316
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English