రైల్వే మంత్రిత్వ శాఖ

2022-23 లో అక్రమంగా మనుష్యులను తరలిస్తున్న 207 మంది అక్రమ వ్యాపారులను అరెస్ట్ చేసి 604 మందిని రక్షించిన ఆర్‌పిఎఫ్


ప్లాట్‌ఫారమ్‌లు, రైల్వే ట్రాక్, రైళ్లలో 873 మంది పురుషులు, 543 మంది మహిళా ప్రయాణికుల ప్రాణాలు రక్షించిన ఆర్‌పిఎఫ్

'ఆపరేషన్ మాతృశక్తి' కింద రైలులో 158 మంది మహిళలు, రైల్వే ప్రాంగణంలో 220 మంది మహిళలకు ప్రసవ సమయంలో సహాయం చేసిన ఆర్‌పిఎఫ్

డబ్లుఐఎల్ఈపి కింద 108 కేసులు నమోదు చేసి 68 మంది నిందితులను అరెస్ట్ చేసిన ఆర్‌పిఎఫ్
మానవ అక్రమ రవాణా కార్యకలాపాల నిరోధం కోసం 740కంటే ఎక్కువ ప్రదేశాలలో పనిచేస్తున్న ఆర్‌పిఎఫ్ బృందాలు
4280 మంది మధ్యదళారులను అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకున్న ఆర్‌పిఎఫ్

Posted On: 26 APR 2023 3:01PM by PIB Hyderabad

రైల్వే ప్రయాణికులు, ప్రయాణీకుల ప్రాంతం, రైల్వే ఆస్తుల రక్షణ కోసం భారతీయ రైల్వే కి చెందిన  రైల్వే రక్షక దళం  (ఆర్‌పిఎఫ్ ) నిరంతరం కృషి చేస్తోంది.  రైల్వే ఆస్తులు, ప్రయాణీకుల ప్రాంతం  ప్రయాణికుల భద్రత బాధ్యత ఆర్‌పిఎఫ్ స్వీకరించింది. తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ప్రయాణీకులకు సురక్షితమైన ప్రయాణం అందించి, రైల్వే ఆస్తుల రక్షణ కోసం ప్రతి రోజూ 24 గంటలు నిర్విరామంగా ఆర్‌పిఎఫ్ పనిచేస్తోంది. ప్రయాణికులకు ప్రయాణ సమయంలో భద్రత, రవాణా అవుతున్న సరుకులకు రక్షణ కల్పించడానికి రైల్వేలకు  ఆర్‌పిఎఫ్ సహకారం అందిస్తోంది. నేరం జరగకుండా చూడడానికి చర్యలు తీసుకుంటున్న  ఆర్‌పిఎఫ్, నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ దేశవ్యాప్తంగా ఉన్న విలువైన రైల్వే ఆస్తులకు రక్షణ కల్పిస్తూ తన బాధ్యతను సమర్ధంగా, పటిష్టంగా ఆర్‌పిఎఫ్ నిర్వర్తిస్తోంది. 

2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌పిఎఫ్ సాధించిన విజయాలు:

* పిల్లలకు రక్షణ-  నాన్హే ఫారిస్టే

ఆపదలో ఉన్న పిల్లలను కాపాడి, రక్షించడానికి కేంద్ర మహిళ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు రూపొందించింది. 05/03/2015 న మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలతో మార్పులు, చేర్పులు చేసి సవరించిన  మార్గదర్శకాలను 23.12.2021న విడుదల చేశారు. సవరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుతం 143 రైల్వే స్టేషన్లలో పిల్లల సంరక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వివిధ కారణాల వల్ల కుటుంబం నుంచి విడిపోయిన/ కోల్పోయిన పిల్లలను తిరిగి కుటుంబాలకు అప్పగించడంలో ఆర్‌పిఎఫ్ కీలక పాత్ర పోషిస్తోంది. 2022 - 2023 ఆర్థిక సంవత్సరంలో సంరక్షణ ,రక్షణ అవసరమైన 17000 కంటే ఎక్కువ మంది పిల్లలు  భారతీయ రైల్వే ను ఆశ్రయించారు. వీరికి ఆర్‌పిఎఫ్ అండగా నిలిచి తగిన సహకారం అందించింది. 

రైళ్లు/రైల్వే స్టేషన్‌లలో సంరక్షణ, రక్షణ అవసరమైన పిల్లలను గుర్తించి రక్షించడానికి భారతీయ రైల్వే శాఖ  ‘నాన్హే ఫారిస్టే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆపదలో ఉన్న పిల్లలను కాపాడి వారికి అండగా నిలవాలన్న    లక్ష్యంతో ప్రారంభమైన కార్యక్రమం  ఫలితాలను చూపుతోంది.

