వ్యవసాయ మంత్రిత్వ శాఖ
అగ్రికల్చరల్ రీసెర్చ్ – నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 19వ స్నాతకోత్సవంలో పాల్గొన్న భారత రాష్ట్రపతి
Posted On:
24 APR 2023 4:20PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి, శ్రీమతి ద్రౌపది ముర్ము ఈరోజు (ఏప్రిల్ 24, 2023) హర్యానాలోని కర్నాల్‌లో గల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ - నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐసీఏఆర్-ఎన్డీఆర్ఐ) 19వ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. మన దేశ ఆహార, పౌష్టికాహార భద్రతకు భరోసా కల్పించడంలో పాడి పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. డెయిరీ రంగం దేశ జీడీపీకి 5 శాతం వాటాను అందిస్తోందని తెలిపారు. భారతదేశంలోని సుమారు 8 కోట్ల కుటుంబాలకు ఈ రంగం జీవనోపాధిని అందిస్తుందని వివరించారు. అందువల్ల, దేశ సమగ్రాభివృద్ధిలో ఎన్‌డీఆర్‌ఐ వంటి సంస్థలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. ఆవులు మరియు ఇతర పశువులు భారతీయ సమాజం, సంప్రదాయాలలో అంతర్భాగమని రాష్ట్రపతి అన్నారు. అధిక పాలను ఇచ్చే గేదెలు మరియు ఆవుల క్లోన్‌లను ఉత్పత్తి చేసే సాంకేతికతను ఎన్‌డీఆర్‌ఐ అభివృద్ధి చేసిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇది పశువుల పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని, రైతుల ఆదాయాన్ని పెంచుతుందని ఆమె అన్నారు. భారతీయ ఆహారం మరియు సంస్కృతిలో పాలు మరియు పాల ఉత్పత్తులు ఎల్లప్పుడూ అంతర్భాగమని రాష్ట్రపతి అన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే దేశం భారతదేశం అని అన్నారు. కానీ, పాల ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌తో సవాళ్లను ఎదుర్కొంటున్నామని తెలిపారు. దీంతో పాటు నాణ్యమైన పశుగ్రాసం లభించడం, వాతావరణ మార్పుల పశువులకు వచ్చే వ్యాధులు వంటి సవాళ్లను కూడా డెయిరీ రంగం ఎదుర్కొంటోందని అన్నారు. పాల ఉత్పత్తి, పాడిపరిశ్రమలను నిలకడగా మార్చడం మన ముందున్న సవాలు అని అన్నారు. జంతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యావరణ అనుకూలమైన మరియు వాతావరణ-స్మార్ట్ టెక్నాలజీలను అవలంబించడం ద్వారా పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడం మనందరి బాధ్యత అని తెలిపారు. డైరీ ఫామ్‌ల నుండి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు ఎన్‌డీఆర్‌ఐ వివిధ సాంకేతికతలను ప్రోత్సహిస్తోందని గుర్తించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. దీనితో పాటు, బయోగ్యాస్ ఉత్పత్తి వంటి క్లీన్ ఎనర్జీపై కూడా ఎన్డీఆర్ఐ ఉద్ఘాటిస్తోంది. భారతదేశంలో పాడి పరిశ్రమ నిర్వహణలో మహిళలు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి అన్నారు. మహిళలను స్వావలంబన చేయడంలో ఈ రంగం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల విద్య, శిక్షణ, నైపుణ్యాభివృద్ధిలో వారికి మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డెయిరీ రంగంలో వెంచర్లను నెలకొల్పేందుకు మహిళలకు సులభమైన రుణాలు మరియు మార్కెట్ యాక్సెస్ కూడా కల్పించాలని అభిలషించారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని వీక్షించేందుకు దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి -
(Release ID: 1919390)
Visitor Counter : 103