పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఢిల్లీ-ధర్మశాల-ఢిల్లీ మధ్య ఇండిగో ప్రవేశపెట్టిన మొదటి విమాన సర్వీసును ప్రారంభించిన కేంద్ర మంత్రులు శ్రీ అనురాగ్ ఠాకూర్, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి జనరల్ వి.కె.సింగ్
ఇండిగో సర్వీస్ వల్ల సగం మంది రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం. దేశం అన్ని ప్రాంతాల నుంచి సర్వీసులు ప్రారంభం కావాలి ..శ్రీ అనురాగ్ రాకూర్
రానున్న 3 నుంచి 4 సంవత్సరాల కాలంలో 200 విమానాశ్రయాలు,వాటర్ డ్రోమ్స్, హెలీ పోర్టులకు సేవలు అందించాలని లక్ష్యంగా పని చేస్తున్నాం .. శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
ఎయిర్ బస్ a 320 విమానాలు దిగే విధంగా రెండు దశల్లో ధర్మశాల విమానాశ్రయం అభివృద్ధి.. సింధియా
Posted On:
26 MAR 2023 11:25AM by PIB Hyderabad
ఢిల్లీ-ధర్మశాల-ఢిల్లీ మధ్య ఇండిగో ప్రవేశపెట్టిన విమాన సర్వీసును కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ ఈరోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్‌కు ఇండిగో సేవలు ప్రారంభించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. కొండ ప్రాంతంలో ఉన్న రాష్ట్రానికి విమాన సర్వీసు ప్రారంభించి ఇండిగో జాతీయ విమానయాన సంస్థగా మారిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద విమానాశ్రయం అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారతదేశం నలుమూలల నుంచి హిమాచల్‌కు వస్తున్న ప్రయాణీకులు ముందు ఢిల్లీకి వెళ్లి అక్కడ నుంచి రాష్ట్రానికి కనెక్టింగ్ ఫ్లైట్‌లు ద్వారా రావాల్సి వస్తుందని మంత్రి అన్నారు. ఒక పెద్ద విమానాశ్రయం ఏర్పాటైతే ప్రయాణీకులకు నేరుగా రాష్ట్రానికి రావడానికి వీలవుతుందన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమలు చేస్తున్న చర్యల వల్ల దేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని శ్రీ ఠాకూర్ అన్నారు. అతి కొద్ది కాలంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 140 కి మించి పెరిగిందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఉదాన్ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు విమానంలో ప్రయాణించే అవకాశం కలిగిందన్నారు.
ధర్మశాల విమానాశ్రయం ప్రాధాన్యతను శ్రీ ఠాకూర్ వివరించారు. అయిదు జిల్లాలకు చెందిన ప్రజలు సులువుగా ధర్మశాల చేరుకొని విమానంలో ప్రయాణించవచ్చు అని శ్రీ ఠాకూర్ పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రంలో రాష్ట్ర జనాభాలో సగం మంది ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.ఇండిగో సంస్థ ప్రారంభించిన విమాన సర్వీసు రాష్ట్రంలోని సగం ప్రాంతాలను, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలకు దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేస్తుందన్నారు. కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వి.కె.సింగ్ మాట్లాడుతూ 1990 లో ధర్మశాల నుంచి విమాన సేవలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ధర్మశాల నుంచి విమాన సర్వీసులు ఎక్కువ అవుతున్నాయని ప్రస్తుతం ధర్మశాల విమనాశ్రయంలో అందుబాటులో ఉన్న 1376 మీటర్ల పొడవైన రన్ వే ను స్థలం లభిస్తే మరింత విస్తరించడానికి అవకాశం ఉందని జనరల్ వి.కె.సింగ్ పేర్కొన్నారు. దలై లామా ఉన్న ప్రాంతంలో ఉన్న విమానాశ్రయంలో ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. వాయవ్య హిమాచల్ లో ఉన్న అన్ని ప్రాంతాలకు ధర్మశాల విమానాశ్రయం సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇండిగో సేవలు అందుబాటులోకి రావడం వల్ల రాష్ట్రానికి వస్తున్నా పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ దేశంలో పౌర విమానయాన రంగంలో గత 65 ఏళ్లలో సాధించని అభివృద్ధిని గత 9 ఏళ్ల కాలంలో సాధించిందన్నారు. గత 9 ఏళ్ల కాలంలో దేశంలో 148 కి పైగా విమానాశ్రయాలు,వాటర్ డ్రోమ్స్, హెలీ పోర్టులు ఏర్పాటు అయ్యాయని మంత్రి తెలిపారు. రానున్న 3 నుంచి 4 సంవత్సరాల కాలంలో వీటి సంఖ్య ని 200 కు మించి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకుని పని చేస్తున్నామని శ్రీ సింధియా వివరించారు. విస్తరణలో పెద్ద మెట్రో విమానాశ్రయాల తో సహా మారుమూల ప్రాంతాల్లో ఉన్న విమానాశ్రయాలకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు.
