పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన 12 చీతాలను కునో నేషనల్ పార్క్‌లోకి వదిలిన శ్రీ భూపేందర్ యాదవ్

Posted On: 18 FEB 2023 7:10PM by PIB Hyderabad

దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన 12 చీతాలను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోకి వదిలారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి 7900 కిలోమీటర్ల పైగా ప్రయాణించిన ఈ 12 చిరుతలు, మధ్యాహ్నం 12 గంటల తర్వాత గ్వాలియర్ మీదుగా కునో నేషనల్ పార్క్‌కు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా, కేంద్ర మంత్రి భూపేందర్ శ్రీ యాదవ్ వరుస ట్వీట్లు చేశారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభించిన ప్రాజెక్ట్‌ చీతా, కునో నేషనల్ పార్క్‌లోకి 12 చిరుతలను విడుదల చేయడం ద్వారా మరో మైలురాయిని చేరుకుందని పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికా నుంచి కునో నేషనల్ పార్క్‌కు 12 చిరుతలను తీసుకురావడంలో భారత వైమానిక దళం చేసిన కృషిని అభినందిస్తూ కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

పర్యావరణ ధ్వంసం నుంచి పర్యావరణ పరిరక్షణకు ఎలా మారాలన్న విషయాన్ని ప్రధానమంత్రి ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచానికి చూపిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. 12 చిరుతల రాక ఈ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. చీతాలు భారతదేశ వాతావరణానికి బాగా అలవాటు పడేలా 450 మందికి పైగా చీతా మిత్రలు పని చేస్తున్నారని, జన్ భగిదారికి ఇది అద్భుతమైన ఉదాహరణగా వివరించారు.

ఇప్పుడు కునో నేషనల్ పార్క్‌లో మొత్తం చిరుతల సంఖ్య 20కి పెరిగింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చిరుతలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత ఏడాది సెప్టెంబర్ నెలలో కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేశారు.

***



(Release ID: 1900532) Visitor Counter : 169


Read this release in: English , Urdu , Marathi , Odia