రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

డిఆర్‌డిఓ లో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహణ


జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఉపన్యాసాలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించిన డిఆర్‌డిఓ

Posted On: 28 FEB 2023 8:03PM by PIB Hyderabad

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ( డిఆర్‌డిఓ  ) 2023 ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సంస్థ తన  ప్రయోగశాలలు, కేంద్రాల్లో  ఉపన్యాసాలు, ప్రసంగాలు, ఓపెన్ హౌస్ కార్యకలాపాలు నిర్వహించింది. న్యూ ఢిల్లీలోని  డి.ఆర్.డి.ఓ  భవన్‌లో డిఫెన్స్ సైన్స్ ఫోరమ్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. రక్షణ శాఖ  పరిశోధన,అభివృద్ధి కార్యదర్శి, డిఆర్‌డిఓ   చైర్మన్  డాక్టర్ సమీర్ వి కామత్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. దిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ ) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రంగన్‌ బెనర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారుడు డాక్టర్‌ జి సతీష్‌ రెడ్డి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

 'గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్-బీయింగ్' ఇతివృత్తంతో ఈ ఏడాది జాతీయ సైన్స్ దినోత్సవం జరిగింది. .సైన్స్ దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన డాక్టర్ సమీర్ వి కామత్  నాణ్యమైన ఉత్పత్తులు/ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని కోరారు.    

సమావేశంలో ప్రసంగించిన రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారుడు డాక్టర్‌ జి సతీష్‌ రెడ్డి  మొదటి-రకం ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి శాస్త్రీయ పరిశోధన చాలా అవసరమని పేర్కొన్నారు. నూతన  అత్యాధునిక సాంకేతికతలు, వ్యవస్థలు  అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.

శాస్త్ర-ఇంజినీరింగ్ రంగంలో  అంతర్జాతీయ సహకారాలు - ఐఐటీ ఢిల్లీ దృక్పధం ' అనే అంశం పై  ప్రొఫెసర్‌ రంగన్‌ బెనర్జీ  మాట్లాడారు. మానవాళి సంక్షేమం కోసం అవసరమైన పరిష్కారాలు కనుగొనేందుకు శాస్త్రీయ పరిశోధన రంగంలో ప్రపంచ సహకారం అవసరమని  ఆయన తెలియజేశారు. ఆలోచనలు కార్యరూపం దాల్చేలా చేయడానికి అవసరమైన  సమ్మేళనాలను గుర్తించి, దీనికి అవసరమైన ప్రణాళిక రూపొందించాలన్నారు.   డిఆర్‌డిఓ, ఢిల్లీ ఐఐటీ కలిసి సాగించిన అనేక ఉమ్మడి కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని ఆయన తెలిపారు.  కీలకమైన వ్యూహాత్మక రంగాల పరిశోధనా కార్యక్రమాల్లో  డిఆర్‌డిఓ కీలక పాత్ర పోషించి, స్ఫూర్తి నింపే విధంగా    పనిచేయాలని ఆయన అన్నారు. 

వివిధ  డిఆర్‌డిఓ పరిశోధనాశాలలు, కేంద్రాల నుంచి శాస్త్రవేత్తలు 39 పాత్రలను సమర్పించారు.  వాటిలో మూడు పత్రాలను జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా డిఆర్‌డిఓ నిర్వహించిన కార్యక్రమంలో చర్చిండానికి ఎంపిక చేశారు.   ప్రదర్శన కోసం ఎంపిక చేయబడ్డాయి. శ్రీ హరి సింగ్ ,(సైంటిస్ట్ ఎఫ్  హైదరాబాద్),  శ్రీ లక్ష్మణ్ మవానీ ( బెంగళూరు  సైంటిస్ట్ ఈ),  శ్రీ కుమార్ వ్యోంకేశ్ మణి (ఢిల్లీ-  సైంటిస్ట్ ఈ)  రక్షణ పరిశోధన రంగంలో వారి సంబంధిత రంగాలపై ప్రదర్శనలను అందించారు.

ఉత్తమ పత్రాలు సమర్పించిన వారికి డాక్టర్ బెనర్జీ  మెడల్,సర్టిఫికేట్‌ను ప్రదానం చేశారు. 2023 జాతీయ దినోత్సవం సందర్భంగా  డిఆర్‌డిఓ పరిశోధనాశాలలు, కేంద్రాల నుంచి అన్ని పత్రాలను సంకలనంగా సమకూర్చి రూపొందించిన   'సైన్స్ స్పెక్ట్రమ్' ను  ఈ సందర్భంగా విడుదల చేశారు. 

 1928లో సర్ చంద్రశేఖర వెంకట రామన్‌చే  'రామన్ ఎఫెక్ట్' ను కనుగొన్నారు. దీనికి గుర్తింపుగా 1930లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.  జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.  శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవడం , సైన్స్ కు మరింత  ప్రజాదరణ లభించేలా   వినూత్న కార్యకలాపాలను నిర్వహించి,   శాస్త్రీయ పరిశోధన సంస్కృతిని అభివృద్ధి చేయడం లక్ష్యంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 

డిఫెన్స్ సైన్స్ ఫోరమ్ ను  డిఆర్‌డిఓ నిర్వహిస్తోంది. దీని ద్వారా వివిధ రంగాలకు చెందిన  శాస్త్రవేత్తల మధ్య అవగాహన  పెంపొందించడానికి, విభిన్న విభాగాలకు చెందిన ప్రముఖుల మధ్య ఆలోచనల మార్పిడి, అవసరమైన సమయాల్లో  నిపుణుల అభిప్రాయాలు స్వీకరించడానికి డిఫెన్స్ సైన్స్ ఫోరమ్ కృషి చేస్తోంది.


(Release ID: 1903292) Visitor Counter : 156


Read this release in: English , Hindi