జల శక్తి మంత్రిత్వ శాఖ
పూణెలో ధార-2023 ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన - కేంద్ర జల శక్తి శాఖ మంత్రి
విజన్ @ 2047 తో పాటు, భారతదేశ అభివృద్ధిలో నీటి లభ్యత చాలా ముఖ్యమైనది - శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
प्रविष्टि तिथि:
13 FEB 2023 7:32PM by PIB Hyderabad
ఈరోజు పూణేలో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎం.ఎం.సి.జి), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎం.ఐ.యు.ఏ) సంయుక్తంగా నిర్వహించిన ధారా-2023 (డ్రైవింగ్ హోలిస్టిక్ యాక్షన్ ఫర్ అర్బన్ రివర్స్) ప్రారంభ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షత వహించారు. ధారా అనేది రివర్ సిటీస్ అలయన్స్ (ఆర్.సి.ఏ) సభ్యుల వార్షిక సమావేశం. వందకు పైగా సభ్య నగరాల కు చెందిన కమీషనర్లు, అదనపు కమీషనర్లు, ఛీఫ్ ఇంజనీర్లతో సహా సీనియర్ ఇంజనీర్లు, సీనియర్ ప్లానెర్లు భారతదేశంలో స్థానిక నీటి వనరుల నిర్వహణ కోసం పరిష్కారాలను నేర్చుకునేందుకు, చర్చించుకునేందుకు ఇది ఒక వేదికను అందిస్తుంది.
ఈ కార్యక్రమంలో ఎన్.ఎం.సి.జి. డైరెక్టర్ జనరల్ శ్రీ జి. అశోక్ కుమార్, పూణే మున్సిపల్ కమిషనర్ శ్రీ విక్రమ్ కుమార్, ఎన్.ఐ.యు.ఎ. డైరెక్టర్ శ్రీ హితేష్ వైద్య తదితరులు పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో అయోధ్య, ఔరంగాబాద్ కోసం పట్టణ నదీ యాజమాన్య ప్రణాళికతో పాటు ‘75 నదీ ప్రోత్సాహక కార్యక్రమాలు' అనే అనే సంకలనాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న 52 నగరాల నుండి సేకరించిన నీటిని ఒక జల కలశం లో కలపడం ద్వారా కేంద్ర మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సభను ఉద్దేశించి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, నదులు నాగరికతలకు పర్యాయపదాలు అని, మన నదులను మన మనుగడ కోసం దశాబ్దాలుగా ఉపయోగించుకున్న తర్వాత, మనం నదులకు తిరిగి ఏమి ఇచ్చామో ఆలోచించుకోవాలనీ, లేకుంటే మన భావి తరాలకు నీటి కొరత ఏర్పడుతుందని వివరించారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి 40 మందికి పైగా మున్సిపల్ కమీషనర్లు హాజరైనందుకు, నీటి వనరులను సమర్థవంతంగా నిర్వహించడంలో వికేంద్రీకృత ప్రణాళిక ప్రాముఖ్యతను ప్రతిబింబించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. "ప్రణాళికను స్థానిక స్వీయ-సంస్థల స్థాయిలో ఉత్తమంగా చేయవచ్చు. ఇక్కడ వారి ఉనికికి అపారమైన ప్రాముఖ్యత ఉంది," అని ఆయన పేర్కొంటూ, "స్థానిక సంస్థల ద్వారా మనం నేరుగా ప్రజలతో అనుసంధానం కాగలము, నీటికి సంబంధించిన ఏదైనా కార్యక్రమం విజయవంతం కావడానికి ఇది ఖచ్చితంగా అవసరం." అని తెలియజేశారు.
దేశం చాలా కీలకమైన పరిస్థితుల్లో నడుస్తోందనీ, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయని, శ్రీ షెకావత్ అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా సాంకేతికత ఆధారంగా వచ్చిన మార్పు, మన గౌరవనీయులైన ప్రధానమంత్రి ఊహించిన విధంగా 'వికసిత్ భారత్'ను రూపొందించే దిశలో మనమందరం సమిష్టిగా పనిచేయడం చాలా ముఖ్యమైనదని కూడా ఆయన పేర్కొన్నారు. "ముఖ్యంగా భారతదేశానికి జి-20 అధ్యక్ష పదవిని అప్పగించినప్పటి నుండి మన వృద్ధి కారణంగా ప్రపంచం మన వైపు చూస్తోంది," అని ఆయన పేర్కొంటూ, "మేము “వికసిత్-భారత్” సవాలును స్వీకరించామనీ, ఇది మా సమిష్టి బాధ్యత అనీ, భోపాల్ లో జరిగిన విజన్@2047 అనే ఒక కార్యక్రమంలో నేను నొక్కి చెప్పాను. ఆ కార్యక్రమంలో 25 రాష్ట్రాలు పాల్గొని, నీటి సంబంధిత సమస్యలపై తమ ప్రణాళికల గురించి వివరించడం చూసి నేను సంతోషించాను." అని తెలియజేశారు. విజన్@2027 లక్ష్యాన్ని విజయవంతం చేయడానికి నీటి లభ్యత ఆధారమని, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి నీటి అవసరం నేరుగా అనులోమానుపాతంలో ఉంటుందనేది మా దృఢ విశ్వాసమని కూడా ఆయన అన్నారు.
నదులపై మన కార్యక్రమాలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి పరిమితం కాకుండా ప్రజలు-నదుల మధ్య అనుసంధానాన్ని పటిష్టంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాలని ఆయన అన్నారు. "మన పూర్వీకుల సంప్రదాయ జ్ఞానంలో భాగంగా తరతరాలుగా వస్తున్న నీటి పట్ల గౌరవాన్ని మళ్లీ నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో శక్తివంతమైన సాధనమైన సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించడం ద్వారా మనం యువ తరంలో ఆ భావనను సృష్టించాల్సిన సమయం ఇది." అని ఆయన సూచించారు.
ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించడం, భూగర్భజలాల నిర్వహణ, రీఛార్జ్, జలాశయ మ్యాపింగ్, నదుల పునరుజ్జీవనం కోసం జలశక్తి మంత్రిత్వ శాఖ సమగ్రంగా పనిచేస్తోందని, నీటి రంగానికి అత్యధిక ఆర్థిక కేటాయింపులు చేసే దేశాల్లో భారతదేశం ఒకటి అని ఆయన తెలిపారు. "మనం దృఢమైన తీర్మానంతో ముందుకు సాగాలి, మనం ఖచ్చితంగా మన లక్ష్యాలను సాధిద్దాం," అని ఆయన పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1899251)
आगंतुक पटल : 224