రైల్వే మంత్రిత్వ శాఖ
భారతీయ రైల్వేలకు 2030కల్లానికరశూన్య కర్బన ఉద్గార స్థాయి
Posted On:
15 MAR 2023 5:56PM by PIB Hyderabad
భారతీయ రైల్వేలు 2030 నాటికల్లా నికరశూన్య కర్బన ఉద్గార స్థాయికి చేరడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ దిశగా కర్బన ఉద్గారాల తగ్గింపునకు అనేక కార్యక్రమాలు చేపట్టాయి. ఈ మేరకు ఇంధన పొదుపు సాంకేతికతల వినియోగం వైపు మళ్లాలని, తదనుగుణంగా పునరుత్పత్తి సామర్థ్యంతో త్రీ ఫేజ్ విద్యుత్ ఇంజన్ల తయారీ, ‘హెడ్ ఆన్ జనరేషన్’ (ఇంజన్‌తోపాటు రైలులో అవసరాలన్నిటికీ విద్యుత్ సరఫరా) సాంకేతికత వినియోగం, భవనాలతోపాటు బోగీలలో ‘ఎల్‌ఇడి'’లైట్ల వాడకం, అత్యుత్తమ నాణ్యతగల పరికరాల వాడకం, అటవీకరణ వంటి చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా నికరశూన్య కర్బన ఉద్గార లక్ష్యసాధనకు తగిన కీలక వ్యూహాలు కూడా సిద్ధం చేసుకుంటుంది. ఇందులో పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పాదన; డీజిల్ నుంచి విద్యుత్ వినియోగం వైపు మళ్లడం; ఇంధన పొదుపు చర్యలకు ప్రోత్సాహం వంటివి ఉన్నాయి.
భారతీయ రైల్వేల్లో 2029-30నాటికి ఇంధన డిమాండ్ 8,200 మెగావాట్లుగా ఉంటుందని అంచనా. ఇక నికరశూన్య కర్బన ఉద్గార స్థాయి సాధన దిశగా 2029-30 నాటికి పునరుత్పాదక సామర్థ్యం 30,000 మెగావాట్లుగా ఉంటుందని అంచనా. కాగా, 2023 ఫిబ్రవరి నాటికి, దాదాపు 147 మెగావాట్ల సౌరశక్తి (పైకప్పుల మీద, భూమిపైన) ప్లాంట్ల ఏర్పాటు, దాదాపు 103 మెగావాట్ల సామర్థ్యంగల పవన విద్యుత్ ప్లాంట్లు ప్రారంభించబడ్డాయి. మరోవైపు దాదాపు 2150 మెగావాట్ల పునరుత్పాదక సామర్థ్యాన్ని కూడా జోడించారు. అంతేకాకుండా భవిష్యత్ ఇంధన అవసరాల కోసం వివిధ కొనుగోలు విధానాల ద్వారా క్రమంగా విద్యుత్ సమీకరణను పెంచాలని భారతీయ రైల్వేలు నిర్ణయించాయి.
రైల్వే, కమ్యూనికేషన్స్-ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం వెల్లడించారు.
*****
(Release ID: 1907433)
Visitor Counter : 156