సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్రం సహకార బంధం!
పాలనా సంస్కరణలు, ప్రజా సమస్యల పరిష్కారంపై
కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన
Posted On:
13 JAN 2023 5:07PM by PIB Hyderabad
కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ (డి.ఎ.ఆర్.పి.జి.), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య సహకారం కోసం ఒక ప్రణాళికను రూపొందించడానికి ఆరుగురు సభ్యుల డి.ఎ.ఆర్.పి.జి. ప్రతినిధి బృందం 2023 జనవరి 12న విజయవాడ సందర్శించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆహ్వానం మేరకు, డి.ఎ.ఆర్.పి.జి. కార్యదర్శి వి. .శ్రీనివాస్ నేతృత్వంలో ఈ బృందం విజయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎ.పి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో, ఎ.పి. సాధారణ పరిపాలనా శాఖ (జి.ఎ.డి.) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, తదితర సీనియర్ అధికారులతో డి.ఎ.ఆర్.పి.జి. ప్రతినిధి బృందం అధికారిక సమావేశాలు జరిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జవహర్ రెడ్డిని ఈ సందర్భంగా డి.ఎ.ఆర్.పి.జి. కార్యదర్శి వి. శ్రీనివాస్ అభినందించారు. సుపరిపాలనా వారం- 2022 పేరిట చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఆయన ప్రశంసించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం లక్ష్యంగా స్పందన పేరిట సమగ్రమైన ప్రత్యేక వ్యవస్థను ఎ.పి.లో అమలు చేస్తున్నారని ఆయన అభినందించారు. ఇ-ఆఫీస్ పద్ధతులను విస్తృత స్థాయిలో చేపట్టి, నేషనల్ ఇ-సర్వీసెస్ బట్వాడా మధింపు ప్రక్రియ-2021 కార్యక్రమం కింద పటిష్టమైన పనితీరు కోసం ఈ వ్యవస్థను అమలు చేశారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పాలనా వ్యవస్థలో విశిష్టత కోసం ప్రధానమంత్రి అవార్డులు- జాతీయ ఇ-గవర్నెన్స్ అవార్డుల పథకం కింద అవార్డు విజేతలుగా నిలిచిన అనేక సుపరిపాలనా నమూనాలను ఆంధ్రప్రదేశ్ అమలు చేయడం కూడా అభినందనీయమని ఆయన ఈ సందర్భంగా ఆయన అన్నారు.
డి.ఎ.ఆర్.పి.జి. ప్రతినిధి బృందం అమరావతిలోని కాజా ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థను (హెచ్.ఆర్.డి.ఐ.ని) సందర్శించి, అక్కడి సీనియర్ అధికారులతో సమావేశమైంది. సేవోత్తం పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఫిర్యాదుల పరిష్కార విభాగం అధికారుల సామర్థ్యం మెరుగుదల కార్యక్రమాల నిర్వహణ, వార్షిక ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు. 2023 జనవరి నుంచి మార్చి నెల వరకు, 5,000 మంది ఫిర్యాదుల పరిష్కార విభాగం అధికారులకు సామర్థ్యాల నిర్మాణ కార్యక్రమాన్ని వర్తింపజేయడానికి 50 వరకూ సేవోత్తం నమూనాలను ఈ సందర్భంగా నిర్వహిస్తారు. 2023-24వ సంవత్సరం నుంచి రాష్ట్రంలో సేవోత్తం పథకాన్ని మరింతగా విస్తరించనున్నారు.
అనంతరం నంబూరులోని గ్రామ సచివాలయాన్ని కూడా డి.ఎ.ఆర్.పి.జి. ప్రతినిధి బృందం సందర్శించింది. పౌర ప్రయోజనాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పరిపాలనా నమూనాలలోని ఉత్తమ పద్ధతుల గురించి ఈ బృందం అడిగి తెలుసుకుంది.
ఉభయపక్షాల మధ్య సహకారం కోసం ఈ కింది ప్రణాళికకు రూపకల్పన చేశారు:
1. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎ.పి.హెచ్.ఆర్.డి.ఐ.) సహకారంతో ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మెరుగుపరచడానికి సేవోత్తం పథకం కింద ఫిర్యాదుల పరిష్కార విభాగానికి చెందిన 5,000మంది అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడం.
2. ఉభయపక్షాలకు అంగీకార యోగ్యమైన తేదీల్లో తిరుపతిలో ఇ-గవర్నెన్స్, సేవల బట్వాడా వ్యవస్థను మెరుగుపరచడం, ఫిర్యాదుల పరిష్కారంపై ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేయడం.
3. సుపరిపాలనా సూచిక, నేషనల్ ఇ-సర్వీసెస్ బట్వాడా మధింపు సూత్రీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో డి.ఎ.ఆర్.పి.జి. మధ్య మెరుగైన సమన్వయం కల్పించడం.
4. ఆంధ్రప్రదేశ్ కోసం జిల్లా స్థాయిలో సుపరిపాలన సూచిక రూపకల్పన.
5. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ సాధనగా స్పందన కార్యక్రమానికి డాక్యుమెంటేషన్/ప్రచారం.
అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని ఈ ప్రతినిధి బృందం కలుసుకుంది. పరస్పర సహకారం కోసం ప్రతిపాదిత ప్రణాళికను గురించి ఆయనకు వివరించింది. ప్రతినిధి వర్గం చూపిన చొరవను ముఖ్యమంత్రి కూడా ప్రశంసించారు. పౌర ప్రయోజనాలకోసం ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న పరిపాలనా నమూనాలపై ముఖ్యమంత్రి తన ఆలోచనలను తెలియజేశారు. డేటా అనలిటిక్స్‌తో పాటు ఫిర్యాదుల పరిష్కార నాణ్యతపై దృష్టి సారించడంతో స్పందన పోర్టల్ మరింత బలోపేతం కాగలదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇంకా గ్రామ స్థాయిలో ఇ-సేవలు, ప్రత్యక్ష నగదు బదిలీ (డి.బి.టి.) సేవల సమగ్ర శ్రేణిని అందించడానికి, గ్రామ స్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్.డి.జి.ల) పురోగతిని పర్యవేక్షించడానికి గ్రామ సచివాలయాలను అభివృద్ధి చేసినట్టు ఆయన చెప్పారు. ఇంటర్నెట్ అనుసంధానం అనేది సవాలుగా మిగిలిపోయిందని, భారత్ నెట్ కవరేజీని విస్తరించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. డిజిటల్ పరిజ్ఞాన సాధికారత ద్వారా పౌరులను ప్రభుత్వానికి చేరువ చేసే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిని సారించిందని అన్నారు. సంస్థల డిజిటల్ పరివర్తన గ్రామ స్థాయి కార్యక్రమాల సామాజిక తనిఖీ ద్వారా జవాబ్దారీతనం, పారదర్శకత మెరుగుపడిందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రతినిధి బృందంలో డి.ఎ.ఆర్.పి.జి. కార్యదర్శి వి.శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఎన్.బి.ఎస్..రాజ్‌పుత్, డైరెక్టర్లు ఎన్.కె. మీనా, కె. సంజయన్, ఉప కార్యదర్శి పార్థసారథి భాస్కర్, అండర్ సెక్రెటరీ సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.
<><><>
(Release ID: 1891183)
Visitor Counter : 219