వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వ్యవసాయ మౌలిక సౌకర్యాల నిధి (ఎఐఎఫ్‌)... మధ్యప్రదేశ్ ఫార్మ్ గేట్ యాప్... వ్యవసాయ రంగంలో మహిళా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంపై జబల్‌పూర్‌లో G-20 ఇతివృత్త ఆధారిత కార్యశాల

Posted On: 08 FEB 2023 8:29PM by PIB Hyderabad

  జి-20కి భారతదేశ అధ్యక్షత నేపథ్యంలో ‘ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు’ ఇతివృత్తంద్వారా ప్రపంచ ఐక్యత భావనకు ప్రోత్సాహంతోపాటు వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యం పెంపు లక్ష్యంగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఎఐఎఫ్‌), మధ్యప్రదేశ్ ఫార్మ్ గేట్ యాప్, వ్యవసాయ రంగంలో మహిళా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంపై ఇవాళ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో కార్యశాల నిర్వహించబడింది. ఎఐఎఫ్‌, ఎంపీ ఫార్మ్‌ గేట్‌లలో మహిళల భాగస్వామ్యం మరింత పెంచడం ఈ కార్యశాల ప్రధాన లక్ష్యం.

   ఈ సందర్భంగా మండీ బోర్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీమతి జి.వి.రష్మి మాట్లాడుతూ- మధ్యప్రదేశ్‌లో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఎఐఎఫ్‌) గురించి సమాచారం వెల్లడించారు. దీంతోపాటు మండీ బోర్డ్ ప్రారంభించిన ఎంపీ ఫార్మ్‌ గేట్ అనువర్తనంలోని ముఖ్యాంశాలను వివరించారు.

   జబల్పూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప-కులపతి ప్రొఫెసర్ పి.కె.మిశ్రా ప్రసంగిస్తూ- మధ్యప్రదేశ్‌లో ‘ఎఐఎఫ్’ పథకం నలుమూలలా విస్తరించిందని తెలిపారు. ఈ పథకం ప్రయోజనాల సద్వినియోగం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు 2,753 ప్రాజెక్టులు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ పథకం అమలులో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని పేర్కొంటూ దీనిపై సమగ్ర సమాచారం ఇచ్చారు.

   రాష్ట్రంలో ఎంపీ ఫార్మ్‌ గేట్‌ యాప్‌ పోషిస్తున్న కీలకపాత్ర గురించి మధ్యప్రదేశ్‌ వ్యవసాయ మంత్రిత్వశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ అశోక్‌ వర్ణవాల్‌ తన ప్రసంగంలో వివరించారు. ఈ యాప్‌ ద్వారా తమ పంటలను విక్రయిస్తున్న రైతులు గిట్టుబాటు ధర పొందగలుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా మహిళలు కూడా మార్కెట్‌కు వెళ్లే అవసరం లేకుండా ఇంటినుంచే ఉత్పత్తుల క్రయవిక్రయాలు చేసుకుంటున్నారని తెలిపారు.

   ఈ కార్యశాలలో పాల్గొన్న వారందరికీ మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కమల్ పటేల్  ఆన్‌లైన్ సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎఐఎఫ్‌’ పథకంతోపాటు ఎంపీ ఫార్మ్ గేట్ అనువర్తనాన్ని విస్తృతంగా వాడుకోవాల్సిందిగా ఆయన సూచించారు.

   ఈ కార్యశాలలో దాదాపు 300 మంది పాల్గొనగా, ‘ఎఐఎఫ్‌’ పథకం గురించి వ్యవసాయ శాఖ, నాబార్డ్‌, ఉద్యాన విభాగం, అపెడా, బ్యాంకులు, ఇతర సంస్థల నిపుణులు వారికి సమగ్రంగా వివరించారు. అలాగే, ప్రశ్నోత్తరాలలో పాల్గొన్నవారి సందేహాలకు సంక్షిప్తంగా జవాబిచ్చారు. మహిళా రైతులు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు తదితరులకు ఎంపీ ఫార్మ్‌ గేట్ అనువర్తన సంబంధిత సమాచారం ఇచ్చారు.

   మరోవైపు ‘ఎఐఎఫ్‌’ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీమతి పూజా సింగ్ ఈ పథకం గురించి సవివర సమాచారమిచ్చారు. ఎంపీ ఫార్మ్ గేట్ యాప్‌ గురించి భోపాల్‌లోని ఎన్‌ఐసి టెక్నికల్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ సుల్తాన్, మండీ బోర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ యోగేష్ నాగ్లే, చీఫ్ ప్రోగ్రామర్ శ్రీ సందీప్ చౌబే సమగ్ర సమాచారం అందించారు.

   చివరగా, జబల్పూర్‌లోని మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ బోర్డ్ మండల కార్యాలయ సంయుక్త డైరెక్టర్ శ్రీ ఆనంద్ మోహన్ శర్మ వందన సమర్పణ చేయడంతోపాటు  కార్యశాలలో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జబల్పూర్‌ ప్రాంత పరిధిలోని మహిళా పారిశ్రామికవేత్తలు, రైతులు ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

*****



(Release ID: 1897595) Visitor Counter : 198


Read this release in: English , Hindi , Urdu