జల శక్తి మంత్రిత్వ శాఖ
“నీరు దార్శనికత@2047” పేరిట తొలి అఖిలభారత సదస్సు ప్రారంభం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్వహణ
వివిధ రాష్ట్రాల జలవనరుల మంత్రులు హాజరు..
వీడియో సందేశం ద్వారా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగం
Posted On:
05 JAN 2023 5:41PM by PIB Hyderabad
"నీరు దార్శనికత @2047" పేరిట రాష్ట్రాల మంత్రుల తొలి వార్షిక సమావేశం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈరోజు ప్రారంభమైంది. ముఖ్య అతిథి, ప్రముఖులు పాల్గొన్న 'జల కలశ్' వేడుక నిర్వహణతో రెండు రోజుల ఈ సదస్సుకు శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి వీడియో సందేశం, ప్రత్యేక ప్రసంగం అనంతరం వేడుక మొదలైంది. రానున్న 25 సంవత్సరాల అమృత్ కాల పయనంలో "నీరు దార్శనికత @2047" అనేది ఒక ముఖ్యమైన కోణం” అని ప్రధాన మంత్రి తన వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు. నీటి సంరక్షణ రంగంలో వర్తులాకార ఆర్థిక వ్యవస్థ ప్రాముఖ్యత గురించి ప్రధాన మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. వర్తుల ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. "శుద్ధి చేసిన నీటిని తిరిగి ఉపయోగించినప్పుడు, మంచినీరు సంరక్షణ జరుగుతుంది. ఇది మొత్తం పర్యావరణ వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది. అందుకే నీటి శుద్ధి, వాటర్ రీసైక్లింగ్ మనకు తప్పనిసరి కర్తవ్యాలు” అని ఆయన అన్నారు. వివిధ ప్రయోజనాల కోసం 'శుద్ధి చేసిన నీటి' వినియోగం పెంచడానికి గల అవకాశాలను రాష్ట్రాలు కనుగొనవలసి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. "మన నదులు, మన నీటి వనరులు మొత్తం నీటి పర్యావరణ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన భాగం", ప్రతి రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి వ్యవస్థను రూపొందించాలని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. “నమామి గంగే పథకాన్ని ఆదర్శవంతమైన నమూనాగా రూపొందించడం ద్వారా, నదుల పరిరక్షణ కోసం ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి ప్రచారాలను, కార్యక్రమాలను ప్రారంభించవచ్చు. జలసంరక్షణ అంశాన్ని సహకారానికి, సమన్వయానికి సంబంధించిన అంశంగా మార్చాల్సిన బాధ్యత ప్రతి రాష్ట్రానికీ ఉంది”, అంటూ ప్రధాన మంత్రి మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
PM వీడియో ప్రసంగం
పూర్తి పాఠం: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1888809
ప్రధానమంత్రి ప్రసంగంపై
పత్రికా ప్రకటన: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1888763
• అమృత్ కాలానికి సంబంధించి రానున్న 25 సంవత్సరాల పయవంలో నీరు -దార్శనికత @ 2047- అనేది ఒక ముఖ్యమైన కోణం: ప్రధాని మోదీ
• సహకార - సమన్వయ అంశంగా నీటి సంరక్షణను మార్చడం ప్రతి రాష్ట్రం బాధ్యత: ప్రధాని మోదీ
• ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో నీరు, పారిశుద్ధ్య రంగంలో భారతదేశం అగ్రగామిగా మారింది: కేంద్ర జలశక్తి మంత్రి
• “ఆర్థిక వృద్ధి-విద్యుత్ -నీటి వినియోగం మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. అందువల్ల, నీటి అవసరాలు , నీటి లభ్యత గురించి స్థూలంగా చర్చించాల్సిన అవసరం ఉంది.
• మధ్యప్రదేశ్ రాష్ట్రం సమగ్ర నీటి విధానాన్ని రూపొందిస్తోంది, ఇది త్వరలో అమలులోకి వస్తుంది: ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
• రేపు ఉదయం అంటే జనవరి 6, 2023న తనతో కలిసి చెట్లు నాటాలని కార్యక్రమంలో పాల్గొనే వారందరినీ చౌహాన్ కోరారు. ఆ ప్రాంతాన్ని నీటి దార్శనిక ఉద్యానవనం అని పిలుస్తారు
• శుద్ధి చేసిన వ్యర్థ జలాల పునర్వినియోగంపై జాతీయ స్థాయి వ్యవస్థను, అవక్షేపణ నిర్వహణ కోసం జాతీయ వ్యవస్థను, జల్ శక్తి అభియాన్ కింద ఉత్తమ పద్ధతులు: వర్షం నీటిని ఒడిసి పట్టండి అన్న కార్యక్రమాన్ని ప్రముఖులు ప్రారంభించారు.
• ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా WRIS పోర్టల్ క్రింద ‘జల ఇతిహాస్’ సబ్ పోర్టల్‌ను ఈ ప్రదర్శనతో పాటు ప్రముఖులు ప్రారంభించారు.
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈసందర్భంగా ప్రధానోపన్యాసం ఇచ్చారు. నీటి సంరక్షణ పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చూపిన నిబద్ధతను, భోపాల్ నగరంలో ఈ సదస్సును నిర్వహించడంలో ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎనలేని కృషిని కేంద్రమంత్రి ప్రశంసించారు. "ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో నీరు, పారిశుద్ధ్య రంగంలో భారతదేశం అగ్రగామిగా అవతరించింది" అని షెకావత్ అన్నారు. కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులకు ఆయనస్వాగతం పలుకుతూ, కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథాన్ని కొనసాగిస్తోందని, 2027 నాటికి జర్మనీ, జపాన్‌ల దేశాలను అధిగమించి, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అవతరిస్తుందని భావిస్తున్నట్టు షెకావత్ తెలిపారు. "ఆర్థిక వృద్ధికి, విద్యుత్-నీటి వినియోగానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. 3నుంచి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, ఆ తర్వాత 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశం మారడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ప్రధానమంత్రి అందించారు. అందువల్ల, నీటి అవసరాలు, నీటి లభ్యత గురించి ఇలాంటి సమావేశాల ద్వారా స్థూల స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉంది. " అని అన్నారు.
"వర్షం, హిమనీ నదాలు లేదా అంతర్జాతీయ బేసిన్‌ల ద్వారా భారతదేశం నీటి లభ్యత 4,000 బిలియన్ల ఘనపు మీటర్లు. అయితే ఇందులో వినియోగించదగిన మొత్తం సాగునీటి పరిణామం సగం మాత్రమే అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, తక్కువైన, అస్థిరమైన వర్షపాతం,.. వర్షపాత నమూనాలను మార్చివేసింది, ఇది ఈ సాగు ప్రాంతాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. వాతావరణ మార్పు, వేగవంతమైన పట్టణీకరణ, నీటికి పెరిగిన డిమాండ్, నీటి కాలుష్యం కలిసి తలసరి నీటి లభ్యతను 5000 ఘనపు మీటర్ల నుండి 1500 ఘనపు మీటర్లకు తగ్గించాయి. ఇక 2047 నాటికి అది 1200 ఘనపు మీటర్ల పరిమాణానికి తగ్గవచ్చు. అందువల్ల, మనమందరం ఈ సమస్యకు పరిష్కార మార్గాలను చర్చించాలి. ఈ సవాలును సంపూర్ణంగా అధిగమించండి." అని షెకావత్ పిలుపునిచ్చారు.
"2047 నాటికి, నీటి లభ్యతను మించి మన నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉంది. అందువల్లనే, ఈ అంశంపై సమగ్రంగా చర్చించడానికి, సంసిద్ధతను నిర్ధారించడానికి, సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి అన్ని రాష్ట్రాలతో ఈ సదస్సు నిర్వహించాలని, ఆపద్ధర్మ ప్రణాళికను తయారు చేయాలని ప్రధాన మంత్రి పట్టుబట్టారు. అభివృద్ధి చెందిన దేశంగా మారుతూ మన దేశం వేగంగా దూసుకుపోతోంది కాబట్టి, భవిష్యత్తు కోసం నీటి లభ్యతను నిర్ధారించే దిశగా ప్రణాళికల రూపకల్పన, కృషి చాలా ముఖ్యం. నీటి లభ్యతను నిర్ధారించడానికి అన్ని రాష్ట్రాలు తమంతట తాముగా, ఒక దేశంగా ఒక ప్రణాళికను రూపొందించడానికి మనమందరం కలిసికట్టుగా పని చేయాలి”. అని కేంద్ర మంత్రి అన్నారు. “సమగ్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కోసం పని చేయడానికి 2019 లో ప్రధానమంత్రి నాకు అవకాశం ఇచ్చారు, దీని ద్వారా మన నీటి వనరులను మెరుగైన పద్ధతిలో అంచనా వేయగలిగాం. అయితే ఇందుకు రాష్ట్రాలతో పాటు కలసి పనిచేయాలి.
