వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
లండన్ లోని అంతర్జాతీయ ఆహార, పానీయాల ప్రదర్శనలో పాల్గొన్న అపెడా
అపెడా పెవిలియన్ లో సందర్శకులను ఆకర్షిస్తున్నచిరుధాన్యాల (శ్రీ అన్న) ఆధారిత ఉత్పత్తులు
వర్తమాన ఆర్థిక సంవత్సరంలో యుకెకు గతంలో ఎగుమతి లక్ష్యాన్ని అధిగమించనున్న అపెడా
Posted On:
23 MAR 2023 6:04PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహణలోని వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (అపెడా) లండన్ లో జరిగిన అంతర్జాతీయ ఆహార, పానీయాల ప్రదర్శనలో పాల్గొంది. లండన్ లోని అంతర్జాతీయ మార్కెట్ లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహానికి ఉద్దేశించిన ఈ మూడు రోజుల ప్రదర్శన మార్చి 22వ తేదీన ముగిసింది. ఐఎఫ్ఇ ప్రదర్శనలో భారత ఎగుమతిదారులు వైవిధ్యభరితమైన తమ ఉత్పత్తులు ప్రదర్శించేందుకు అపెడా వీలు కల్పించింది. అపెడా పెవిలియన్ లో ప్రదర్శించిన 50 చిరుధాన్యాల (శ్రీ అన్న) ఆధారిత ఉత్పత్తుల పట్ల భారీ సంఖ్యలో వినియోగదారులు అమిత ఆసక్తి కనబరిచారు. ఐఎఫ్ఇ 2023 ప్రదర్శనలో అత్యుత్తమ నాణ్యత గల జిఐ-టాగ్ వేసిన అల్ఫాన్సో మామిడి, ద్రాక్ష నుంచి తయారుచేసిన వైన్ ను, చిరుధాన్యాలతో చేసిన విలువ ఆధారిత ఉత్పత్తులను కూడా అపెడా ప్రదర్శించి పంపిణీ చేసింది.
భారతదేశం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 నిర్వహించుకుంటున్న నేపథ్యంలో విదేశీ భూభాగాల్లో ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రపంచ ఆహార ప్రదర్శనల్లో పాల్గొంటూ అపెడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజన్ కు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చిరుధాన్యాల (శ్రీ అన్న) ప్రోత్సాహానికి క్రియాశీలంగా చర్యలు తీసుకుంటోంది.
ఐఎఫ్ఇలో భారతదేశ భాగస్వామ్యంపై అపెడా చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు మాట్లాడుతూ ‘‘క్వారంటైన్ సడలింపులు, దిగుమతి ప్రయోజనాలు వంటివి కల్పించి మార్కెట్ ను మరింతగా తెరవడం ద్వారా మరింత ఆచరణాత్మకంగా వ్యవహరించి భారీ మార్కెట్ ను సృష్టించవచ్చు’’ అన్నారు. ‘‘భారీ పరిమాణంలో భారతీయ ఉత్పత్తుల ఎగుమతులకు మార్గం సుగమం చేయడంతో పాటు భారతీయ ఉత్పత్తుల ధరలు తగ్గించడానికి సహాయపడే రీతిలో భారత-యుకె ఎఫ్ టిఏపై చర్చలు జరిపేందుకు పునాది స్థాయిలో పనులు జరుగుతున్నాయి’’ అని కూడా ఆయన అన్నారు. ఈ విషయంలో లండన్ లోని భారత హై కమిషన్ కూడా చాలా మద్దతు అందిస్తోందని, ఉభయదేశాల మధ్య వాణిజ్య బంధం మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు.
యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన ప్రతిష్ఠాత్మక ఆహార ప్రోత్సాహక కార్యక్రమాల్లో అంతర్జాతీయ ఆహార, పానీయాల ప్రదర్శన (ఐఎఫ్ ఇ) ఒకటి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 25,000 మంది భాగస్వాములు తమ శాంపిల్ ఉత్పత్తులతో ముఖాముఖి వచ్చారు. అదే విధంగా కొత్త ఎగుమతి అవకాశాలు అన్వేషించేందుకు బి2బి సమావేశాలు నిర్వహించారు. యునైటెడ్ కింగ్ డమ్ లో బ్రాండ్ చైతన్యం కల్పించేందుకు, కొత్త అవకాశాలు కల్పించేందుకు మంచి వేదిక ఐఎఫ్ఇ. తాజా పళ్లు, కూరగాయలు, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తులు, భారతీయ బియ్యం రకాలు సహా పలు రకాల భారతీయ ఆహార ఉత్పత్తులకు యుకె పెద్ద మార్కెట్.
యుకె సహా ప్రపంచవ్యాప్తంగా 250 దేశాలకు అపెడా నాణ్యమైన ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. 2021-22లో 2500 కోట్ల డాలర్ల విలువ గల అపెడా ఉత్పత్తుల ఎగుమతి లక్ష్యాన్ని భారతదేశం సాధించింది. అపెడా ఎగుమతుల్లో గత రికార్డులన్నింటినీ అధిగమించింది. భారత వ్యవసాయ ఉత్పత్తులకు అత్యంత ఆదరణీయ గమ్యం యునైటెడ్ కింగ్ డమ్. 2021-22 సంవత్సరంలో 421 మిలియన్ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులు అపెడా ఎగుమతి చేయగలిగింది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో గత ఎగుమతి లక్ష్యాలన్నింటినీ అధిగమించేందుకు అపెడా సిద్ధంగా ఉంది. 2022 ఏప్రిల్-డిసెంబరు నెలల మధ్య కాలంలో 302 మిలియన్ డాలర్ల విలువ గల ఎగుమతులు నిర్వహించింది.
యునైటెడ్ కింగ్ డమ్ సహా విభిన్న దేశాలకు ఎగుమతి చేస్తున్న ప్రధాన ఆహార ఉత్పత్తుల్లో బాస్మతి బియ్యం, గొడ్డు మాంసం, బాస్మతి ఇతర బియ్యం, కాయధాన్యాలు, జొన్న, వేరుశనగ, గోధుమ, చిరుధాన్యాల ఉత్పత్తులు, ప్రాసెస్డ్ కూరగాయలు, తాజా పళ్లు, కూరగాయలు, ఆల్కహాలిక్ పానీయాలు, తృణధాన్యాలు ఉన్నాయి. 13000 ఎంటి భారతీయ ద్రాక్ష, 4000 ఎంటి మామిడిపళ్లు, 5000 ఎంటి ఉల్లి, 2500 ఎంటి చిరుధాన్యాలు, 1310 మిలియన్ ఎంటి బాస్మతి బియ్యం యుకెకు భారతదేశం ఎగుమతి చేసింది.
భారత చిరుధాన్యాల ఎగుమతులను పెంచడం, ఉత్పత్తిదారులకు మార్కెట్ అనుసంధానత కల్పించడం లక్ష్యంగా అపెడా ఇటీవల ప్రపంచ చిరుధాన్యాల (శ్రీ అన్న) సదస్సుల న్యూఢిల్లీలో నిర్వహించింది. 100 మంది భారతీయ ఎగ్జిబిటర్లు; అమెరికా, యుఏఇ, కువైట్, జర్మనీ, వియత్నాం, జపాన్, కెన్యా, మలావి, భూటాన్, ఇటలీ, మలేసియా దేశాలకు చెందిన 100 మంది కొనుగోలుదారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
చిరుధాన్యాలతో తయారుచేసిన విలువ ఆధారిత ఉత్పత్తుల వినియోగం పెంచడం కోసం అపెడా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మిలెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్), హైదరాబాద్; వివిధ రాష్ర్టాల వ్యవసాయ విశ్వవిద్యాలయాల సహకారంతో 200 స్టార్టప్ లను ఇంక్యుబేట్ చేసింది.
***
(Release ID: 1911503)
Visitor Counter : 164