ఆయుష్
azadi ka amrit mahotsav

సమగ్ర ఆరోగ్య పరిశోధన ప్రోత్సాహం, సహకారం కోసం అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఐసిఎంఆర్


ఆయుష్ వైద్య విధానం శాస్త్రీయత నిర్ధారించడానికి ఒప్పందం సహకరిస్తుంది.. శ్రీ సర్బానంద సోనోవాల్

రెండు వైద్య వ్యవస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల వైద్య విజ్ఞానానికి సముచిత స్థానం లభిస్తుంది- డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

Posted On: 11 MAY 2023 4:21PM by PIB Hyderabad

సమగ్ర ఆరోగ్య పరిశోధన ప్రోత్సాహం, సహకారం కోసం కలిసి పనిచేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్),ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించాయి. దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఐసిఎంఆర్ సంతకాలు చేశాయి. ఆధునిక శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి  శాస్త్రీయత రుజువు చేయడానికి సహకరించే అంశాలపై పరిశోధనలను ప్రోత్సహించి ,ఆరోగ్య సంరక్షణలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఐసిఎంఆర్ దృష్టి సారిస్తాయి  ఆయుష్ పరిశోధకులకు  శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశోధన సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి కూడా ఒప్పందం సహకరిస్తుంది.  

అవగాహన ఒప్పందంపై ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా , కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి ,ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ సంతకం చేశారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ మరియు ఓడరేవులు, నౌకా రవాణా ,జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్,  కేంద్ర ఆరోగ్య  కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ,కేంద్ర ఆరోగ్య  కుటుంబ సంక్షేమ సహాయ శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కే. పాల్, కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ పి.కె. పాఠక్‌తో పాటు రెండు మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ “ఆధునిక, సంప్రదాయ వైద్య విధానాలను కలిపి ఉపయోగించి ప్రజలకు సమగ్ర ఆరోగ్య రక్షణ అందించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించారు. ప్రధానమంత్రి ఆకాంక్ష కార్యరూపం దాల్చేలా ఈరోజు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్),ఆయుష్ మంత్రిత్వ శాఖల మధ్య కుదిరిన అవగాహన సహకరిస్తుంది' అని అన్నారు.

శాస్త్రీయత అంశంలో భారతదేశ సంప్రదాయ వైద్య విధానాలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయి అని  శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు. సమగ్ర వైద్య విధానంపై జరిగే పరిశోధనల వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. భారతదేశ సంప్రదాయ వైద్య విధానాలు గుర్తింపు, ప్రాచుర్యం పొందుతాయన్నారు. 

' ఆయుర్వేదం వారసత్వ సంపదగా ఉంది. ఆధునిక వైద్య విధానం తనకంటూ ఒక ప్రత్యేక స్థానం పొందింది. రెండు వైద్య విధానాలను మేళవించి అందించే వైద్యం వైద్య విజ్ఞానానికి  సముచిత స్థానం కల్పిస్తుంది. రెండు సంస్థల మధ్య కుదిరిన అవగాహన వల్ల ఆయుర్వేద వైద్య విధానానికి శాస్త్రీయత లభిస్తుంది. ఆయుష్ వైద్య విధానం ప్రాధాన్యత కూడా ఒప్పందం వల్ల పెరుగుతుంది' అని  డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. 

నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కే. పాల్ మాట్లాడుతూ రెండు సంస్థల మధ్య కుదిరిన అవగాహన వల్ల శాస్త్రీయ ఆధారిత వైద్య విధానాలకు ప్రాముఖ్యత పెరుగుతుందన్నారు. ఎయిమ్స్ లో ఆయుష్ శాఖలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం  సేవా శాఖలుగా పనిచేస్తున్న ఆయుష్ శాఖలు ప్రధాన వైద్య విధానంలో భాగంగా మారుతాయన్నారు. 

ఒప్పందంలో భాగంగా  దేశంలో ఉన్న అన్ని ఎయిమ్స్ కేంద్రాల్లో  సమగ్ర ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆధునిక పరిశోధనలు చేపట్టడానికి అవసరమైన నిధులు సమకూరుస్తారు. ప్రజా ఆరోగ్యం రంగంలో పరిశోధనలు చేపట్టి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన వ్యాధుల నివారణ కోసం రెండు సంస్థలు ఆధునిక పరిశోధనలు చేపట్టి ఆయుష్ వైద్య విధానం ద్వారా వీటికి చికిత్స అందించడానికి అవకాశం ఉందని రుజువు చేసే దేశంలో పరిశోధనలు చేపడతాయి. 

 మానవులపై పరిశోధనలు చేపట్టడానికి అవసరమైన  బయోమెడికల్, ఆరోగ్య  నైతిక మార్గదర్శకాలు రూపొందించే అంశాన్ని కూడా సమగ్ర వైద్య విధానంపై చేపట్టే పరిశోధనల్లో భాగంగా   చేర్చే అవకాశాన్ని ఈ ఎంఓయూ కల్పిస్తుంది. కలిసి పనిచేయడానికి అవకాశం ఉన్న మరిన్ని రంగాలను గుర్తించడం, కలిసి పని చేయడం, ఉమ్మడి పరిశోధన ప్రాజెక్ట్‌లు/కార్యక్రమాలను రూపొందించడం, అమలు చేయడం  ఉమ్మడి పర్యవేక్షణను అనుమతించడం కోసం త్రైమాసికానికి ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయడానికి రెండు సంస్థలు  అంగీకరించాయి.
ఆయుష్ పరిశోధకుల కోసం  పరిశోధన సౌకర్యాలు పెంపొందించడం అవగాహన ఒప్పందం లో  ముఖ్యమైన అంశంగా ఉంటుంది. దీని ప్రకారం పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడం, శిక్షణ ప్రణాళిక అభివృద్ధి, పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపడతారు. సమగ్ర, సమీకృత ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆసక్తి ఉన్న పరిశోధకుల క్రియాశీల భాగస్వామ్యంతో  ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు  ఐసిఎంఆర్  సంయుక్తంగా సమావేశాలు/వర్క్‌షాప్‌లు/సెమినార్‌లను రూపొందించి, నిర్వహిస్తాయి.

ఆయుష్ మంత్రిత్వ శాఖ , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించడానికి అమలు చేయాల్సిన చర్యలు చర్చిండానికి  కేంద్ర ఆయుష్ , ఓడరేవులు,నౌకా రవాణా, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్,కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సంయుక్త  అధ్యక్షతన ఐదవ అంతర్-మంత్రిత్వ  సమావేశం కూడా ఈరోజు జరిగింది.  ఈ సమావేశంలో అవగాహన,   సహకారానికి సంబంధించిన అంశాలపై మంత్రులు చర్చించారు.  రెండు మంత్రిత్వ శాఖలు అనేక ముఖ్యమైన విషయాలపై  రెండు మంత్రిత్వ శాఖలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.  

 

***


(Release ID: 1923659) Visitor Counter : 170


Read this release in: English , Urdu , Hindi