నీతి ఆయోగ్
హైదరాబాద్ లో విజయవంతంగా ముగిసిన స్టార్టప్ 20 ప్రారంభ సభ
Posted On:
31 JAN 2023 7:00PM by PIB Hyderabad
భారత్ జీ20 అధ్యక్షతన ప్రారంభమైన స్టార్టప్ 20 ప్రారంభ సమావేశం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ లో విజయవంతంగా ముగిసింది.
ప్రముఖులు, ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ
స్టార్టప్ 20 ఇండియా చైర్మన్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ సదస్సు ప్రారంభించారు. 'వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచ సవాళ్లను పరిష్కరించే ప్రయత్నం ' అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో అతిథులు కీలకోపన్యాసం చేశారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వర్చువల్ విధానంలో సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. స్టార్టప్ 20 వంటి వేదిక ప్రాముఖ్యతను శ్రీ గోయల్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. "స్టార్టప్ 20 గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ లకు గుర్తింపు, గౌరవాన్ని తీసుకురాగల శక్తివంతమైన సంస్థగా పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. సదస్సులో రాబోయే కొద్ది రోజుల పాటు జరిగే చర్చలు ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ రంగం అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తుంది. స్టార్టప్ విప్లవాన్ని ప్రారంభిస్తుంది" అని శ్రీ గోయల్ అన్నారు.
"దృఢ సంకల్పం మరియు భావసారూప్యత కలిగిన వ్యక్తుల చిన్న సమూహం చరిత్ర గతిని మార్చగలదు" అంటూ జాతిపిత మహాత్మా గాంధీ చేసిన వ్యాఖ్యలను శ్రీ గోయల్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.
రాబోయే రెండు రోజుల్లో జరిగే చర్చలు ప్రపంచానికి బలమైన ఎజెండాను ఇస్తాయన్న ధీమా వ్యక్తం చేసిన శ్రీ గోయల్ దీనివల్ల స్టార్టప్ విప్లవం ప్రారంభమవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ. జి.కిషన్ రెడ్డి తన ప్రసంగంలో స్టార్టప్ రంగంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3 వ స్థానంలో ఉందన్నారు. వినూత్న ఆలోచనలతో భవిష్యత్తు మార్పులు ఎదుర్కోవడానికి భారతదేశం స్ఫూర్తి ఇస్తుందని పేర్కొన్నారు. వచ్చే 20 ఏళ్లలో స్టార్టప్ లు భారత జీడీపీని పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
" ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్టార్టప్ లు ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భారతీయ అంకుర సంస్థలు సరికొత్త ఆలోచనలతో వినూత్న ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయి. స్టార్టప్ సంస్థల కృషితో వచ్చే 20 ఏళ్లలో భారత జీడీపీ గణనీయంగా అభివృద్ధి సాధిస్తుంది" అని శ్రీ కిషన్ రెడ్డి చెప్పారు.
స్టార్టప్ లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదకాలుగా పనిచేస్తున్నాయని అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్ తెలిపారు. యాక్సిలరేటర్లు, ఇంక్యుబేటర్లు, స్టార్టప్ లు, ప్రభుత్వ సంస్థలు అవగాహనతో పనిచేసి పటిష్ట స్టార్టప్ వ్యవస్థ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు.
యాక్సిలరేటర్లు, ఇంక్యుబేటర్లు, స్టార్టప్ వ్యవస్థాపకులు , ప్రభుత్వ సంస్థల మధ్య అవగాహన కల్పించడానికి అవసరమైన వ్యవస్థ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. స్టార్టప్ ల స్వర్ణయుగాన్ని నిర్మించడానికి, కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుందని శ్రీ సోమ్ ప్రకాష్ తెలిపారు.
జీ- 20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్ ప్రసంగిస్తూ ప్రపంచ సమస్యలకు పరిష్కార మార్గాలను అందించే అంశంలో స్టార్టప్ ల ప్రాముఖ్యతను ప్రస్తావించారు. "అనేక సవాళ్లు ఎదురవుతున్న సమయంలో ప్రతి సవాల్ పరిష్కారానికి ఒక అవకాశం ఉంది. సంక్షోభం మధ్య సాంకేతిక అంశాలు, ఆవిష్కరణల ద్వారా సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం అతిపెద్ద సవాలుగా ఉంటుంది. స్టార్టప్ ఎంగేజ్మెంట్ గ్రూప్ అనేది జీ- 20 ఉద్యమానికి భారతదేశం అందించిన ఒక అవకాశం. సాంకేతికత, సృజనాత్మకత కదలికను ప్రారంభించే మొదటి ఎంగేజ్మెంట్ గ్రూప్. ప్రపంచానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరం మరింత ఎక్కువగా ఉంది. ప్రస్తుత మాంద్యం ధోరణి నుంచి బయటపడడానికి ప్రపంచానికి యువ పారిశ్రామికవేత్తలు అవసరం అని భారతదేశం నమ్ముతోంది" అని శ్రీ అమితాబ్ కాంత్ అన్నారు.