పోషక విలువల ఆధారంగా ఇప్పుడు ఆహార నాణ్యతను గణిస్తున్నట్లుగానే, దేశం నీటి అవసరాలను మరింత సమగ్ర పద్ధతిలో అంచనా వేయాలి. ప్రధాని కలలు గన్నట్టుగానే అమృత్ సరోవర్ల తరహాలో చిన్న నిల్వ సౌకర్యాల ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడంతో సహా అనేక సవాళ్లను మనం ఎదుర్కోవాలి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషి, కార్యక్రమాల ద్వారా అవగాహన కూడా పెరిగింది. వివిధ సంస్థలు, పంచాయితీలు, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు తదితరులను ఏకతాటిపైకి తెచ్చి ప్రధాని ప్రారంభించిన జలశక్తి పథకం ఇపుడు ఫలితాలను అందించడం ప్రారంభించినట్టు భూగర్భ జల నివేదిక తెలియజేస్తోంది. నీటిని అతిగా వినియోగించే ప్రాంతాల,, బ్లాకుల సంఖ్యను తగ్గించడానికి ఇది దోహదపడింది. అయితే సురక్షిత బ్లాక్‌లు పెరిగాయి, ఈ రంగంలో మరింత దృష్టిని కేంద్రీకరించి పనిచేయాల్సిన అవసరం ఉంది”. అని ఆయన అన్నారు.
“రిజర్వాయర్ల అవక్షేపణ కారణంగా డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం తగ్గింపుపై కృషి చేయాల్సిన అవసరం ఉంది. రిజర్వాయర్ సామర్థ్యాన్ని సరైన రీతిలో ఉపయోగించుకునేలా తగిన చొరవ తీసుకోవాలి. నదులను, చిత్తడి నేలలను సంరక్షించడం, పరివాహక ప్రాంతాలను కాపాడు కోవడం, వాటి క్షీణతను తగ్గించడం మన బాధ్యత. నిరంతర సరఫరాతో పాటు నీటి డిమాండ్ వైపుగా నిర్వహణపై కూడా మనం పని చేయాలి. నీటి వనరుల కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది, ఈ రెండు రోజుల్లో, మనమందరం ఈ సమస్యలను చర్చించాలి. ప్రతిరాష్ట్రం పాటించే ఉత్తమ కార్యక్రమాలనుంచి మనం నేర్చుకోవాలి. కొత్త మౌలిక సదుపాయాల సుస్థిర అభివృద్ధిని మరింత పటిష్టం చేయాలి. ఈ ముఖ్యమైన సమస్యలను సమగ్రంగా చర్చించడానికి, కలిసి పరిష్కారాలను సాధించడానికి, దేశాల పురోగతి, అభివృద్ధికి నీరు విఘాతం కలిగించకుండా చూసుకోవడానికి మనం నిరంతరం సమావేశాన్ని కొనసాగించాలి”. అంటూ కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ తన ప్రసంగాన్ని ముగించారు.
అంతకు ముందు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభోపన్యాసం చేశారు. అమూల్యమైన వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడానికి నీటిసంరక్షణ కోసం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని గురించి చౌహాన్ ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజల భాగస్వామ్యంతో కూడిన (జన భాగీదరి) ప్రాముఖ్యతను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన జీవితానుభవంలో చేపట్టిన కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. చెట్ల మూలాల్లోంచి నర్మదా నది వస్తుందని, అందుకే చెట్లు ఉంటేనే నదులు అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి అన్నారు. నీటి సంరక్షణ, నీటి లభ్యత పెంపు, వర్షపు నీటి సేకరణ, వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేయడం, ప్రతి నీటిచుక్కకు ఎక్కువ పంట పండించడం తదితర అంశాలను సమగ్రంగా అమలుచేసేలా తమ ప్రభుత్వం నెలరోజుల్లో నీటి విధానాన్ని రూపొందిస్తున్నట్లు చౌహాన్ తెలిపారు. జల జీవన్ పథకం గురించి ఆయన మాట్లాడారు. ఈ పథకంకింద దాదాపు రూ. 50,000 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని, ఇంతకుముందు 14శాతం ఇళ్లకు మాత్రమే కుళాయి నీరు అందించారని, ఇప్పుడు ఈ ఇళ్లను దాదాపు 47శాతానికి పెంచామని చెప్పారు.
