పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఎఫ్‌టీవోలను ప్రోత్సహించడానికి 'ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్' (ఎఫ్‌టీవో) మార్గదర్శకాలు సరళీకృతం
విమానాశ్రయాల అభివృద్ధి, ఆధునికీకరణ కోసం రూ.98,000 కోట్లతో మూలధన వ్యయ ప్రణాళిక
Posted On:
09 FEB 2023 3:25PM by PIB Hyderabad
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటి. మూడో అతి పెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా ఇప్పటికే నిలిచింది.
స్థిరమైన విధాన నిర్ణయ వాతావరణాన్ని అందించడం, పోటీ ఆధారిత వృద్ధిని ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వం విమానయాన రంగానికి చురుగ్గా మద్దతునిస్తోంది. 2016లో, జాతీయ పౌర విమానయాన విధానాన్ని (ఎన్‌క్యాప్ 2016) కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. విమానయాన రంగానికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలు, కార్యాచరణ, కీలక లక్ష్యాలను ఇది నిర్దేశించింది. విమానం/హెలికాప్టర్లు/డ్రోన్లు, వాటి యంత్రాలు, ఇతర భాగాల తయారీ కోసం ఎంఆర్‌వో పరిశ్రమ అభివృద్ధికి దేశంలో అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే ఉద్దేశ్యంతో 2021 సెప్టెంబర్ 1న కొత్త ఎంఆర్‌వో మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఎంఆర్‌వో సంస్థలపై ఎలాంటి రాయల్టీ లేదా సెస్ విధించకుండా బహిరంగ టెండర్ల ద్వారా విమానాశ్రయాల సాధికారత సంస్థ (ఏఏఐ) విమానాశ్రయాల్లో భూమి కేటాయింపును ఈ మార్గదర్శకాలు సుగమం చేశాయి. ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌టీవో) మార్గదర్శకాలు కూడా సరళంగా మారాయి, ఆమోదం పొందాయి. వాటిలో, విమానాశ్రయ రాయల్టీ (ఎఫ్‌టీవోల ఆదాయం నుంచి ఏఏఐకి వాటా చెల్లింపు) రద్దు చేయడం జరిగింది. దేశంలో పైలట్ల కొరతను పరిష్కరించేలా ఎఫ్‌టీవోల ఏర్పాటును ప్రోత్సహించడానికి భూమి అద్దెలను కూడా హేతుబద్ధీకరించడం జరిగింది. డిమాండును, అభివృద్ధిని సృష్టించేలా హెలికాప్టర్ సంబంధిత కార్యకలాపాలను ప్రోత్సహించడానికి 'హెలికాప్టర్ ఆపరేషన్ పాలసీ'ని కూడా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.
ప్రస్తుతం దేశంలో 30 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వివిధ పర్యాటక ప్రాంతాలు సహా ఆకాశమార్గ అనుసంధానతను ప్రోత్సహించే లక్ష్యంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తరచూ విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం, గుజరాత్‌లోని ధోలేరా & హిరాసర్, మహారాష్ట్రలోని నవీ ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా (జెవార్) అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు భారత ప్రభుత్వం 'సూత్రప్రాయ' ఆమోదం తెలిపింది.
విమానాశ్రయాల్లోలో మౌలిక సదుపాయాలు/సౌకర్యాల పెంపు అనేది నిరంతర ప్రక్రియ. కార్యకలాపాల అవసరాలు, ట్రాఫిక్, డిమాండ్, వాణిజ్య సాధ్యత మొదలైనవాటిపై ఆధారపడి ఏఏఐ లేదా సంబంధిత ఎయిర్‌పోర్ట్ నిర్వహణ సంస్థలు వీటిని చేపడతాయి. అంతేగాక, ప్రాంతీయ విమాన అనుసంధానతను ఉత్సాహపరిచేందుకు, ఎక్కువ మందికి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 21-10-2016న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అనుసంధాన పథకాన్ని (ఆర్‌సీఎస్) ఉడాన్‌ను ప్రారంభించింది. దీంతోపాటు, వివిధ బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధి/ఆధునీకరణ, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి కోసం 2019-24 కాలంలో ఏఏఐ, పీపీపీ విమానాశ్రయ నిర్వహణ సంస్థలు రూ.98,000 కోట్లకు పైగా మూలధన వ్యయ ప్రణాళికను ప్రారంభించాయి. ఇందులో ఏఏఐ సుమారు రూ.25,000 కోట్ల మూలధన వ్యయ ప్రణాళిక కూడా కలిసి ఉంది. ప్రయాణీకుల సంఖ్యను పెంచడానికి, విమాన ప్రయాణాన్ని సురక్షితం, సౌకర్యవంతం, వినియోగదారు స్నేహపూర్వకం మార్చడం ఈ మూలధన వ్యయాల ఉద్దేశం.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ వి.కె.సింగ్ (రిటైర్డ్) ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.
******
(Release ID: 1897745)
Visitor Counter : 192