సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

జాతీయ ఆధునిక చిత్రకళ ప్రదర్శనశాల.. న్యూఢిల్లీలోని శ్రీలంక హై-కమిషన్ల సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 17న ‘జెఫ్రీ బావా: ఇటీజ్ ఎసెన్షియల్’ పేరిట ప్రదర్శన ప్రారంభం

Posted On: 16 MAR 2023 5:07PM by PIB Hyderabad

   జాతీయ ఆధునిక చిత్రకళ ప్రదర్శనశాల, న్యూఢిల్లీలోని శ్రీలంక హై-కమిషన్‌ సంయుక్తంగా కొలంబోలోని జెఫ్రీ బావా ట్రస్‌ సహకారంతో మార్చి 17న ‘జెఫ్రీ బావా: ఇటీజ్ ఎసెన్షియల్’ పేరిట చిత్రకళా ప్రదర్శనను ప్రారంభించనున్నాయి. ఈ ప్రదర్శన 2023 మార్చి 17 నుంచి  మే 7వ తేదీ దాకా కొనసాగనుండగా సోమవారం మినహా రోజూ ఉదయం 11:00 నుంచి సాయంత్రం 6:30 గంటలదాకా సందర్శకులను అనుమతిస్తారు.

   శ్రీలంక వాస్తు నిపుణుడు జెఫ్రీ బావా స్వీయానుభవ సహిత కళాఖండాల నుంచి సేకరించిన చిత్రాలతో ఈ తొలి కీలక ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. భారత-శ్రీలంక దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం నేపథ్యంలో రెండు దేశాల మధ్య సాంస్కృతిక ఆదానప్రదాన కార్యక్రమంలో భాగంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఆలోచనలు, రేఖాచిత్రాలు, భవనాలు, ప్రదేశాలు వగైరాలతో సంబంధమున్న చిత్రాలు ఇక్కడ ప్రదర్శించబడతాయి. ఈ సందర్భంగా బావా తన వాస్తు నిపుణుడి వృత్తిలో చిత్రాలను ఏ విధంగా అన్వయింపజేశారో సందర్శకులు అన్వేషించవచ్చు. ఈ మేరకు బావా భాండాగారం నుంచి 120కిపైగా చిత్రాలను ప్రదర్శిస్తారు. ఇందులో తన పర్యటనల సమయంలో ఆయన స్వయంగా తీసిన ఫొటోలతోపాటు నిర్మాణ రూపం దాల్చని వాస్తు డిజైన్ల విభాగం కూడా ఉంటుంది. ఈ ప్రదర్శన తొలుత శ్రీలంకలోని కొలంబో నగరంలో 2022 ఫిబ్రవరి-ఏప్రిల్‌ నెలల మధ్యన నిర్వహించారు.

   బావా నైపుణ్యాన్ని ప్రతిబింబించే ప్రదర్శనలు శ్రీలంక, యునైటెడ్ కింగ్‌డమ్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, బ్రెజిల్, సింగపూర్, జర్మనీ దేశాల్లోని పలు వేదికలపై నిర్వహించబడ్డాయి. అయితే, ప్రస్తుతం న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నది భాండాగారంపై దృష్టి సారించిన తొలి ప్రదర్శన. అంతేకాకుండా ఆయన నైపుణ్యానికి సంబంధించి 2004 నుంచి అంతర్జాతీయంగా సాగిన ప్రదర్శనలపై తొలి పునశ్చరణ ప్రదర్శన. కాగా, జెఫ్రీ బావా ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన నిర్వహణలో భాగస్వామిగా కోహ్లర్‌ ఇండియా ఆర్థిక మద్దతు అందిస్తోంది. ప్రదర్శన సంబంధిత కార్యక్రమాలపై అదనపు సమాచారం, ప్రివ్యూలు, ప్రకటనలను bawaexhibition.com తోపాటు ngmaindia.gov.inలో చూడవచ్చు.

*****



(Release ID: 1907819) Visitor Counter : 128


Read this release in: English , Urdu , Hindi , Punjabi