వ్యవసాయ మంత్రిత్వ శాఖ

డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రసంగించిన కేంద్ర వ్యవసాయ మంత్రి


సైనికుడిలా మన రైతుల స్ఫూర్తి కూడా చాలా ఉన్నతమైనది - శ్రీ తోమర్

రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులతో ఆహార భద్రతకు ఆదర్శప్రాయమైన సహకారం అందిస్తున్నారు

Posted On: 28 FEB 2023 6:57PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ..మన రైతుల స్ఫూర్తి భారత సైనికుల వంటిదేనని సైనికులు సరిహద్దుల్లో ధైర్యంగా నిలబడి దేశాన్ని రక్షించే విధంగా మన రైతు సోదర సోదరీమణులు  వ్యవసాయ ఉత్పత్తులతో ఆహార భద్రతకు ఆదర్శప్రాయమైన సహకారం అందిస్తున్నారని చెప్పారు. రైతులు పొలాల్లో పని చేయకపోతే డబ్బున్నప్పటికీ కడుపు నింపుకోవడానికి తిండి గింజలు దొరకవని చెప్పారు. 140 కోట్ల మంది భారతీయులకు మన వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైనదని రైతులను గౌరవంగా చూడాలని చెప్పారు.డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ (పూసా, సమస్తిపూర్, బీహార్) మూడవ స్నాతకోత్సవ వేడుకలో ఈ రోజు ముఖ్య అతిథిగా శ్రీ తోమర్ పాల్గొని ప్రసంగించారు.
 

image.png


దేశంలో వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ రంగానికి ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి శ్రీ తోమర్ అన్నారు. "2014కు ముందు వరకు వ్యవసాయ రంగానికి 25,000 కోట్ల రూపాయల బడ్జెట్‌ ఉంటే..నేడు మోదీ ప్రభుత్వంలో వ్యవసాయ బడ్జెట్‌ రూ. 1,25,000 కోట్లు. వ్యవసాయ అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కృషి చేస్తున్నారు. దేశంలోని 86 శాతం చిన్న రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు అవసరమైన కృషి జరుగుతోంది.కేంద్ర ప్రభుత్వం కొత్తగా 10,000 ఎఫ్‌పిఓలను ఏర్పాటు చేస్తోంది. వీటి కోసం రూ.6,865 కోట్లు ఖర్చు చేస్తోంది. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున విద్యావంతులైన యువతకు గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి; గ్రామాల్లో ఉపాధి పెరుగుదలతో వ్యవసాయ రంగం దేశానికి పెద్ద స్తంభంగా నిలుస్తుంది. వ్యవసాయ రంగం సవాళ్లతో కూడుకున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొంటూ ప్రభుత్వం సానుకూలతతో ముందుకు సాగుతోంది" అని  శ్రీ తోమర్ అన్నారు. రైతుల నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయబడింది. ఇందులో రైతుల రూ. 25,000 కోట్ల ప్రీమియం చెల్లిస్తే రూ. 1.30లక్షల కోట్లు క్లెయిమ్‌లుగా చెల్లించారు. చిన్న రైతులకు ఆదాయ మద్దతు కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అమలు చేయబడింది, ఇందులో పూర్తి పారదర్శకతతో 3 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలలో రూ. 6,000  నేరుగా పంపిణీ చేయబడుతోంది. ఇప్పటి వరకు కోట్లాది రైతులకు రూ.2.40 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పారు.