నీతి ఆయోగ్ సిఇఒ శ్రీ పరమేశ్వరన్ అయ్యర్ తన ప్రసంగంలో ఒక కీలక ఆవిష్కర్తగా భారతదేశం పోషిస్తున్న పాత్రను తన ప్రసంగంలో ప్రస్తావించారు. "జీరో లోగో అనేది భారతీయ నాగరికత, సంస్కృతిలో భాగంగా ఉంది. వినూత్న ఆవిష్కరణ రంగంలో భారతదేశం అగ్ర స్థానంలో ఉంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత ఆలోచనలు భారతదేశంలో స్టార్టప్ రంగం అభివృద్ధిని సాధ్యం చేశాయి. దేశంలో స్టార్టప్ రంగం సాధించిన అభివృద్ధిని జీ-20 అధ్యక్ష హోదాలో ప్రపంచానికి తెలియజేయడానికి కృషి జరుగుతుంది." అని శ్రీ పరమేశ్వరన్ అయ్యర్ పేర్కొన్నారు.
పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్ తన ప్రసంగంలో జీ- 20 అధ్యక్ష హోదాలో భారతదేశం అనుసరించనున్న విధానం, స్టార్టప్ 20 ఏర్పాటును ప్రస్తావించారు.
" భారతీయ తత్వశాస్త్రం వాసుదైవ కుటుంబకం ఆధారంగా మా ఇతివృత్తాన్ని ఎంచుకున్నాము. ప్రాథమికంగా ప్రపంచం ఒకే కుటుంబం అని అర్థం, మేము ఆ తత్వాన్ని స్వీకరించాము. అందరం కలిసి ఒక కుటుంబంగా పని చేయాల్సిన అవసరం ఉంది. లక్ష్య సాధనలో భాగంగా స్టార్టప్ 20 ఏర్పాటు అయ్యింది. జీ20కి, స్టార్టప్ రంగాల మధ్య సమన్వయం సాధించి అభివృద్ధి సాధించడానికి డీపీఐఐటీ పనిచేస్తుంది" చెప్పారు.
పరిశ్రమల అభివృద్ధి, అంతర్గత వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి శ్రుతి సింగ్ ముగింపు ప్రసంగంతో స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ప్రారంభ సదస్సు ముగిసింది.
అనంతరం డాక్టర్ వైష్ణవ్ స్టార్టప్ 20 టాస్క్ ఫోర్స్ ను పరిచయం చేయడంతో పాటు కౌన్సిల్ చైర్మన్ల నుంచి ఆశిస్తున్న ఫలితాలను వివరించారు. అనంతరం జరిగిన గ్లోబల్ స్టార్టప్ రివల్యూషన్ సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులు ఆయా దేశాల్లోని స్టార్టప్ రంగ వ్యవస్థపై చర్చించారు.
టి-హబ్, తెలంగాణ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ ఇమ్మర్షన్ సంస్థలను ప్రతినిధులు సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. మొదటి రోజు తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన విందుతో ముగిసింది, భారతదేశం వారసత్వం , సంస్కృతి ప్రతిబింబించే విధంగా పేరిణి నాట్యం, భరతనాట్యం, భాంగ్రా నృత్యం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
తాజ్ కృష్ణలో రెండో రోజు ప్రారంభ సభ జరిగింది. సదస్సు మొదటి రోజున జరిగిన చర్చల వివరాలను డాక్టర్ వైష్ణవ్ వివరించారు. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మరియు యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు , సిఇఒ శ్రద్ధా శర్మ ప్రసంగించారు. భారతదేశంలో స్టార్టప్ సంస్థలు సాధించిన విజయాలను వివరించారు.
