రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

జన్ ఔషధి దివస్ ఐదో రోజున జన్ ఆరోగ్య మేళాలు, హెరిటేజ్ వాక్‌లు నిర్వహణ


జన్ ఔషధి ఆరోగ్య మేళాల ద్వారా 10,000 మందికి పైగా ప్రజలకు ప్రత్యక్ష లబ్ది

Posted On: 05 MAR 2023 7:16PM by PIB Hyderabad

2023 జనవరి ఔషధి దివస్‌లో ఐదో రోజున దేశవ్యాప్తంగా ‘జన్ ఔషధి -జన్ ఆరోగ్య మేళాలు’ (ఆరోగ్య శిబిరాలు), హెరిటేజ్ వాక్‌లు (హెల్త్ వాక్ విరాసత్ కే సాథ్) నిర్వహించారు.

దేశంలోని 34 ప్రాంతాల్లో భారీ స్థాయి ఆరోగ్య శిబిరాలు, 1000 జన్ ఔషధి కేంద్రాల్లో చిన్న స్థాయి ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. వైద్యుల సలహాలు, ఆరోగ్య పరీక్షలు, ఆహార సంబంధిత సంప్రదింపులను ఈ శిబిరాల ద్వారా ప్రజలకు ఉచితంగా అందించారు. జన్ ఔషధి మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన కింద నిర్వహించిన ఆరోగ్య మేళాల ద్వారా 10,000 మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందారు.

జన్ ఔషధి గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి దేశంలోని 10 ప్రధాన చారిత్రక ప్రదేశాల్లో పాన్-ఇండియా స్థాయిలో హెరిటేజ్ వాక్‌లు (హెల్త్ వాక్ విరాసత్ కే సాథ్) కూడా నిర్వహించారు. “జన్ ఔషధి విరాసత్ కే సాథ్, హెల్త్ హెరిటేజ్ వాక్” అంశంతో నడక కార్యక్రమాలు నిర్వహించారు. దిల్లీ, జైపూర్, మైసూర్‌ సహా 10 నగరాల్లో జరిగిన ఈ హెరిటేజ్ వాక్‌ల్లో 500 మందికి పైగా పాల్గొన్నారు.

కేంద్ర ఔషధ విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ రజనీష్ తింగల్, సీనియర్ ప్రభుత్వ అధికారులు కలిసి న్యూదిల్లీలోని సుందర్ నర్సరీలో జరిగిన హెరిటేజ్ వాక్‌లో పాల్గొన్నారు. జన్ ఔషధి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ఈ నడక ఉద్దేశం.

2023 మార్చి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వివిధ నగరాల్లో వివిధ కార్యక్రమాలను కేంద్ర ఔషధ విభాగం ఏర్పాటు చేసింది. జన్ ఔషధి పథకం గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ఈ కార్యక్రమాలు దృష్టి పెడతాయి. సదస్సులు, పిల్లలు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల కోసం కార్యక్రమాలు, హెరిటేజ్ వాక్‌లు, ఆరోగ్య శిబిరాలు సహా చాలా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/యూటీల్లో నిర్వహిస్తున్నారు. పీఎంబీజేకేల యజమానులు, లబ్ధిదార్లు, రాష్ట్ర/యూటీ అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, నర్సులు, ఫార్మసిస్ట్‌లు, జన్ ఔషధి మిత్రలు పాల్గొనేలా వివిధ ప్రదేశాల్లో వీటిని నిర్వహిస్తున్నారు.

దేశంలోని మూలమూలకూ తక్కువ ధరకు మందులను అందుబాటులోకి తీసుకొచ్చేలా ఈ పథకం మార్గం సుగమం చేస్తుంది. ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాల (పీఎంబీజేకే) సంఖ్యను 2023 డిసెంబర్ చివరి నాటికి 10,000కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటి ద్వారా 1759 రకాల మందులు, 280 శస్త్రచికిత్స పరికరాలు లభ్యమవుతున్నాయి. ప్రోటీన్ పౌడర్, మాల్ట్ ఆధారిత ఆహార పదార్థాలు, ప్రోటీన్ బార్‌లు, ఇమ్యూనిటీ బార్‌లు, శానిటైజర్‌లు, మాస్క్‌లు, గ్లూకోమీటర్లు, ఆక్సిమీటర్లు మొదలైన కొత్త ఔషధాలు, ఉత్పత్తులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

***



(Release ID: 1904488) Visitor Counter : 160


Read this release in: English , Urdu , Hindi , Marathi