రైతుల కఠోర శ్రమ, శాస్త్రవేత్తల దక్షత, ప్రధాన మంత్రి శ్రీ మోదీ దార్శనిక విధానాల వల్ల భారతదేశం నేడు ప్రపంచానికి సరఫరా చేసే దేశంగా మారిందని శ్రీ తోమర్ అన్నారు. ప్రధాని సమర్థ నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు సాగుతున్న దృఢ సంకల్పం, సాంకేతికత, సానుకూల ఆలోచనలను చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోందన్నారు. అవసరమైనప్పుడు భారతదేశం సహాయం చేస్తుందనే అంచనాతో ప్రపంచంలోని 100 కంటే ఎక్కువ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి.మనం ఈ సవాలును స్వీకరించి పని చేయాలి. దేశ  అవసరాలను తీర్చడం మన బాధ్యత. ప్రపంచం యొక్క అంచనాలను దృష్టిలో ఉంచుకుని, 2050 సంవత్సరపు అవసరాలకు మనం ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. కొత్త తరాన్ని సంప్రదాయ వ్యవసాయం వైపు ఆకర్షింపజేయాలంటే సకాలంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పంటల వైవిధ్యం, కొత్త పద్ధతులు అవలంబించాలి. నేడు, నగదు రహిత లావాదేవీలతో సహా వివిధ రంగాలలో భారతదేశం సాధించిన విజయాలతో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది. వ్యవసాయోత్పత్తుల ఉత్పత్తిలోనూ ముందున్నాం. పశుసంవర్ధక, మత్స్య & తేనెటీగల పెంపకంలో కూడా మనకు ప్రముఖ పాత్ర ఉందని శ్రీ తోమర్ తెలిపారు.

ఆర్థిక విశ్లేషణల విషయానికి వస్తే కొన్ని దేశాలు మనల్ని పొగిడేందుకు ఇష్టపడవని కానీ రాబోయే కాలంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనుందని శ్రీ తోమర్  అన్నారు. రాబోయే 25 ఏళ్లు ‘అమృతకాల్’ సమయంలో మన వేగం మరింత వేగంగా ఉండాలి. ప్రపంచ రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి శతాబ్ది ఉత్సవాలు జరుపుకునేటప్పుడు అభివృద్ధి చెందిన దేశాల కేటగిరీలో చేర్చే విధంగా మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇందుకోసం గ్రామాలు, రైతులను బలోపేతం చేయాలన్నారు.

కాన్వొకేషన్ సందర్భంగా 260 మంది బాలికలతో సహా 635 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఫిషరీస్ కళాశాల విద్యార్థిని శ్రీమతి పూర్వా శరణ్ అత్యధిక మార్కులు సాధించినందుకు గాను విజిటర్స్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ధోలిలోని తిర్హట్ వ్యవసాయ కళాశాలకు చెందిన శ్రీమతి రింటో నందికి ఛాన్సలర్ గోల్డ్ మెడల్ లభించింది. పిప్రకోఠి పిటి.దీనదయాళ్ ఉపాధ్యాయ ఫారెస్ట్రీ కళాశాలకు చెందిన శ్రీమతి మనీషా భరద్వాజ్, శ్రీమతి నికిత వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల, శ్రీమతి జయంతి కుమారి హ్యుమానిటీస్ కళాశాల మరియు కమ్యూనిటీ సైన్స్ కళాశాలకు చెందిన శ్రీ కె.ఎం.వీథికి గోల్డ్ మెడల్ లభించింది.

 

image.png



ఇటీవల పేటెంట్‌ పొందిన ‘మష్రూమ్ సమోసా’ను ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ వారు విడుదల చేశారు. అధునాతన రకాల చెరకు, వివిధ సాంకేతిక పుస్తకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ తోమర్ కృషి విజ్ఞాన కేంద్రం, సుఖేత్ (మధుబని), నర్కటియాగంజ్ (పశ్చిమ చంపారన్), లాడా (సమస్తిపూర్), తుర్కీ (ముజఫర్‌పూర్),తిరంగా పార్క్ సముదాయం, గోరౌల్‌లోని అరటి పరిశోధనా కేంద్రం (వైశాలి) పరిపాలనా భవనం మరియు రైతుల వసతి గృహాన్ని మరియు విశ్వవిద్యాలయ  విశాలమైన వ్యవసాయ మ్యూజియంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి, వైశాలి ఎంపీ శ్రీమతి  వీణాదేవి, ముజఫర్‌పూర్ ఎంపీ శ్రీ అజయ్ నిషాద్, సమస్తిపూర్ ఎంపీ శ్రీ ప్రిన్స్ రాజ్, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, ఛాన్సలర్ శ్రీ ప్రఫుల్ల మిశ్రా, వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి.ఎస్. పాండే ఇతర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

image.png

 

****



(Release ID: 1903293) Visitor Counter : 498


Read this release in: English , Urdu , Hindi