*మానవ అక్రమ రవాణా నిరోధం- ఆపరేషన్ ఏఏహెచ్టీ  

మానవ అక్రమ రవాణాను నివారించడానికి రైల్వే శాఖ కఠిన చర్యలు అమలు చేస్తోంది. మానవ అక్రమ రవాణా జరగకుండా చూడడానికి 2022 లో మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. దీనికి అనుగుణంగా పోలీసుస్టేషన్ స్థాయిలో  ఆర్‌పిఎఫ్ దేశం వివిధ ప్రాంతాలలో 740 యూనిట్లు ఏర్పాటు చేసింది. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న సంస్థలు/ వ్యక్తులను గుర్తించి మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి పనిచేస్తున్న సంస్థల సహకారంతో ఆర్‌పిఎఫ్ అక్రమ రవాణా కార్యకలాపాలను అణచి వేయడానికి చర్యలు అమలు చేస్తున్నది.  

2022-23 ఆర్థిక సంవత్సరంలో అక్రమ వ్యాపారుల నుంచి ఆర్‌పిఎఫ్ 604 మందిని రక్షించింది. అక్రమ రవాణాకు పాల్పడుతున్న 207 మందిని ఆర్‌పిఎఫ్ అరెస్టు  చేసింది. మానవ అక్రమ రవాణా కార్యక్రలాపాలను గుర్తించి నిరోధించడానికి 06.05.2022న అసోసియేషన్ ఆఫ్ వాలంటరీ యాక్షన్ (నోబెల్ గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి ఫౌండేషన్)తో  ఆర్‌పిఎఫ్ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం కింద మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్నిఆర్‌పిఎఫ్ కు   అసోసియేషన్ ఆఫ్ వాలంటరీ యాక్షన్ సమాచారం అందించడంతో పాటు మానవ వనరుల అభివృద్ధికి సహకారం అందిస్తుంది. దీనికోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 12.6 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 

*  అత్యవసర ప్రతిస్పందన- ఆపరేషన్ ‘యాత్రి సురక్ష’ 

భద్రత కోసం,  తక్షణ సహాయం కోసం  ప్రయాణీకులు రైల్ మదద్ పోర్టల్‌లో లేదా హెల్ప్‌లైన్ నంబర్. 139 (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టం నెంబర్ 112తో అనుసంధానించబడి) ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుల తక్షణ పరిష్కారం కోసం ఆర్‌పిఎఫ్ చర్యలు అమలు చేస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2.4 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయి. వీటి పరిష్కారానికి తగిన చర్యలు అమలు జరిగాయి. ప్రయాణీకుల భద్రతను మెరుగుపరచడానికి, భద్రతా సమస్యలను పరిష్కరించడానికి రైల్వేలు ట్విట్టర్, ఫేస్‌బుక్, కూ మొదలైన వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. 

* ఆపరేషన్ “జీవన్ రక్ష”: -

ఆర్‌పిఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి సకాలంలో వేగంగా స్పందించి 2022 - 2023 ఆర్థిక సంవత్సరంలో  ఆపరేషన్ జీవన్‌రక్ష కింద ప్లాట్‌ఫారమ్‌లు, రైల్వే ట్రాక్ , రైళ్లలో 873 మంది పురుషులు, 543 మంది మహిళా ప్రయాణికుల ప్రాణాలు రక్షించారు. 

*లగేజ్ రిట్రీవల్ ,- ఆపరేషన్ అమానత్

 2022 - 2023 ఆర్థిక సంవత్సరంలో  32,337 మంది ప్రయాణికులకు చెందిన రూ. 50 కోట్ల కంటే ఎక్కువ విలువైన లగేజీని  ఆర్‌పిఎఫ్ స్వాధీనం చేసుకుంది.  నిర్ణీత ధృవీకరణ తర్వాత వాటిని యజమానులకు తిరిగి ఇచ్చింది.  "ఆపరేషన్ అమానత్" కింద ప్రయాణీకులకు ఆర్‌పిఎఫ్ ఈ సేవను అందిస్తోంది. 

* మహిళలకు భద్రత- ఆపరేషన్ మాతృశక్తి 

మహిళా ప్రయాణీకుల భద్రతకు రైల్వే శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రైళ్లలో మహిళలకు రక్షణ కల్పించడానికి 17.10.2020న 'మేరీ సహేలి' కార్యక్రమం ప్రారంభమైంది. దూర ప్రాంత రైళ్లలో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహళలకు రక్షణ కల్పించడానికి 'మేరీ సహేలి' కార్యక్రమం ప్రారంభమైంది. మహిళా   ప్రయాణికులకు  భద్రత కల్పించడానికి అనేక చర్యలు అమలు జరుగుతున్నాయి. ట్రైన్ లో ఎస్కార్ట్ సౌకర్యం కల్పించడం తో పాటు 864 రైల్వే స్టేషన్లు,6646 కోచ్ లలో  సిసీటీవీ సౌకర్యం కల్పించడం, మహిళలు ప్రయాణిస్తున్న అనుమతి లేకుండా ప్రయాణిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లాంటి చర్యలు అమలు జరుగుతున్నాయి. 

