జాతీయ ఆర్థిక నివేదన ప్రాధికార సంస్థ
బీమా ఒప్పందాల్లో ఏఎస్ 117 ప్రమాణాలపై జీవిత బీమా పరిశ్రమతో ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ సమావేశం
Posted On:
23 FEB 2023 1:12PM by PIB Hyderabad
నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) కార్యనిర్వాహక వర్గం, జీవిత బీమా పరిశ్రమకు చెందిన సభ్యులతో నిన్న సమావేశం నిర్వహించింది. బీమా ఒప్పందాల్లో పారదర్శకత పెంచడానికి ఇండ్ ఏఎస్ 117 ఆశిస్తున్న ప్రతిపాదిత మార్పుల గురించి చర్చించింది. ఇర్డాయ్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ జారీ చేసిన అత్యున్నత ప్రపంచ స్థాయి ప్రామాణిక నిబంధనలైన ఐఎఫ్‌ఆర్‌ఎస్ 17 ఇన్సూరెన్స్ ఒప్పందాల ఆధారంగా ఇండ్ ఏఎస్ 117 ప్రమాణాలను రూపొందించారు. వాస్తవానికి, 2017 మేలో జారీ చేసిన ఐఎఫ్‌ఆర్‌ఎస్ 17 ప్రపంచవ్యాప్తంగా 1 జనవరి 2023 నుండి అమలులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ నిబంధనల్లోని కఠిన నియమాలు, లాభదాయకత, ఆర్థిక స్థితిగతులను బాగా అర్థం చేసుకోవడానికి పెట్టుబడిదార్లకు ఇది సాయపడుతుందని భావిస్తున్నారు.
2018 నుంచి ఉన్న ప్రజాభిప్రాయ సేకరణలతో పాటు ఇండ్ ఏఎస్ 117 కోసం ఐసీఏఐ నుంచి ప్రతిపాదనను ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ అందుకుంది. ఐసీఏఐ జారీ చేసిన ముసాయిదా పత్రాలపై దేశంలోని జీవిత బీమా సంస్థలు తమ ప్రతిస్పందన తెలియజేశాయి. బీమా సంస్థలకు చెందిన బీమా & పెట్టుబడి ఒప్పందాల ప్రత్యేక లక్షణాలను అర్ధం చేసుకోవడానికి ఇండ్ ఏఎస్ 117ను ప్రత్యేకంగా రూపొందించారు. బీమా సంస్థల ఆర్థిక నివేదికల్లోని విషయాలను తెలియజేస్తుంది.
ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ చైర్‌పర్సన్ డా.అజయ్ భూషణ్ పాండే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బీమా పరిశ్రమ పోషించే ప్రధాన పాత్ర గురించి మాట్లాడారు. ఐఏఎస్‌బీ అధ్యయనం ప్రకారం, 2015లోని లిస్టెడ్ కంపెనీల మొత్తం ఆస్తుల్లో 12 శాతం బీమా కంపెనీవేని, $13 ట్రిలియన్ ఆస్తులు ఈ పరిశ్రమకు ఉన్నాయని చెప్పారు. బీమా రంగం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, పరిశ్రమ అనుసరించిన పద్ధతులు, పాటించిన ప్రమాణాలను అభినందించడం చాలా ముఖ్యం అన్నారు.
ప్రతిపాదిత ఇండ్ ఏఎస్ 117పై విస్తృత సంప్రదింపులు జరిగాయి. సామర్థ్యాన్ని పెంచడం, సంసిద్ధత, నిపుణులను (గణాంక, సాంకేతిక బృందాలు) నియమించుకోవడం, కంపెనీలను సన్నద్ధం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలపై ఇర్డాయ్ ప్రతినిధులు, జీవిత బీమా పరిశ్రమ సభ్యులు వారి ఆలోచనలు అందించారు, చర్చలు ఫలవంతంగా జరిగాయి.
****
(Release ID: 1901718)