హోం మంత్రిత్వ శాఖ
సైబర్ నేరగాళ్ల మోసాలు
Posted On:
07 FEB 2023 4:32PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ‘సైబర్ నేరగాళ్ల మోసాల’పై ప్రశ్నకు లోక్‌సభలో ఇవాళ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్‌కుమార్ మిశ్రా కింది లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
సైబర్ రంగం విస్తృత వినియోగం నేపథ్యంలో సైబర్ మోసాలుసహా నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. జాతీయ నేర రికార్డుల సంస్థ (ఎన్‌సిఆర్‌బి) “క్రైమ్ ఇన్ ఇండియా” పేరిట దేశవ్యాప్త సమాచార క్రోడీకరణ ద్వారా నేరాలపై గణాంక సమాచారాన్ని ప్రచురించింది. ఈ మేరకు విడుదల చేసిన తాజా నివేదిక-2021కి సంబంధించినది. అయితే, నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా జరిగే మోసాలకు సంబంధించిన కేసుల నిర్దిష్ట సమాచారాన్ని ‘ఎన్‌సిఆర్‌బి’ నిర్వహించదు. రాజ్యాంగంలోని ఏడో విచ్ఛేదం కింద పోలీసు, జనజీవన భద్రత రాష్ట్రాల పరిధిలోని అంశాలు. కాబట్టి సైబర్ నేరాల ముప్పును ఎదుర్కోవడానికి తగిన మౌలిక సదుపాయాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన సాధనాలు, సిబ్బంది-పోలీసు సిబ్బందికి శిక్షణ వగైరాలకు సంబంధించి ప్రాథమిక బాధ్యత ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలదే. కేంద్ర ప్రభుత్వం వాటి చట్టాల అమలు వ్యవస్థ (ఎల్‌ఇఎ)ల సామర్థ్య వికాసానికి తగిన సలహాలు-పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తుంది.
సైబర్ మోసాలు, నేరాల నిరోధానికి సమగ్ర-సమన్వయంతో కూడిన యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పన, హెచ్చరికలు/సలహాల జారీ, సామర్థ్య పెంపు/చట్టాల అమలు సిబ్బంది/ ప్రాసిక్యూటర్లు/న్యాయాధికారులకు శిక్షణ వగైరాలతోపాటు సైబర్ ఫోరెన్సిక్ సౌకర్యాల మెరుగుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమగ్ర-సమన్వయ సహిత సైబర్ నేర నిరోధంపై ‘ఎల్‌ఇఎ’ల కోసం ఒక చట్రం, పర్యావరణ వ్యవస్థ రూపకల్పనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ర్డినేషన్ సెంటర్’ (I4సి)ని ఏర్పాటు చేసింది.
మహిళలు, పిల్లలమీద సైబర్ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, అన్నిరకాల సైబర్ నేరాలను ప్రజలు నివేదించేందుకు వీలుగా ప్రభుత్వం ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ (www.cybercrime.gov.in) ప్రారంభించింది. ఇందులో నివేదించబడిన సైబర్ నేరాల సంఘటనల సమాచారం చట్ట నిబంధనల మేరకు తదుపరి చర్యల కోసం సంబంధిత రాష్ట్రం/కేంద్రపాలిత చట్ట అమలు సంస్థకు దానంతటదే చేరుతుంది. ఆర్థిక మోసాలపై తక్షణ నివేదనసహా మోసగాళ్లు నిధుల స్వాహాకు పాల్పడకుండా నిరోధించేందుకు ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ ప్రారంభించబడింది. ఆన్‌లైన్ సైబర్ ఫిర్యాదుల నమోదులో ప్రజలకు సహాయం కోసం ఉచిత సహాయ కేంద్రం ఫోన్ నం.‘1930’తో ప్రారంభించబడింది. ఇక ఇప్పటిదాకా ఆర్థిక మోసపు లావాదేవీల నిరోధం ద్వారా రూ.235 కోట్ల ప్రజాధనం ఆదా అయింది.
*****
(Release ID: 1897133)
Visitor Counter : 264