ఆర్‌పిఎఫ్ లో పనిచేస్తున్న మొత్తం సిబ్బందిలో మహిళల శాతం 9 వరకు ఉంది. మహిళా ప్రయాణికుల భద్రత కల్పించడానికి ఆర్‌పిఎఫ్ మహిళా సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణ సమయంలో పురిటి నొప్పులు వచ్చిన మహిళలకు సిబ్బంది సహాయం అందిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 'ఆపరేషన్ మాతృశక్తి' కింద రైలులో 158 మంది మహిళలు, రైల్వే ప్రాంగణంలో 220 మంది మహిళలకు ప్రసవ సమయంలో ఆర్‌పిఎఫ్ సహాయం అందించింది. 

* మధ్య దళారీల నివారణ కోసం “ఉప్లబ్ద్ అమలు 

 2022 – 2023 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌పిఎఫ్ 4280 మంది మధ్య దళారీలను అరెస్టు చేసింది.  చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకున్నారు.

మధ్య దళారీల బెడద నివారించడానికి ఆర్‌పిఎఫ్  బృందాలు నిరంతరం చర్యలు అమలు చేస్తున్నాయి. మధ్యదళారీలను నివారించడానికి చేప్పట్టిన కార్యక్రమంలో భాగంగా చట్ట వ్యతిరేకంగా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేసి విక్రయించిన, వినియోగించిన దాదాపు  140 మందిని ఆర్‌పిఎఫ్ అరెస్టు చేసింది. 

*  ఆపరేషన్ “రైల్ సురక్ష”

రైల్వే ఆస్తులు కాపాడేందుకు, రైల్వే ఆస్తికి సంబంధించిన కేసుల్లో  భాగంగా ఆర్‌పిఎఫ్  9179 మంది వ్యక్తులపై చర్యలు తీసుకుంది.  చోరీకి గురైన 6.3 కోట్ల రూపాయలు విలువ చేసే   రైల్వే ఆస్తిని ఆర్‌పిఎఫ్ తిరిగి స్వాధీనం చేసుకుంది. 

*  ఆపరేషన్ “నార్కోస్” :- 

మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి కేంద్ర  ప్రభుత్వం ఎక్స్‌ట్రార్డినరీ గెజిట్ ఆఫ్ ఇండియా S.Oలో  11.04.2019 న ప్రచురించిన  నోటిఫికేషన్ నెం.1403 ద్వారా. 1582(E) నార్కోటిక్స్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద కేసులు నమోదు , పరిశోధన,  స్వాధీనం చేసుకోవడానికి, అరెస్టు చేయడానికి  ఆర్‌పిఎఫ్ లో   అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు అంతకంటే ఎక్కువ స్థాయి అధికారులకు అధికారం ఇచ్చింది. 2022 - 2023 ఆర్థిక సంవత్సరంలో  1022 మంది వ్యక్తులను అరెస్టు చేసిన ఆర్‌పిఎఫ్  81 కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకుంది. నేరస్థులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం సాధికారత గల ఏజెన్సీలకు అప్పగించారు.

*  ఆపరేషన్ డబ్లుఐఎల్ఈపి   :- 

వన్యప్రాణులు మరియు జంతువుల భాగాలు అక్రమంగా రవాణా చేయడం ప్రకృతికి వ్యతిరేకంగా జరిగే నేరం. ఈ అంశాన్ని గుర్తించిన  ఆర్‌పిఎఫ్  వన్యప్రాణుల అక్రమ వ్యాపారంలో పాల్గొన్న స్మగ్లర్లపై కఠినమైన చర్యలు తీసుకుంది,  పక్షులు, పాములు, తాబేలు, నెమలి, సరీసృపాలు మొదలైన నిషేదిత వన్య ప్రాణులు,  ప్రాసెస్ చేసిన  ఉత్పత్తులతో పాటు గంధపు చెక్క ఇతర వృక్షజాలం, జంతుజాలం లను ఆర్‌పిఎఫ్ స్వాధీనం చేసుకుంది.

ఆర్‌పిఎఫ్ బృందాలు 108 కేసులను నమోదు చేశాయి.  2022-2023 ఆర్థిక సంవత్సరంలో  ఆపరేషన్ డబ్లుఐఎల్ఈపి    కింద 68 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

***

 



(Release ID: 1920286) Visitor Counter : 125


Read this release in: Tamil , English , Urdu , Hindi