రాష్ట్రంలో క్రీడా సౌకర్యాల అభివృద్ధికి శ్రీ ఠాకూర్ చేస్తున్న కృషిని శ్రీ సింధియా అభినందించారు. శ్రీ ఠాకూర్ చేసిన కృషి వల్ల ధర్మశాల జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ కేంద్రంగా గుర్తింపు పొందిందన్నారు. ప్రపంచంలో ఉన్న ఉత్తమ క్రికెట్ స్టేడియంలలో ఒకటిగా ధర్మశాల స్టేడియం గుర్తింపు పొందిందన్నారు. శ్రీ అనురాగ్ ఠాకూర్ చేస్తున్న కృషి వల్ల రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయని శ్రీ సింధియా పేర్కొన్నారు.
ధర్మశాల విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలన్న శ్రీ అనురాగ్ ఠాకూర్ చేసిన అభ్యర్థనను మంత్రి అంగీకరించారు ధర్మశాల విస్తరణపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందించిందని శ్రీ సింధియా తెలిపారు. రెండు దశల్లో విస్తరణ పనులు చేపడతామన్నారు.. మొదటి దశలో లోడ్ పెనాల్టీతో పనిచేసే టర్బో ప్రాప్ విమానాలు దిగడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న రన్‌వేని 1900 మీటర్లకు పొడిగిస్తామన్నారు. 2వ దశలో బోయింగ్ 737 , ఎయిర్‌బస్ a320లను విమానాశ్రయంలో దిగడానికి అనువుగా రన్‌వేని 3110 మీటర్లకు విస్తరిస్తారు.
రాష్ట్రంలో తమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను శ్రీ సింధియా వివరించారు. సిమ్లా విమానాశ్రయంలో రన్‌వే పునరుద్ధరణ పూర్తయిందని, మండి వద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో పౌర విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని మంత్రి అన్నారు.
“పౌర విమానయాన రంగం అభివృద్ధి పదం లో ఉంది. ఇదివరకు కేవలం విమానాలు ఎగరడం మాత్రమే చూడగలిగే వారు ఈరోజు అందులో ఎగురుతున్నారు” అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం వల్ల 1 కోటి 15 లక్షల మంది విమాన సేవలు ఉపయోగించుకున్నారని శ్రీ సింధియా అన్నారు.
ఉడాన్ పథకం కింద హిమాచల్ రాష్ట్రానికి 44 మార్గాలు కేటాయించారు. వాటిలో 22 ఇప్పటికే పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలు వివరించిన శ్రీ సింధియా 2013-14లో వారానికి 40 విమానాలు రాకపోకలు సాగించేవని తెలిపిన మంత్రి ప్రస్తుత్తం వీటి సంఖ్య 110 పెరిగిందని అన్నారు. 9 సంవత్సరాల కాలంలో 175% వృద్ధి రేటు సాధించామన్నారు. ధర్మశాల నుంచి 2013-14 లో వారానికి 28 విమానాల రాకపోకలు జరిగాయి. గడిచిన 9 ఏళ్లలో 110% వృద్ధి సాధించి నేడు ధర్మశాల నుంచి 50 విమానాల రాకపోకలు జరుగుతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా పార్లమెంటు సభ్యుడు శ్రీ కిషన్ కపూర్ మాట్లాడుతూ ఇండిగో విమానం వల్ల రాష్ట్ర ప్రజలకు విమాన సౌకర్యం మరింతగా అందుబాటులోకి వచ్చిందని అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. ధర్మశాల విమానాశ్రయాన్ని వస్తున్న విమానాల సంఖ్య పెరిగేలా చూడడానికి రన్ వే విస్తరించే అంశాన్ని పరిశీలించాలని శ్రీ కపూర్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు.
ఇండిగో ఎయిర్‌లైన్ ఢిల్లీ నుండి ధర్మశాలకు రోజువారీ విమానాలను నడుపుతుంది. ఈ కొత్త సర్వీసుతో ఇండిగో ప్రతిరోజూ నడుపుతున్న విమానాల సంఖ్య 1795 కి చేరుకుంది. ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా ఇండిగో గుర్తింపు పొందింది.
***
(Release ID: 1910952)
Visitor Counter : 171