నీటి ప్రాముఖ్యాన్ని గురించి ప్రబోధించిన రహీమ్, తులసీదాస్ ప్రవచనాలను, వేదాలను ఉటంకిస్తూ చౌహాన్ ప్రసంగించారు. నీటి వనరులను సద్వినియోగం చేసుకునేలా సాగుభూముల్లో చెరువులు నిర్మించాలని, చెట్లను ఎక్కువగా నాటాలని, ప్రతి నీటి చుక్కకూ మరింత ఎక్కువ పంట పండించాలని ఆయన సూచించారు. మొత్తం దేశానికి ప్రయోజనం చేకూర్చేలా పరిష్కారాలు ఏమిటో చర్చించుకోవాలని సూచించారు. ఈ పరిష్కారాలతో మధ్యప్రదేశ్ రాష్ట్రం కూడా ప్రయోజనం పొందుతుందని, ఇందుకోసం అన్ని చర్యలను తమ ప్రభుత్వం అమలు చేసి చూపెడుతుందని ముఖ్యమంత్రి చౌహాన్ చెప్పారు. ప్రధానమంత్రి ఇచ్చిన జనభాగీదరి సందేశాన్ని ఆయన పునరుద్ఘాటించారు. నీటి సంరక్షణ, చెట్ల పెంపకం కోసం రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు నిరంతరం కృషిచేస్తున్నారని అన్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలిచేందుకు తానుప్రతిరోజూ 3 చెట్లను నాటానని, రేపు ఉదయం అంటే 2023 జనవరి 6న తనతో కలిసి చెట్లను నాటాలని చౌహాన్ ఈ సందర్భంగా అందరినీ కోరారు. ఇలా చెట్లను నాటిన ప్రదేశాన్ని నీటి దార్శనికత ఉద్యానవనంగా పిలుస్తారని చెప్పారు. చెట్ల పెంపకం ద్వారా నీటిని సంరక్షించుకోవచ్చన్న సందేశాన్ని యావద్దేశానికి ఇది పంపుతుందని అన్నారు.
శుద్ధి చేసిన వ్యర్థ జలాల పునర్వినియోగంపై జాతీయ వ్యవస్థను, అవక్షేపణ నిర్వహణ కోసం జాతీయ వ్యవస్థను, జలశక్తి అభియాన్: వర్షపునీటిని ఒడిసిపట్టు పథకం కింద ఉత్తమ అను భవాలను పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా WRIS పోర్టల్ క్రింద 'జల ఇతిహాస్' సబ్-పోర్టల్‌ను కూడా వారు ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌తో పాటు ఆజాదీ మహోత్సవం నిర్వహించారు. తేనీటి విందు సమయంలో, నీటిని ఆదా చేయడం ద్వారా పండించిన చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలను అతిథులకు అందించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా -భారతదేశం@2047- కార్యక్రమం భారీ ప్రణాళికలో భాగంగా రానున్న 25 సంవత్సరాలవరకూ అంటే 2047 వరకు నీటి దార్శనికతను చర్చించడం ఈ సదస్సు ధ్యేయం. సమగ్ర ఆర్థిక, మానవాభివృద్ధికి స్థిరమైన పద్ధతిలో నీటి వనరులను ఉత్తమంగా ఉపయోగించుకునే మార్గాలపై చర్చించడానికి కీలకమైన విధాన రూపకర్తలను ఒకచోట చేర్చడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
"నీరు దార్శనికత@2047" పేరిట భోపాల్‌లో జరిగిన అఖిల భారత స్థాయి రాష్ట్రాల వార్షిక సదస్సును ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
"నీరు దార్శనికత@2047" పేరిట భోపాల్‌లో జరిగిన అఖిల భారత స్థాయి రాష్ట్రాల వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
"నీరు దార్శనికత@2047" పేరిట భోపాల్‌లో జరిగిన అఖిల భారత స్థాయి రాష్ట్రాల మంత్రుల వార్షిక సదస్సును ఉద్దేశించి
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగం
శుద్ధి చేయబడిన వ్యర్థ జలాల పునర్వినియోగంపై జాతీయ స్థాయి వ్యవస్థను, అవక్షేపణ నిర్వహణ కోసం జాతీయ వ్యవస్థను, జల్ శక్తి అభియాన్ కింద ఉత్తమ పద్ధతులు: నీటిని ఒడిసి పట్టండి అన్న కార్యక్రమాన్ని ప్రముఖులు ప్రారంభించారు.
ముఖ్య అతిథి, ప్రముఖుల ‘జలకలశ్’ ఉత్సవంతో రెండు రోజుల నీటి సదస్సు ప్రారంభమైంది.
తేనీటి విందు సందర్భంగా నీటి సంరక్షణతో సాగైన చిరుధాన్యాల పిండివంటలను అతిథులకు అందించారు.
ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం
*****
(Release ID: 1889102)
Visitor Counter : 297