ఈ నేపథ్యంలో స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటు చేసిన స్టార్టప్ 20 ఎక్స్ ను నటుడు సునీల్ శెట్టి ప్రారంభించారు. నాయకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, దార్శనికులు, విద్యావేత్తలు, ఇంక్యుబేషన్ నిపుణులు , మహిళలు, యువత, చేతివృత్తులు, కళాకారులు, ఉద్యమకారులు తదితరులను ఒకచోట చేర్చి అనుభవాలు, ఉత్తమ విధానాలపై చర్చించేందుకు స్టార్టప్ 20ఎక్స్ ను ప్రారంభించారు. స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్,టాస్క్ ఫోర్స్ లో జరిగే చర్చలు, సదస్సులు సమర్థవంతమైన విధాన రూపకల్పనలో సహకరిస్తాయి.
స్టార్టప్ 20 ఎక్స్ ప్రాముఖ్యత,ప్రత్యేకతను డాక్టర్ వైష్ణవ్ వివరించారు. "తమ అభివృద్ధికి సహకరించే విధానాన్ని రూపొందించే అంశంలో స్టార్టప్ ల తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. స్టార్టప్ 20 ఎక్స్ దీనికి సహకరిస్తుంది. ఆవిష్కరణ రంగంలో ప్రజాస్వామ్య విధానంలో నిర్ణయాలు తీసుకుని, ప్రపంచానికి పరిచయం చేయడానికి స్టార్టప్ 20 ఎక్స్ కృషి చేస్తుంది" అని డాక్టర్ వైష్ణవ్ అన్నారు.
అనంతరం ప్రతినిధులు ప్రతి టాస్క్ ఫోర్స్ లక్ష్యాలు, అనుసరించాల్సిన విధానాలపై చర్చలు జరిపారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను , చర్చను ఆన్ లైన్ ఫారం ద్వారా నమోదు చేశారు. ఆ తర్వాత మూడు టాస్క్ ఫోర్స్ లకు అంతర్జాతీయ, జాతీయ ప్రతినిధులకు నామినేషన్లు దాఖలయ్యాయి. డాక్టర్ వైష్ణవ్ చేసిన ముగింపు వ్యాఖ్యలతో సదస్సు ముగిసింది.
తాజ్ కృష్ణ గార్డెన్ రూమ్ లో స్టార్టప్ 20 పై చర్చలు జరిగాయి. ఇన్క్రెడిబుల్ ఇండియా లైట్ అండ్ సౌండ్ షో కోసం హుస్సేన్ సాగర్ సరస్సు, గోల్కొండ కోటకు సాంస్కృతిక విహార యాత్ర నిర్వహించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణలో ప్రతినిధుల విందుతో రెండో రోజు సమావేశం ముగిసింది.
2023లో భారత్ జీ20 అధ్యక్షతన స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ను ప్రారంభించారు. స్టార్టప్ లకు సహకారం అందించడం, స్టార్టప్ లు, కార్పొరేట్లు,పెట్టుబడిదారులు,ఆవిష్కరణ సంస్థలు ఇతర కీలక భాగస్వాముల మధ్య సహకారం, సమన్వయం సాధన కోసం గ్రూప్ కృషి చేస్తుంది. ఫౌండేషన్, అలయన్స్, ఫైనాన్స్, ఇన్ క్లూజన్ అండ్ సస్టెయినబిలిటీ అనే మూడు టాస్క్ ఫోర్స్ లు ఈ ఎంగేజ్ మెంట్ గ్రూప్ లో ఉన్నాయి. జి 20 దేశాలలో స్టార్టప్ ల విస్తరణను ప్రోత్సహించడానికి సమర్థవంతమైన విధాన వ్యవస్థపై ప్రతినిధులు చర్చలు జరుపుతారు. ప్రపంచ స్టార్టప్ రంగానికి సహకారాత్మక , ముందుచూపుతో కూడిన విధానం ద్వారా సమన్వయం సాధించడం ప్రాథమిక లక్ష్యంతో స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ పనిచేస్తుంది.
జీ-20 సభ్య దేశాలకు చెందిన స్టార్టప్ సంస్థల సామర్థ్యం పెంపుదల, నిధుల అంతరాలను గుర్తించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వాతావరణ స్థితిస్థాపకత సాధించడం, సమ్మిళిత పర్యావరణ వ్యవస్థ వృద్ధి రూపంలో కార్యాచరణ ప్రణాళిక అభివృద్ధి చేయడానికి ఒక ఉమ్మడి వేదిక అందించడం లక్ష్యంగా స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ పనిచేస్తుంది.
***
(Release ID: 1895221)
Visitor Counter : 253